సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది.
దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం.
ములుగులో ట్రైబల్ వర్సిటీ..
ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్‌సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం.
వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం
తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్‌టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా..
ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపనలు ఇవీ..
- రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు
- రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు
- కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు
ప్రారంభించినవి ఇవీ..
- సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి
- మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్
- రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు
- రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం
- నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment