Leukemia disease
-
నవ్వులు పంచిన చింటుగాడు ఇక లేడు!
సోషల్ మీడియా ఎరాలో ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో ఊహించలేం. అలాగే ఆ వచ్చిన ఫేమ్ ఎంత త్వరగా పోతుందో కూడా చెప్పలేం. అయితే ఆ ఫేమ్‌ను కలకాలం గుర్తుండిపోయేలా చేసుకునేవాళ్లు కొందరే. ఈ క్రమంలో మనషులే కాదు.. మూగ జీవాలు సైతం విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలా ఇంటర్నెట్లో నవ్వుల పువ్వులు పూయించిన ఓ శునకం ఇక లేదు అనే వార్త ఇంటర్నెట్తో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంటర్నెట్లో ఇంతకాలం నవ్వులు పూయించిన చీమ్స్(Cheems) అనే శునకం ఇక లేదు. కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న ఆ కుక్క.. శనివారం ఉదయం సర్జరీ జరుగుతున్న టైంలో ప్రాణం విడిచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాని యాజమాని.. దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇంతకీ ఈ షిబా ఇనూ జాతి కుక్కకి.. మన తెలుగులో చింటుగాడు, చీమ్స్మావా అనే ట్యాగ్ కూడా ఉంది. View this post on Instagram A post shared by Cheems_Balltze (@balltze) చీమ్స్(Cheems Dog) అసలు పేరు బాల్టెజ్. ఏడాది వయసున్నప్పుడు హాంకాంగ్‌కు చెందిన ఓ కుటుంబం దాన్ని దత్తత తీసుకుంది. ఓ ఫొటోగ్రాఫర్ కారణంగా దీని ఫొటోలు ఇంటర్నెట్కు చేరాయి. 2013 చివర్లో విపరీతంగా దాని ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఏడాది టాప్ మీమ్‌గా చీమ్స్‌కు గుర్తింపు కూడా దక్కింది. మరీ ముఖ్యంగా కరోనా టైం నుంచి చీమ్స్ హవా నడిచింది. కోకొల్లలుగా మీమ్స్ పుట్టుకొచ్చాయి చీమ్స్పై. ఆ మహమ్మరి టైంలో మానసికంగా కుంగిపోయిన ఎంతో మందికి నవ్వులు పంచింది ఈ శునకం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చింటు పేరు మీద ఇప్పటికీ రకరకాల వెర్షన్లతో(అందులో డబుల్ మీనింగ్వే ఎక్కువ) మీమ్స్ కనిపిస్తుంటాయి. చీమ్స్ లేకపోతేనేం.. దాని మీమ్స్.. అది పంచిన నవ్వులతో ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందనేది అభిమానుల మాట. -
‘అమ్మా.. తలనొప్పి’ అంటూ కుప్పకూలింది
ఈరోజుల్లో చావు అనేది.. హఠాత్తుగా వచ్చి మనిషి ప్రాణాన్ని చుట్టేసుకుని వెళ్లిపోతోంది. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు.. వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తుండడంతో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక కారణాల కోసమూ పరిశోధకుల అన్వేషణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ జార్జియాలో ఓ టీనేజర్ మరణం.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలనొప్పితో బాధపడుతున్న ఆ టీనేజర్.. హఠాత్తుగా కుప్పకూలి ప్రాణం విడిచింది. ఈ మరణం వెనుక కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించగా.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదనే కామెంట్లు చేస్తున్నారు చాలామంది. 13 ఏళ్ల ఆ చిన్నారి పేరు జూలియా చావెజ్. కొలంబియా కౌంటీలోని హర్లీం మిడిల్ స్కూల్లో చదువుతోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన తలనొప్పి.. చెవినొప్పితో బాధపడింది. తల్లికి ఈ విషయం చెప్తే స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందామె. ఆ డాక్టర్ ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి యాంటీబయోటిక్స్ రాశాడు. అయితే గత ఆదివారం ఉదయం ఉన్నట్లుండి కుప్పకూలిందా అమ్మాయి. తల్లిదండ్రులు హుటాహుటిన ఓ పెద్దాసుపత్రికి తరలించగా.. లుకేమియా(రక్త క్యాన్సర్) కారణంగా మెదడు, ఊపిరితిత్తులు, కడుపు.. ఇలా ప్రతీ చోట రక్తస్రావం జరిగిందని షాక్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. తల్లిదండ్రుల ఎదుటే నొప్పితో విలవిలలాడిన ఆమె.. మృత్యువు చేతిలో ఓడింది. ఆ చిన్నారికి అలాంటి స్థితి ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలిసే మార్గం లేదని వైద్యులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. నిత్యం ఆడిపాడుతూ.. చదువుల్లో రాణిస్తూ.. మంచి మనసుతో అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి లేదన్న విషయాన్ని ఇంట్లోవాళ్లు, స్నేహితులు, టీచర్లు తట్టులేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఆస్పత్రి గడప తొక్కని ఆ చిన్నారి.. అర్ధాంతరంగా చిన్నవయసులోనే తనకు ఏం జబ్బు ఉందో కూడా తెలియకుండానే ప్రాణం విడిచింది. చావు చెప్పి రాదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడం లేదు. మన చేతుల్లో ఉండేది.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మాత్రమే!. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా ముందుకు పోతుంటారు చాలామంది. కానీ, ఒక్కోసారి దాని వెనుక విపరీతాలు ఉండొచ్చు. అందుకే ఎలాంటి సమస్య తలెత్తినా అప్రమత్తత అవసరం ఈరోజుల్లో. ఆరోగ్యంగా ఉండండి.. అయినవాళ్లతో సంతోషంగా గడపండి. -
పన్నేండేళ్ల బాలుడికి మాయదారి రోగం.. కుమారుడిని బతికించాలని వేడుకోలు
సహచర మిత్రులతో సరదాగా గడపాల్సిన ఆ బాలుడిని మాయదారి రోగం (లుకేమియా) దహిస్తోంది. రోజురోజుకూ ఒంట్లోని రక్తం తగ్గుతుండడంతో పసివాడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత తండ్రికి లేకపోవడంతో మనసున్న మారాజులు ముందుకు వచ్చి కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నాడు. సాక్షి, కోదాడ(నల్గొండ): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన చేకూరి రమేష్‌కు కుమార్తె శ్రీవల్లి (14), కుమారుడు సాగర్ ఉన్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, ఏడవ తరగతి చదుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్ భార్య కొన్నేళ్ల క్రితం విడిపోయి వేరేగా ఉంటోంది. రమేష్ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. సాగర్ అనారోగ్యం బారిన పడడంతో.. కొంతకాలంగా సాగర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. వంట్లో నలతగా భావించి తండ్రి స్థానికంగా వైద్యం చేయించేవాడు. అయితే, ఏప్రిల్ సాగర్ ఆరోగ్యం పూర్తిగా క్షణించిడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడంతో లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)గా వైద్యులు నిర్ధారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 45రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. చదవండి: రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్! వైద్య పరీక్షలకే అప్పుచేసి.. రమేష్‌ది పేద కుటుంబం. అతడికి ఇతడి ఉండేందుకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. లారీ డ్రైవర్‌గా వెళ్లిన క్రమంలో సోదరుడి ఇంట్లో పిల్లలను ఉంచి జీవనం సాగిస్తున్నాడు. ఉన్నపలంగా కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో డ్రైవర్ విధులకు వెళ్లకుండా బాలుడి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సాగర్ వైదానికి తన వద్ద ఉన్న కొద్ది మొత్తంతో పాటు అప్పు చేసి నెట్టుకొచ్చాడు. 9నెలల పాటు వైద్యం అందితేనే.. లుకేమియా(బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్న సాగర్‌కు రెండు రోజులకు ఒకమారు పరీక్షలు నిర్వహించి అవరం మేరకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలా తొమ్మిది నెలల పాటు చికిత్స అందితేనే మహమ్మారి బారి నుంచి బయటపడతానని పేర్కొంటున్నారు. అందుకు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు. అంతపెద్ద మొత్తం తన వద్ద లేదని ఓ వైపు కుమారుడి వేదన చూడలేకపోతున్నానని, రోదించడం తప్ప మరే దారి కనిపించడం లేదని వాపోతున్నాడు. దయార్థ హృదయం కల వారెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తన కొడుకు ప్రాణాలు దక్కుతాయని రమేష్ ప్రాథేయపడుతున్నాడు. కొడుకు ప్రాణాలు కాపాడాలి ఒక్కగానొక్క కొడుకు మాయదారి జబ్బు బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నాది నిరుపేద కుటుంబం. పూర్తిస్థాయిలో వైద్యం అందించే స్థోమత నాకు లేదు. దానగుణం గల వ్యక్తులు స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడాలి. పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. – చేకూరి సాగర్, చిన్నారి తండ్రి, ఆకుపాముల సాయం చేయాలనుకుంటే.. సాగర్ సోదరుడు బాలాజీ బ్యాంకు ఖాతా : 30543275599 ఎస్బీఐ, ఆకుపాముల బ్రాంచి ఐఎఫ్ఎస్సి కోడ్ : ఎస్బీఐయన్0002562 ఫోన్‌పే, గూగుల్‌పే నెం : 96761 37554 -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్‌లో కయాసన్‌కి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!
77 year Old Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్ స్కేటింగ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్స్టీన్ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్‌ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్ స్కేటింట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్ టీచర్ వద్ద ట్రైయినింగ్ కూడా తీసుకుంటాడు. ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకోవడమే కాక గురువుతో కలిసి స్కేటింగ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్‌ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher. For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE — Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021 -
క్యాన్సర్‌తో పోరాడి... ఒలింపిక్స్‌కు అర్హత
టోక్యో: సాధారణంగా ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు అందరూ క్వాలిఫయింగ్‌లో పోరాడతారు. కానీ జపాన్‌కు చెందిన మహిళా స్విమ్మర్ రికాకో ఐకీ మాత్రం క్యాన్సర్‌తో పోరాడింది. దానిని జయించి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. జపాన్ జాతీయ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో లక్ష్యదూరాన్ని ఆమె 57.77 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. రెండేళ్ల క్రితం లుకేమియా (రక్త క్యాన్సర్) బారిన పడిన ఆమె తాజా విజయంతో వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. -
రిషికపూర్ మృతి: లుకేమియా వ్యాధి లక్షణాలు!
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ క్యాన్సర్‌తో పోరాడి గురువారం మృతి చెందారు. గత రెండేళ్లుగా లుకేమియా వ్యాధితో బాధపుడుతున్న ఆయన ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ప్రశాంత మరణాన్ని పొందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అసలు లుకేమియా అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? (రిషి కపూర్ లాస్ట్ ట్వీట్ అదే..) లుకేమియా అంటే ఏమిటి? సాధారణంగా దీన్ని బ్లడ్‌క్యాన్సర్ అంటుంటారు. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య అధిక సంఖ్యలో ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఉండాల్సిన సంఖ్య కంటే అధిక సంఖ్యలో ఉంటే అవి ఎర్ర రక్త కణాలను, ప్లేట్లేట్స్ ఉత్పత్తి తగ్గిస్తాయి. మన శరీరానికి అవసరమైనన్ని ఎర్రరక్తకణాలను ఉత్పత్తి జరగకుండా వాటిని బలహీన పరుస్తాయి. అవి బలహీన పడటం వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి తగ్గి రక్తకణజాలల్లో కణుతులు ఏర్పడటమే కాకుండా ఎముక మజ్జలో కూడా కణుతులు ఏర్పడతాయి. ఇవే లుకేమియాకు దారిస్తాయి. దీనివల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి రోజుకు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్ కుమారుడు) లుకేమియాలో రకాలు.. లుకేమియాల్లో చాలా రకాలున్నా, వాటిలో తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి... అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా. అయితే కొన్నిసార్లు ఇతర క్యాన్సర్లు ఎముక మజ్జలోకి వ్యాపించే అవకాశం ఉన్న ఉన్నా అవి లుకేమియాలు కావని గ్రహించాలి. లక్షణాలు లుకేమియా బారిన పడిన వ్యక్తులు శరీర ఆరోగ్యాన్ని బట్టి కొంత మంది వేగంగా, నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. వేగంగా పెరిగే లుకేమియా రోగులకు అలసట, బరువు తగ్గడం, తరచూ అంటువ్యాధులు, సులభంగా రక్తస్రావం లేదా గాయాలు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే నెమ్మదిగా పెరిగా లుకేమియా రోగులలో చాలా మందికి ఈ లక్షణాలు తక్కువగా కనిపించవు. ఇక లుకేమియాతో బాధపడే వారికి ఎముకలు, కీళ్లలో నొప్పి ఉంటుంది. మైకం, జ్వరం, ఆకలి లేకపోవడం, నోటిలో పుండ్లు, పల్లర్, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, వాపు శోషరస కణుపులు, అనుకోకుండా బరువు తగ్గడం, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. చికిత్స లుకేమియాకు సాధారణ చికిత్సగా కీమోథెరపీను ఇస్తారు. కొన్ని సందర్భాల్లో కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, ఇమ్యునోథెరపీని ఇస్తారు. ఇవి పని చేయని పక్షంలో ఎముక మజ్జ మార్పడి చికిత్సను చేయాల్సి వస్తుంది. -
రమ్య అనే నేను..
నేరేడ్మెట్: చిన్నతనం నుంచి చలాకీగా తిరుగుతూ..చదువులో చురుకుదనం..ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆ బాలికపై విధి చిన్న చూపు చూసింది. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఎంతో ఆశించింది. పోలీస్ కమిషనర్ కావాలనేది ఆమె జీవితాశయం. అయితే ప్రాణాంతక వ్యాధి రూపంలో మృత్యువు ఆమెను కబలిస్తోంది. మరణానికి చేరువలో ఉన్న ఆమె కలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ నేరవేర్చారు. నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ ఇందుకు వేదికైంది. వివరాల్లోకి వెళితే... ఓల్డ్ అల్వాల్‌కు చెందిన నర్సింహ, పద్మ దంపతుల కుమార్తె రమ్య(17). స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్(ఎంపీసీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు(ఆంకాలజీ) కిరణ్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న రమ్యకు పోలీసు కమిషనర్ కావాలనేది జీవితాశయం. పోలీసు అధికారులు,మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులతో రమ్య ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ నిర్వాహకులు రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్‌ను కలిసి రమ్య కోరికను వివరించారు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. దీంతో మంగళవారం ఫౌండేషన్ ప్రతినిధులు, తల్లిదండ్రులు, రమ్యను కమిషనరేట్‌కు తీసుకువెళ్లి సీపీ మహేష్‌భగవత్‌ను కలిశారు. పోలీస్ యూనిఫాంలో కమిషరేట్‌కు వచ్చిన రమ్యకు కార్యాలయం సిబ్బంది, అధికారులు గౌరవ వందనం చేశారు. రాచకొండ కమిషనర్‌గా మహేష్‌భగవత్ రమ్యకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీపీ ఆమెను స్వయంగా కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టారు. రిజిస్టర్లో సంతకం చేసి, ఒక రోజు కమిషనర్‌గా రమ్య విధులు నిర్వర్తించారు. 2017లో ఎహ్హాన్ అనే బాలుడు ఇదే తరహాలో ఒక రోజు కమిషనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీపీ మహేష్‌భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ రమ్య త్వరలోనే కోలుకోవాలని కోరారు. ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రమ్య సీపీతో పాటు ఇతర అధికారులకు శెల్యూట్ చేసి, తనకు ఒక రోజు కమిషనర్‌గా అవకాశం కల్పించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు శిల్పవల్లి, శామీర్, రమ్య తల్లిదండ్రులు నర్సింహ్మ, పద్మ, ఫౌండేషన్ ప్రతినిధులు ప్రియాజోషి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది.. ఒక రోజు రాచకొండ కమిషనర్‌గా పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలి. ఠాణాల్లో 5 ఎస్‌ల అమలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కమిషనరేట్‌కు పేరు తెచ్చాయి. మహిళల భద్రత, రక్షణకు షీటీంలు బాగా పని చేస్తున్నాయి.–రమ్య -
నిట్ విద్యార్థికి లుకేమియా
వైద్యానికి రూ.40 లక్షలు.. ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు గార్ల(ఇల్లందు)/కాజీపేట అర్బన్: వరంగల్ నిట్ విద్యార్థి తేజావత్ మంగీలాల్ లుకేమియా వ్యాధి బారిన పడగా వైద్య ఖర్చుకు డబ్బు లేకపోవడంతో ప్రభుత్వం, దాతలు ఆదుకో వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మహబూబా బాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ పరిధి చిన్నబంజారకి చెందిన తేజావత్ మంచ, రంగీ దంపతులు నిరుపేద కూలీలు. వారి కుమారుడు మంగీలాల్ వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. ఎలాంటి కోచింగ్‌కు వెళ్లకుండా, ఇంటి వద్దే చదివి నిట్‌లో సీటు సాధించాడు. గతేడాదే మంగీలాల్ ఈ వ్యాధి బారిన పడ్డాడు. అదే గ్రామానికి చెందిన బంజార సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ జోగిరాం రూ.80 వేలు, ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ద్వారా రూ.1.50 లక్షల వరకు ఆర్థికసాయం అందించి వైద్యం చేయించారు. ఆరు నెలల తర్వాత వ్యాధి మళ్లీ తిరగబడింది. హైదరాబాద్ లోని కేన్సర్ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేసి లుకేమియా వ్యాధి సోకిందని, వైద్యం కోసం రూ.40 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. వైద్యం చేయించకపోతే మంగీలాల్ 3 నెలలపాటు మాత్రమే బతుకుతాడని తేల్చిచెప్పారు. తల్లిదండ్రులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రగతిభవన్‌కు పలుమార్లు వెళ్లగా సెక్యూరిటీ గార్డులు రానివ్వడం లేదని వాపోయారు. తమ కుమారుడిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటు న్నారు. తేజావత్ మంగీలాల్, ఎస్బీఐ అకౌంట్ నంబరు 353909 59584(సీఐఎఫ్ కోడ్: 88787660820, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0007167), వడ్డేపల్లి బ్రాంచ్, హన్మకొండలో విరాళాలు జమచేయాలని, 94400 64623 సెల్ నంబర్లో సంప్రదిం చాలని కోరుతున్నారు. కాగా, నిట్ విద్యార్థులు, స్నేహితులు మిలాప్ యాప్ ద్వారా రూ.11 లక్షలు సేకరించారు. ఇవి కేవలం కీమోథెరపీకి మాత్రమే సరిపోతాయని, బోన్‌మ్యారో చికిత్స కోసం డబ్బులు కావాలని విద్యార్థులు చెబుతున్నారు. వైద్యం చేయిస్తాం: కలెక్టర్ మహబూబాబాద్: మంగీలాల్‌కు మెరుగైన వైద్యం చేయిస్తామని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా అన్నారు. ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి నిమ్స్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. -
ఎంవోయూల బాధ్యత ఏపీఈడీబీదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ సాక్షి, అమరావతి: ఎంవోయూలు కుదుర్చుకోవడంతోనే సరిపెట్టకుండా అవి కార్యరూపం దాల్చే వరకూ చూసే బాధ్యత ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు)దేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ సంస్థ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎంవోయూల పురోగతిని వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించారు. రంగాలవారీగా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయడానికి కన్సల్టెంట్లను నియమించాలని చెప్పారు. ఆగ్రో ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటికి ఒక్కో రంగానికి కనీసం 500 డీపీఆర్‌లు రూపొందించాలన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.3.66 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 65 ఎంవోయూలను ఈడీబీ కుదుర్చుకుందని అధికారులు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాది చైనా, అమెరికా, రష్యా, కెనడా సహా మొత్తం 12 దేశాల్లో 20 రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు చెప్పారు. వైద్యం కోసం ముస్లిం మహిళకు రూ.8 లక్షలు మంజూరు లుకేమియా వ్యాధితో బాధపడుతున్న గుంటూరుకు చెందిన పేద ముస్లిం మహిళ ఆయేషా శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసింది. తన వ్యాధి గురించి చెప్పి వైద్యులు వెల్లూరు క్రిస్టియన్ కాలేజీలో చికిత్సకు సిఫారసు చేశారని తెలిపింది. ఆయన సీఎం సహాయ నిధి నుంచి రూ.8 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నగరాలకు ప్రత్యేక ఫెడరేషన్ రాష్ట్రంలోని నగరాల సామాజికవర్గం ఆర్థిక అభ్యున్నతికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం ఏపీ నగరాల సామాజికవర్గం ప్రత్యేక బృందం సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకుంది.