ఎంవోయూల బాధ్యత ఏపీఈడీబీదే
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ఎంవోయూలు కుదుర్చుకోవడంతోనే సరిపెట్టకుండా అవి కార్యరూపం దాల్చే వరకూ చూసే బాధ్యత ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు)దేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ సంస్థ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎంవోయూల పురోగతిని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. రంగాలవారీగా ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయడానికి కన్సల్టెంట్లను నియమించాలని చెప్పారు. ఆగ్రో ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటికి ఒక్కో రంగానికి కనీసం 500 డీపీఆర్‌లు రూపొందించాలన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.3.66 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 65 ఎంవోయూలను ఈడీబీ కుదుర్చుకుందని అధికారులు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే ఏడాది చైనా, అమెరికా, రష్యా, కెనడా సహా మొత్తం 12 దేశాల్లో 20 రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
వైద్యం కోసం ముస్లిం మహిళకు రూ.8 లక్షలు మంజూరు
లుకేమియా వ్యాధితో బాధపడుతున్న గుంటూరుకు చెందిన పేద ముస్లిం మహిళ ఆయేషా శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిసింది. తన వ్యాధి గురించి చెప్పి వైద్యులు వెల్లూరు క్రిస్టియన్ కాలేజీలో చికిత్సకు సిఫారసు చేశారని తెలిపింది. ఆయన సీఎం సహాయ నిధి నుంచి రూ.8 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
నగరాలకు ప్రత్యేక ఫెడరేషన్
రాష్ట్రంలోని నగరాల సామాజికవర్గం ఆర్థిక అభ్యున్నతికి ఫెడరేషన్ ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో శుక్రవారం ఏపీ నగరాల సామాజికవర్గం ప్రత్యేక బృందం సీఎంను కలిసి తమ సమస్యలు చెప్పుకుంది.