ప్రతీకాత్మక చిత్రం
ఈరోజుల్లో చావు అనేది.. హఠాత్తుగా వచ్చి మనిషి ప్రాణాన్ని చుట్టేసుకుని వెళ్లిపోతోంది. కరోనా తర్వాత ఇలాంటి మరణాలు.. వయసుతో సంబంధం లేకుండా సంభవిస్తుండడంతో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ మరణాల వెనుక కారణాల కోసమూ పరిశోధకుల అన్వేషణ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. యూఎస్ స్టేట్ జార్జియాలో ఓ టీనేజర్ మరణం.. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. తలనొప్పితో బాధపడుతున్న ఆ టీనేజర్.. హఠాత్తుగా కుప్పకూలి ప్రాణం విడిచింది. ఈ మరణం వెనుక కారణాన్ని వైద్యులు తాజాగా వెల్లడించగా.. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదనే కామెంట్లు చేస్తున్నారు చాలామంది.
13 ఏళ్ల ఆ చిన్నారి పేరు జూలియా చావెజ్. కొలంబియా కౌంటీలోని హర్లీం మిడిల్ స్కూల్‌లో చదువుతోంది. అయితే వారం రోజులుగా విపరీతమైన తలనొప్పి.. చెవినొప్పితో బాధపడింది. తల్లికి ఈ విషయం చెప్తే స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లిందామె. ఆ డాక్టర్ ఇన్‌ఫెక్షన్ సోకిందని చెప్పి యాంటీబయోటిక్స్ రాశాడు. అయితే గత ఆదివారం ఉదయం ఉన్నట్లుండి కుప్పకూలిందా అమ్మాయి.
తల్లిదండ్రులు హుటాహుటిన ఓ పెద్దాసుపత్రికి తరలించగా.. లుకేమియా(రక్త క్యాన్సర్) కారణంగా మెదడు, ఊపిరితిత్తులు, కడుపు.. ఇలా ప్రతీ చోట రక్తస్రావం జరిగిందని షాక్ ఇచ్చారు. అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని చెప్పారు. తల్లిదండ్రుల ఎదుటే నొప్పితో విలవిలలాడిన ఆమె.. మృత్యువు చేతిలో ఓడింది.
ఆ చిన్నారికి అలాంటి స్థితి ఉందని ఆమె తల్లిదండ్రులకు తెలిసే మార్గం లేదని వైద్యులు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. నిత్యం ఆడిపాడుతూ.. చదువుల్లో రాణిస్తూ.. మంచి మనసుతో అందరితో కలివిడిగా ఉండే ఆ చిన్నారి లేదన్న విషయాన్ని ఇంట్లోవాళ్లు, స్నేహితులు, టీచర్లు తట్టులేకపోతున్నారు. పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఆస్పత్రి గడప తొక్కని ఆ చిన్నారి.. అర్ధాంతరంగా చిన్నవయసులోనే తనకు ఏం జబ్బు ఉందో కూడా తెలియకుండానే ప్రాణం విడిచింది.
చావు చెప్పి రాదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మరణం సంభవిస్తుందో తెలియడం లేదు. మన చేతుల్లో ఉండేది.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడం మాత్రమే!. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. చిన్నచిన్న అనారోగ్యాలను పట్టించుకోకుండా ముందుకు పోతుంటారు చాలామంది. కానీ, ఒక్కోసారి దాని వెనుక విపరీతాలు ఉండొచ్చు. అందుకే ఎలాంటి సమస్య తలెత్తినా అప్రమత్తత అవసరం ఈరోజుల్లో. ఆరోగ్యంగా ఉండండి.. అయినవాళ్లతో సంతోషంగా గడపండి.
Comments
Please login to add a commentAdd a comment