సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం! | Syrian rebels sweep into Aleppo | Sakshi
Sakshi News home page

సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!

Published Mon, Dec 2 2024 5:18 AM | Last Updated on Mon, Dec 2 2024 5:18 AM

Syrian rebels sweep into Aleppo

తిరుగుబాటుదార్ల చేతికి అలెప్పో 

అమెరికా, పశ్చిమ దేశాల అండ 

అసద్‌ను గద్దె దించే దిశగా శరవేగంగా పరిణామాలు

సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్‌–రష్యా, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ యుద్ధాల్లో ఉన్నాయి.

2011లో ‘అరబ్‌ వసంతం’ పేరిట అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్‌ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్‌ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. 

సైన్యంలో అసద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్‌ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. 

అసద్‌ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్‌కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్‌ సైన్యంతో పాటు లెబనాన్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లా అసద్‌ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్‌ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. 

ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం 
సిరియా పరిణామాలను అల్‌ఖైదా, ఐసిస్‌ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్‌ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఎస్‌డీఎఫ్‌) సాయంతో విరుచుకుపడటంతో అల్‌ఖైదా, ఐసిస్‌ తోకముడిచి దేశం వీడాయి. 

కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు 
సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్‌ ప్రావిన్స్‌ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.

నాయకత్వం ఎవరిది? 
సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్‌ కమాండ్‌’కు హయత్‌ తా హ్రీర్‌ అల్‌–షామ్‌ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్‌–నుస్రా ఫ్రంట్‌ పేరు తో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు తాహ్రీర్‌ అల్‌–షామ్‌కు అండగా నిలుస్తున్నాయి.  

ఇప్పుడే ఎందుకీ అలజడి? 
అసద్‌ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్‌ కూడా ఇజ్రాయెల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్‌బొల్లా గ్రూప్‌కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్‌ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్‌ కమాండ్‌’ పేరిట కొత్త కూటమి కట్టారు. 

పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్‌కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్‌ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement