బీసీ కులాల తొలగింపు సబబే
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులనుసమర్థించిన హైకోర్టు
పలువురు విద్యార్థులు, తల్లిదండ్రుల పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్: బీసీ కులాల జాబితా నుంచి కళింగ, గవర, తూర్పు కాపులు.. ఇలా 138 బీసీ కులాల నుంచి 26 కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. తమ కులాలను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101, 107లకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నాయని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుత తీర్పుపై సుప్రీంను ఆశ్రయించేందుకు వీలుగా రెండు వారాలు తీర్పు అమలును నిలుపుదల చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన భీమారావు కోరగా అందుకు న్యాయస్థానం తోసిపుచ్చింది.
టీ-ఏజీ వాదనలకు సమర్థన..
బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి రాసిన లేఖ ఆధారంగానే 26 కులాలను బీసీ కులాల జాబితా నుంచి తొలగించామని, అలాగే తెలంగాణలో మనుగడలో లేని కులాలను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్న తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. తెలంగాణ ప్రభుత్వం తొలగించిన కులాల్లో కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేవన్న బీసీ కమిషన్ వాదనలు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.