సాక్షి, మహబూబ్‌నగర్: ఆస్పత్రికి వెళుతున్న జడ్జి భర్తతో పాటు ఓ సివిల్ కానిస్టేబుల్‌పై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం గండేడ్‌లో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అదే సమయంలో కోస్గి సివిల్ జడ్జి ఫరీనాబేగం భర్త, న్యాయవాది శశికిరణ్ తన అత్తమామలు వెంకటేశ్, లక్ష్మిలను తీసుకొని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి బయల్దేరారు.
రాస్తారోకో వల్ల ఆలస్యమవుతుందని భావించిన శశికిరణ్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల వద్దకెళ్లి పక్షవాతం వచ్చిన వాళ్లున్నారు, ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరారు. ఆందోళన ముగిసే వరకు ఆగాలని కొందరు నాయకులు సూచించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, అడ్వొకేట్ శశికిరణ్ మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కొందరు శశికిరణ్‌పై దాడికి దిగారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కోస్గి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజాపూర్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి.. గొడవను గమనించి శశికిరణ్‌కు కొట్టకుండా బీఆర్‌ఎస్ కార్యకర్తలను వారించబోయారు.
దీంతో అతడిపైనా కార్యకర్తలు దాడికి దిగారు. తర్వాత కొందరు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొ మ్మను దహనం చేసి ఆందోళన విరమించారు. కాగా, ఈ సంఘటనలో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ సురేష్ తెలిపారు. దాడికి పాల్పడిన మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యానాయక్‌తో పాటు జోగు కృష్ణయ్య, వెంకట్‌రాములు, మల్లేశ్‌లపై కేసు నమోదు చేశారు. తమపై దాడి చేశారంటూ పెంట్యానాయక్, జోగు కృష్ణ చేసిన ఫిర్యాదుపై జడ్జి భర్త శశికిరణ్, హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు.
చదవండి: ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణనే మహిళలకు ఎక్కువ సేఫ్...
Comments
Please login to add a commentAdd a comment