సోషల్ మీడియా ఎరాలో ఎప్పుడు ఎవరు ఎలా పాపులర్ అవుతారో ఊహించలేం. అలాగే ఆ వచ్చిన ఫేమ్ ఎంత త్వరగా పోతుందో కూడా చెప్పలేం. అయితే ఆ ఫేమ్‌ను కలకాలం గుర్తుండిపోయేలా చేసుకునేవాళ్లు కొందరే. ఈ క్రమంలో మనషులే కాదు.. మూగ జీవాలు సైతం విపరీతంగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలా ఇంటర్నెట్‌లో నవ్వుల పువ్వులు పూయించిన ఓ శునకం ఇక లేదు అనే వార్త ఇంటర్నెట్‌తో కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఇంటర్నెట్‌లో ఇంతకాలం నవ్వులు పూయించిన చీమ్స్(Cheems) అనే శునకం ఇక లేదు. కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న ఆ కుక్క.. శనివారం ఉదయం సర్జరీ జరుగుతున్న టైంలో ప్రాణం విడిచింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన దాని యాజమాని.. దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇంతకీ ఈ షిబా ఇనూ జాతి కుక్కకి.. మన తెలుగులో చింటుగాడు, చీమ్స్‌మావా అనే ట్యాగ్ కూడా ఉంది.
చీమ్స్(Cheems Dog) అసలు పేరు బాల్టెజ్. ఏడాది వయసున్నప్పుడు హాంకాంగ్‌కు చెందిన ఓ కుటుంబం దాన్ని దత్తత తీసుకుంది. ఓ ఫొటోగ్రాఫర్ కారణంగా దీని ఫొటోలు ఇంటర్నెట్‌కు చేరాయి. 2013 చివర్లో విపరీతంగా దాని ఫొటోలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ ఏడాది టాప్ మీమ్‌గా చీమ్స్‌కు గుర్తింపు కూడా దక్కింది.
మరీ ముఖ్యంగా కరోనా టైం నుంచి చీమ్స్ హవా నడిచింది. కోకొల్లలుగా మీమ్స్ పుట్టుకొచ్చాయి చీమ్స్‌పై. ఆ మహమ్మరి టైంలో మానసికంగా కుంగిపోయిన ఎంతో మందికి నవ్వులు పంచింది ఈ శునకం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చింటు పేరు మీద ఇప్పటికీ రకరకాల వెర్షన్‌లతో(అందులో డబుల్ మీనింగ్‌వే ఎక్కువ) మీమ్స్ కనిపిస్తుంటాయి.
చీమ్స్ లేకపోతేనేం.. దాని మీమ్స్.. అది పంచిన నవ్వులతో ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందనేది అభిమానుల మాట.
Comments
Please login to add a commentAdd a comment