సెలవుల మంజూరు అధికారం పునరుద్ధరణ
ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లోని ఆయా జిల్లాల పరిధిలో పనిచేస్తున్న జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీలకు సెలవుల మంజూరు విషయంలో ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు పునరుద్ధరించింది. ఈ మేరకు హైకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకుంది. న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో న్యాయాధికారులందరూ నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ జాబితాను వెనక్కి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో న్యాయాధికారులు మూకుమ్మడి సెలవులపై వెళ్లాలని నిర్ణయించారు.
ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సీనియర్ సివిల్ జడ్జీల సెలవుల మంజూరుకు సంబంధించి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీల అధికారాలను హైకోర్టు ఉపసంహరించింది. తదుపరి ఉత్తర్వుల జారీ వరకు ఉపసంహరణ కొనసాగుతుందని హైకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. సెలవుల దరఖాస్తులను ఫ్యాక్స్ ద్వారా హైకోర్టుకు పంపాలని జిల్లా, సెషన్స్ జడ్జీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీలు, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జీలను ఆదేశించింది. కాగా, సెలవుల మంజూరు అధికారాలను ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో ఉభయ రాష్ట్రాల్లోని జూనియర్, సివిల్ జడ్జీల సెలవుల దరఖాస్తులు హైకోర్టుకు చేరుతున్నాయి. వీటి ఆమోదం కోసం హైకోర్టు రిజిస్ట్రీ వర్గాలు ఆయా జిల్లాల పోర్టుఫోలియో జడ్జీల ముందు ఉంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.