సిరియా తాజా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య అస్మా లుకేమియా (బ్లక్ క్యాన్సర్)తో పోరాడుతున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆమె బతికే అవకాశాలు సగమేనని సమాచారం. ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించేందుకు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్మా 2019లో రొమ్ము కేన్సర్ బారిన పడ్డారు. వ్యాధి నుంచి పూర్తిగా బయట పడ్డట్టు ఏడాది చికిత్స తరువాత ప్రకటించారు. కానీ కొంతకాలానికే ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు తేలింది.
అస్మా తల్లిదండ్రులు సిరియావాసులు. ఆమె 1975లో లండన్‌లో జన్మించారు. ఆమెకు బ్రిటిష్–సిరియా పౌరసత్వముంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యం చదివారు. 2000 డిసెంబర్‌లో బషర్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు సిరియాలో తిరుగుబాటు మొదలైనప్పటి నుంచే ఆస్మా తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోవడానికి ప్రయత్నించారు.
ఇటీవల తిరుగుబాటు సేనలు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అసద్ పదవీచ్యుతుడవడం తెలిసిందే. కుటుంబంతో సహా ఆయన రష్యాలో దలదాచుకుంటున్నారు. అయితే మాస్కో జీవితంపై అస్మా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. దేశం వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ రష్యా కోర్టుకు ఆమె పెట్టుకున్న దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు. అసద్ నుంచి విడాకుల కోసం కూడా అస్మా దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొచ్చినా వాటిని రష్యా ఖండించింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment