సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని జరీబు భూముల రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి నిర్బంధంగా భూములు సేకరించారని వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వాటిపై నిర్ణయాన్ని రెండు వారాల్లో వివరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టులో వివరించిన విషయం విధితమే. సీఆర్‌డీఏ నిబంధనలకు లోబడి భూ సమీకరణ చేశామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో చేసిన వాదనలో వాస్తవం లేదని జరీబు రైతులంతా మూకుమ్మడిగా పిటిషన్లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నియోజకవర్గానికి చేరుకుని గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాజధాని గ్రామాల రైతుల న్యాయ పోరాటానికి ఆర్కే సహకరిస్తున్నారు. ఆందోళన చెందుతున్న రైతులకు ధైర్యం చెబుతూ సీఆర్‌డీఏ చట్టంపై అవగాహన కలిగిస్తున్నారు. అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతుల భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశం లేదని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి రైతులు ఐక్యంగా న్యాయపోరాటానికి సిద్ధమైతే అందుకు పార్టీ పరంగా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు.
గ్రామాల వారీగా కలుస్తున్న రైతులను గ్రూపులుగా చేసి వారితో కోర్టులో పిటిషన్లు వేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ న్యాయపోరాటంలో ఎక్కడా లోపాలు లేకుండా ఉండేందుకు భూ సమీకరణను మొదటి నుంచి తాము వ్యతిరేకించామని, అధికారులు, పాలకుల దందా వలనే తాము అంగీకారపత్రాలు ఇచ్చామంటూ రైతులతో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు రిజిస్టర్డ్ లేఖ పంపే ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది రైతులు సోమ, మంగళవారాల్లో పటిషన్లు వేయనున్నారు.
న్యాయం జరిగే వరకు పోరాటం..
శనివారం మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో ఆర్కే రైతులతో సమావేశం అయ్యారు. 9.2 ఫారాలతో పాటు 9.3 ఫారాలు ఇచ్చిన రైతులంతా కేవలం భయపడి మాత్రమే భూములు ఇచ్చారని వారందరికి న్యాయం జరిగేవరకు పోరాడతానన్నారు. తొలివిడత కోర్టును ఆశ్రయించిన 32 మంది రైతుల విషయంలో స్పష్టమైందన్నారు.
మిగిలిన వారంతా కోర్టులో పిటిషన్ వేస్తే తొలి విడత కోర్టులో పిటిషన్ వేసిన రైతులకు వర్తించే న్యాయమే జరుగుతుందన్నారు. ఆదివారం బేతపూడి, నవులూరు, పెనుమాక, యర్రుపాలెం, ఉండవల్లి గ్రామాల్లో ఆర్కే పర్యటించనున్నారు. సోమవారం వరకు గ్రామాల్లో పర్యటించి న్యాయపరమైన పోరాటానికి రైతులను సిద్ధం చేస్తామని, మంగళవారం వారందరితో పిటిషన్లు వేయిస్తానని ఆర్కే సాక్షి ప్రతినిధికి వివరించారు.