సిరియాలో సీఎన్‌ఎన్ విడిపించింది ఓ నేర చరితున్ని
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది.
అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్‌ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్‌ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది.
అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్‌ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు.
అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్‌ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్‌ఎన్‌ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది.
అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది.
అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్‌ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్‌ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment