జీవో కొట్టేయాలంటూ హైకోర్టులో ‘పిల్’
హైదరాబాద్ : హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత నెల 4న జారీ చేసిన జీవో 24ను కొట్టివేయాలని కోరుతూ, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. గ్రేటర్ హైదరాబాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు మస్కు జాన్సన్ దీనిని దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. హైదరాబాద్ చుట్టుపక్కల తాటిచెట్లు లేకపోవడంతో స్వచ్ఛమైన కల్లు లభ్యం కాదని, అందుకే నగరానికి 50 కిలోమీటర్ల పరిధిలో కల్లు అమ్మకాలను నిషేధిస్తూ 2007లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటిషనర్ వివరించారు. ధర తక్కువగా ఉండటంతో పేద, దిగువ మధ్య తరగతులు కల్లుకు ఆకర్షితులై జీవితాలను నాశనం చేసుకునే అవకాశాలూ ఉన్నాయన్నారు. గీత కార్మికుల ఉపాధి పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న ప్రభుత్వం, కల్లు దుకాణాల వల్ల కలిగే దుష్పరిణామాలను ఆలోచించకుండానే జీవో జారీ చేసిందన్నారు. రాజకీయ లబ్ధికోసం జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలని అభ్యర్థించారు.
దశాబ్ద కాలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల తాటిచెట్లను భారీగా నరికేశారని, హైదరాబాద్‌లో ఉన్న 107 షాపులకు సరఫరా చేసే స్థాయిలో తాటిచెట్లు లేవని, దీంతో కల్తీ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పిటిషనర్ వివరించారు. దీనిని అడ్డుకునే యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. 2003-04 తరువాత తాటిచెట్ల గణన జరగలేదని, అప్పట్లో ఉన్నన్ని చెట్లు ఇప్పుడు లేవని, ఈ విషయం తెలిసీ 2003-04 నాటి గణాంకాల ఆధారంగానే లెసైన్సులు జారీ చేస్తున్నారని తెలిపారు. అంతేకాక కల్లు విక్రయాల ప్రభావం మద్యం విక్రయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గి, సంక్షేమ పథకాలు కుంటుపడే అవకాశం ఉందని జాన్సన్ తన పిటిషన్‌లో వివరించారు.
కల్లు దుకాణాలు వద్దు
Published Sun, Oct 12 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement
Advertisement