సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్‌స్టేషన్.. ఏమన్నా పర్యాటక కేంద్రం అనుకుంటున్నారా? ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కాకుండా సందర్శనకు వస్తుంటారా? జ్యుడీషియల్ అధికారి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే తీసుకోరా? దేశంలో ఎవరిపై ఫిర్యాదు చేసినా తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని తెలియదా? ఓ మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వేధింపుల ఆరోపణలు చేసి.. ఆ విషయంలో కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కుమారుడిపై ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో శుక్రవారం నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి.
ఏ కారణాలతోనైనా న్యాయస్థానం ముందు హాజరుకాకుంటే బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం’ అని కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌ఓ ఓదెల వెంకట్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను శుక్ర వారానికి వాయిదా వేసింది.
సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్‌ఐఆర్‌కు ఆదేశాలు
కరీంనగర్ జిల్లాకు చెందిన రమ్య కోర్టులో ఆఫీస్ సబార్డి నేట్‌గా నియమితురాలయ్యారు. అయితే సెషన్స్‌జడ్జి కుమారుడు తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఉన్నతాధికా రులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తన విద్యార్హత, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని దాచి పెట్టిందంటూ ఆమెను సర్వీసు నుంచి తొలగించారు.
ఇదే విషయంపై ఆమె రెండు రోజుల క్రితం హైకోర్టును ఆశ్ర యించారు. సీజే ధర్మాసనం ముందుకు ఈ అంశం రావడంతో సదరు సెషన్స్ జడ్జి కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఎస్‌హెచ్‌ఓకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది.
జిల్లా జడ్జి కుమారుడు.. చట్టానికి అతీతుడా?
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాము ఆదేశించినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కోర్టు ఆదేశాలను ఎస్‌హెచ్‌ఓకు సరిగా తెలియజేయలేదా? లేక ఆ మహిళ పీఎస్‌కు వచ్చినా ఫిర్యాదు తీసుకోలేదనే కారణంతో ఎస్‌హెచ్‌ఓను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అని జీపీపై అసహనం వ్యక్తం చేసింది.
‘కోర్టు ఆదేశాలున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌ఓ నిర్లక్ష్యం ప్రదర్శించారు. పీఎస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మహిళను వేచి ఉండాల్సిందిగా కోరడం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలను ఉల్లంఘించడమే.
ఇది సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితి. నిందితుడు జిల్లా జడ్జి కుమారుడన్న కారణంగా ఎస్‌హెచ్‌ఓ నిందితుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అతను చట్టానికి అతీతుడా? చట్టం ప్రకారం పరిపాలించే సమాజంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఈ ఘటన మా మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏఏజీని పిలిపించిన ధర్మాసనం..: విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)ని ధర్మాసనం కోర్టు హాల్‌కు పిలిపించింది. ‘కొందరు జీపీలపై ఆధారపడవద్దు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించినా.. ఎస్‌హెచ్‌ఓ ఉల్లంఘించారు.
అంతేకాదు ఫిర్యాదు దారుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీఎస్‌లో నిరీక్షించేలా చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని సూచించే ధైర్యం కూడా మీ న్యాయాధికారులకు లేదు. ఇది నిజంగా దిగ్భ్రాంతికర విషయం’ అని వ్యాఖ్యానించింది. ఎస్‌హెచ్‌ఓను తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment