Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్‌ అరెస్టయితే అంతర్యుద్ధమా? | Toshakhana case: Imran Khan Arrest Preparations | Sakshi
Sakshi News home page

Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్‌ అరెస్టయితే అంతర్యుద్ధమా?

Published Fri, Mar 17 2023 4:24 AM | Last Updated on Fri, Mar 17 2023 7:45 AM

Toshakhana case: Imran Khan Arrest Preparations - Sakshi

పాకిస్తాన్‌ తెహ్రీకీ ఇన్సాఫ్‌ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్‌ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్‌ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్‌ న్యాయమూర్తి జఫర్‌ ఇక్బాల్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే అరెస్ట్‌ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్‌ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్‌ అయ్యారు. దీంతో ఇమ్రాన్‌ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్‌ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్‌ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది.  

ఏమిటీ తోషఖానా కేసు..?  
తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్‌ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి.

2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్‌ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు.  

పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ ఏమంటోంది?  
ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్‌ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ ఇమ్రాన్‌ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది.  

37 కేసులు
ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతా­ల్లో 37 కేసులు నమోదయ్యాయి.  
► పాకిస్తాన్‌ ఎన్నికల కమిషన్‌ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్‌ సుల్తాన్‌ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీ­ఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది
► ఎన్నికల కమిషన్‌ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై  కేసు దాఖలైంది
► పాకిస్తాన్‌ ఫారెన్‌ ఎక్స్ఛ్‌ంజ్‌ యాక్ట్‌ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు  
► పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు  
► పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) నేత మొహ్‌సిన్‌ షానావజా రంజా ఇమ్రాన్‌ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు


అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..?  
ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయితే పాకిస్తాన్‌లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్‌ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్‌ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్‌ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్‌ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది.

మరోవైపు పంజాబ్‌ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్‌ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement