సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, నాగ్‌పూర్–విజయవాడ కారిడార్‌వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని.. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించామని ఆయన చెప్పారు.
ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు.. ఒక టెక్స్‌టైల్ క్లస్టర్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇక దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని.. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
పాలమూరు పర్యటనకు ఆదివారం వచ్చిన మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
మరోవైపు.. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నామని ఆయన ప్రకటించారు.
తెలంగాణ ప్రజల జీవితాల్లో పెనుమార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ఇక రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కుటుంబం కోసమే అన్నట్లుగా వాటి తీరు ఉందని పరోక్షంగా విమర్శించారు. అలాగే, రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు కేవలం అవినీతి కోసమే అన్నట్లుగా ఉన్నాయని.. తప్పుడు హామీలతో రైతులను మోసగిస్తున్నారని మోదీ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్
Published Mon, Oct 2 2023 4:36 AM | Last Updated on Mon, Oct 2 2023 7:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment