అసద్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
అసద్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
Published Wed, Oct 19 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
మాస్కో: గడిచిన మూడేళ్లుగా జాతీయ సైన్యానికి, తిరుగుబాటు దళాలు, ఐసిస్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతోన్న యుద్ధంతో సిరియా అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకు అక్కడ 10 లక్షల మంది చనిపోయి ఉంటారని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు నిర్ధారిస్తున్నాయి. ప్రస్తుతం సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు మద్దతుగా రష్యా కూడా దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహానికి నిదర్శనంగా సిరియా అధ్యక్షుడు అసద్ సతీమణి ఆస్మా అసద్.. రష్యన్ టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఆ క్రమంలోనే మంగళవారం రొసియా24 చానెల్ ప్రసారమైన కార్యక్రమంలో ఆస్మా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కొందరు తనను సంప్రదించారని, సిరియా విడిచి వెళ్లిపోవాలని కోరానని, తద్వారా అధ్యక్షుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగినట్లు ఆస్మా వెల్లడించారు. 'మిమ్మల్ని, మీ ముగ్గురు పిల్లల్ని సురక్షితంగా సిరియా సరిహద్దులు దాటిస్తాం. ప్రవాసంలో కూడా మీ జోలికి ఎవరూ రాకుండా చూస్తాం. ఇక్కడి నుంచి వెళ్లండి..'అని అసద్ వ్యతిరేకులు తనతో అన్నారని, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు ఆస్మా తెలిపారు. బ్రిటన్ లో నివసించే సిరియన్ జంటకు జన్మించిన ఆస్మా.. లండన్ కింగ్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో అసద్ ను పెళ్లాడారు. పరిపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోన్న ఆస్మా.. సిరియా భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు.
Advertisement
Advertisement