Asma Al- Assad
-
అసద్ భార్య విడాకుల పిటిషన్
మాస్కో: పదవీచ్యుత సిరియా అధ్యక్షుడు బషర్ అల్–అసద్ భార్య ఆస్మా(49) విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రష్యాను వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కూడా ఆమె అభ్యర్థించారు. ఆమె దరఖాస్తును మాస్కోలోని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నెలారంభంలో తిరుగుబాటుదార్లు అసద్ ప్రభుత్వాన్ని కూలదోయడం, అధ్యక్షుడు రష్యాకు కుటుంబం సహా పలాయనం కావడం తెలిసిందే. రష్యా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పించింది. అయితే, వారిపై పలు ఆంక్షలను విధించింది. అసద్, ఆయన కుటుంబీకులను మాస్కో వీడి వెళ్లరాదని, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదని కట్టడి చేసింది. అసద్ తమ వద్ద దాచిన 270 కిలోల బంగారం, సుమారు రూ.17 వేల కోట్ల ధనంతోపాటు, మాస్కోలోని 18 అపార్టుమెంట్లు తదితర ఆస్తులను రష్యా ప్రభుత్వం స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్మా అల్–అసద్ రష్యాలో ఉండేందుకు అంగీకరించడం లేదని, పుట్టి పెరిగిన లండన్ వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. సిరియన్ల కుటుంబంలో లండన్‌లో జన్మించిన ఆస్మా అక్కడే చదువుకున్నారు. 25 ఏళ్ల వయస్సులో 2000వ సంవత్సరంలో సిరియా వెళ్లారు. అదే ఏడాది అసద్‌తో ఆమె వివాహమైంది. ఆమెకు ద్వంద పౌరసత్వం ఉంది. ఇలా ఉండగా, అసద్ సోదరుడు మహెర్ అల్–అసద్ అతడి కుటుంబానికి రష్యా అధికారికంగా ఆశ్రయం కల్పించలేదు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. మహెర్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచి, ఆస్తుల్ని స్తంభింపజేసినట్లు చెబుతున్నారు. -
అసద్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
మాస్కో: గడిచిన మూడేళ్లుగా జాతీయ సైన్యానికి, తిరుగుబాటు దళాలు, ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతోన్న యుద్ధంతో సిరియా అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకు అక్కడ 10 లక్షల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మద్దతుగా రష్యా కూడా దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహానికి నిదర్శనంగా సిరియా అధ్యక్షుడు అసద్ సతీమణి ఆస్మా అసద్.. రష్యన్ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ క్రమంలోనే మంగళవారం రొసియా24 చానెల్ ప్రసారమైన కార్యక్రమంలో ఆస్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొందరు తనను సంప్రదించారని, సిరియా విడిచి వెళ్లిపోవాలని కోరానని, తద్వారా అధ్యక్షుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగినట్లు ఆస్మా వెల్లడించారు. 'మిమ్మల్ని, మీ ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా సిరియా సరిహద్దులు దాటిస్తాం. ప్రవాసంలో కూడా మీ జోలికి ఎవరూ రాకుండా చూస్తాం. ఇక్కడి నుంచి వెళ్లండి..'అని అసద్ వ్యతిరేకులు తనతో అన్నారని, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు ఆస్మా తెలిపారు. బ్రిటన్ లో నివసించే సిరియన్ జంటకు జన్మించిన ఆస్మా.. లండన్ కింగ్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో అసద్ ను పెళ్లాడారు. పరిపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోన్న ఆస్మా.. సిరియా భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు.