పోయింది. పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్‌లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసినా.. చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడేదో చేసేసి.. ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఏంల సాక్షిగా కుళ్లు కంపు కొట్టేశాయి. ఇప్పుడు ఇక ఏపీ వంతు. ఎవరికి ఎవరు ఏం అవుతారు ? ఎవరు ఎవరితో కలుస్తారు ? పార్టీలు కలిసినంత మాత్రానా క్యాడర్ కలుస్తుందా ? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెర పడేదెప్పుడు ?
తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుడ్ని కూడా రంగంలోకి దింపి.. బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే.. బాబుకి, దత్తపుత్రుడికి తలతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగచెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్‌ఎస్‌కి జై కొట్టింది.
ఇక పవన్‌కళ్యాణ్‌కొచ్చిన కష్టమైతే పగొళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే...మరోవైపు బర్రెలక్క పాటి విలువ లేదు ప్యాకేజీ స్టార్‌కి అంటూ మొదలైన పొలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు. సరే... ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకునే లోపు...కథ మరో మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చుకున్న హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంభించిన వైఖరితో.. బీజేపీ మరింతగా దూరం పెడుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారో.. ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి దాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు "టీడీపీ కాంగ్రెస్‌తోనూ, ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని" ఎదురు ప్రశ్నిస్తోంది.
పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక...ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోనే చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్‌ని ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌కి జాతీయ స్థాయి నేతల అపాయింట్‌మెంట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నాలు చేయడం. ఇలా చాలానే చేశారు. చివరకు మీరు...మాకు అధ్యక్షురాలా ? టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
క్లుప్తంగా చెప్పాలంటే...పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనే దాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో, అటు పవన్‌కళ్యాణ్‌లో టెన్షన్ పెంచేస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తు అయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే...ఆయన ఓదార్చేదేం ఉంటుంది ? ఈ విషయం పక్కన పెడితే...ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో...క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. క్యాడర్ కన్నా, పార్టీ కన్నా టీడీపీనే మిన్న అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడు తీరుతో.. జనసైనికులు షాక్ అవుతున్నారట.
జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా...పట్టుమని పదిమంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్ర బాబుకి అవసరం అయినప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్‌కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా...ఈ పదేళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా...తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి, అటు లీడర్స్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో?
Comments
Please login to add a commentAdd a comment