Sessions Judge
-
జడ్జి కుమారుడిపై ఫిర్యాదు తీసుకోరా?
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్‌స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి. ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ ఓదెల వెంకట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది. సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలు కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్‌గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్‌జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు. ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఎస్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్కు హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా? ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్హెచ్ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్‌కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్హెచ్ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది. ‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్హెచ్ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే. ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్హెచ్ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్‌కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్హెచ్ఓ ఉల్లంఘించారు. అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్‌లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్హెచ్ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది. -
Imran Khan: తోషఖానా టు బందీఖానా! ఇమ్రాన్ అరెస్టయితే అంతర్యుద్ధమా?
పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. తోషఖానా కేసులో తనపైనున్న నాన్‌బెయిలబుల్ వారెంట్లను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. పోలీసులకు లొంగిపోవాలని సూచించింది. ఇమ్రాన్ తనంతట తాను లొంగకపోతే మార్చి 18లోగా అరెస్ట్ చేసి కోర్టు ఎదుట ప్రవేశపెట్టాలని సెషన్స్ న్యాయమూర్తి జఫర్ ఇక్బాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అరెస్ట్ చేయాలని ఆదేశించామని మళ్లీ వారెంట్ల రద్దు పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. దీంతో ఇమ్రాన్ ఎదుట ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. శనివారం నాడు ఆయన అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయడానికి 10 రోజుల క్రితం పోలీసులు ప్రయత్నించినప్పట్నుంచి పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. పోలీసులు ఇమ్రాన్ నివాసానికి వెళ్లిన ప్రతీసారి ఆయన ఇంట్లో లేకపోవడం, కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ ఘర్షణకు దిగడం సర్వసాధారణంగా మారింది. ఏమిటీ తోషఖానా కేసు..? తోషఖానా.. అంటే ప్రభుత్వానికి దేశ విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే కానుకల ఖజానా. 1974లో ఇది ఏర్పాటైంది. ప్రభుత్వ అధికారులకొచ్చే కానుకల్ని ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిని చేపట్టాక తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. అంతేకాదు తనకు వచ్చిన కానుకల్ని ఎంతో కొంత ధర ఇచ్చి తోషఖానా నుంచి తీసుకొని వాటిని తిరిగి అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా 101 కానుకలు వచ్చాయి. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన వాటికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ముకున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు లేదు. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఏమంటోంది? ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు రిజిస్టర్ అయిన రెండు నెలల తర్వాత పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఆ కానుకల్ని అమ్ముకోవడం చట్ట వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఎంతో కొంత ధర చెల్లించి ఆయన ఆ కానుకల్ని తన సొంతం చేసుకున్నారని చెప్పింది. అయితే ఆయన అనైతికంగా ఈ పని చేస్తూ తప్పు దారి పట్టించే ప్రకటనలు చేశారంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. 37 కేసులు ఇమ్రాన్‌ఖాన్‌పై తోషఖానాతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 37 కేసులు నమోదయ్యాయి. ► పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) ప్రధాన ఎన్నికల అధికారి సికందర్ సుల్తాన్ రజాకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌తో పాటు పీటీఐ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఒక కేసు నమోదైంది ► ఎన్నికల కమిషన్ అయిదేళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ అనర్హత వేటు వేసినప్పుడు ఈసీపీ కార్యాలయం ఎదుట నిరసనలు నిర్వహించడంపై కేసు దాఖలైంది ► పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్ఛ్ంజ్ యాక్ట్ నియమాలను ఉల్లంఘిస్తూ విదేశాల నుంచి ఆర్థిక లావాదేవీలు నడిపారన్న ఆరోపణలపై కేసు ► పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ని ఉల్లంఘిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు కేసు ► పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) నేత మొహ్సిన్ షానావజా రంజా ఇమ్రాన్ ఆదేశాల మేరకే తనను పోలీసులు కొట్టి చంపడానికి వచ్చారంటూ హత్యా యత్నం కేసు పెట్టారు అరెస్టయితే అంతర్యుద్ధం తప్పదా..? ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయితే పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాను అరెస్ట్ అయితే ఏం చెయ్యాలన్న దానిపైనా ఇమ్రాన్ పక్కా ప్రణాళికతోనే ఉన్నారు. దానిని సరైన సమయంలో బయటపెడతానని ఆయన చెబుతున్నారు. తమ నేతపై చెయ్యి వేస్తే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆత్మాహుతి దాడులకి దిగుతామని ఇప్పటికే పార్టీ నాయకులు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పాక్ ప్రభుత్వానికి పీటీఐ కార్యకర్తల సవాల్ ఎదుర్కోవడం కూడా క్లిష్టంగా మారింది. మరోవైపు పంజాబ్ ర్యాలీలో ఇమ్రాన్‌పై దాడి జరిగిన దగ్గర్నుంచి ఆయనను హత్య చేస్తారన్న ఆందోళనలూ ఉన్నాయి. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన ఇప్పటివరకు కోర్టు ఎదుట కూడా హాజరు కాలేదు. ప్రభుత్వ పెద్దలే తనను హత్య చెయ్యడానికి కుట్ర పన్నుతున్నారంటూ ఇమ్రాన్ తనకు అనుమానం ఉన్న వారందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. తనని జైలుకు పంపినా, చంపేసినా ప్రభుత్వంపై పోరాటం ఆపవద్దంటూ అనుచరుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆవు పేడతో కట్టిన ఇళ్లతో అణుధార్మికత నుంచి రక్షణ
వియారా(గుజరాత్): ఆవు పేడతో నిర్మించిన ఇళ్లు అణుధార్మికత నుంచి రక్షణ ఇస్తాయనే విషయం సైన్సు నిరూపించిందని గుజరాత్‌లోని తాపి జిల్లా సెషన్స్ జడ్జి సమీర్ వ్యాస్ పేర్కొన్నారు. గో మూత్ర ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుందని తెలిపారు. అందుకే దేశంలోని గోవులను, వధించడం మానేసి రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడిన ఓ వ్యక్తికి శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పులో ఈ విషయాలను ఆయన పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన తీర్పు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ప్రపంచంలోని అన్ని సమస్యలకు గోవధే కారణమని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన మహ్మద్ అమిన్ అంజుమ్(20) 2020లో గుజరాత్ నుంచి ఆవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. -
జడ్జి హత్యపై నివేదిక ఇవ్వండి
న్యూఢిల్లీ: ధన్‌బాద్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు ప్రగతిని తమకు తెలియజేయాలని కోరింది. అదేవిధంగా, జడ్జి మృతిపై జార్ఖండ్ హైకోర్టు చేపట్టిన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. వారం తర్వాత జరిగే విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టింది. -
సెలవుల మంజూరు అధికారం పునరుద్ధరణ
ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల పరిధిలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీలకు సెలవుల మంజూరు విషయంలో ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు పునరుద్ధరించింది. ఈ మేరకు హైకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో న్యాయాధికారులందరూ నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ జాబితాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో న్యాయాధికారులు మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని నిర్ణయించారు. ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీల సెలవుల మంజూరుకు సంబంధించి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు ఉపసంహరించింది. తదుపరి ఉత్తర్వుల జారీ వరకు ఉపసంహరణ కొనసాగుతుందని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. సెలవుల దరఖాస్తులను ఫ్యాక్స్ ద్వారా హైకోర్టుకు పంపాలని జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలను ఆదేశించింది. కాగా, సెలవుల మంజూరు అధికారాలను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సివిల్ జడ్జీల సెలవుల దరఖాస్తులు హైకోర్టుకు చేరుతున్నాయి. వీటి ఆమోదం కోసం హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు ఆయా జిల్లాల పోర్టుఫోలియో జడ్జీల ముందు ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.