మార్గదర్శకాల ప్రకారమే ప్రకటన
కరువు మండలాలపై హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
హైదరాబాద్: కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కరీంనగర్ జిల్లాలోనూ ఆ మార్గదర్శకాలను అనుసరించే కరువు మండలాలను ప్రకటించినట్లు వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ) ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా.. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ సిఫారసులకు విరుద్ధంగా 40 మండలాలకుగాను కేవలం 19నే కరువు మండలాలుగా ప్రకటించడాన్ని సవా లు చేస్తూ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పిల్ వేసిన విషయం తెలిసిందే.
గతేడాది నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో సగ టు వర్షపాతం 713.6 మి.మి. ఉండగా, 610 మి.మి. మాత్రమే నమోదయిందని, ఈ నేపథ్యంలో కరువు మండలాల ప్రకటనకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి సిఫారసులు కోరిందని కౌంటర్‌లో మీనా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ 40 మండలాలను కరువు ప్రాంతాలుగా సిఫారసు చేయగా, కమిటీ 19 మండలాలనే ఓకే చేసిందన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, ఆ ప్రకారం కేశవపట్నానికి మాత్రమే కరువు మండలంగా గుర్తించే అర్హత ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టేయాలని మీనా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.