ఐఎంజీ భారత్‌తో ఒప్పందంపై సీబీఐ విచారణ జరిపిస్తారా?
మమ్మల్నే ఆదేశించమంటారా?
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్న
వారం రోజుల గడువు ఇచ్చిన ధర్మాసనం
2003 నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు
ఆపద్ధర్మ ప్రభుత్వంలో 400 ఎకరాలకు సేల్ డీడ్ చేస్తారా?
అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేస్తారా?
గతంలో ఏ కంపెనీకీ 4 రోజుల్లోనే వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదు
విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే వైఎస్ ప్రభుత్వం ఆ భూములు వెనక్కి తీసుకుంటూ చట్టం చేసింది
పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదు.. ఆ ఒప్పందాన్ని ఏ రకంగానూ సమర్థించలేం
18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత చీఫ్ జస్టిస్‌తో కూడిన బెంచ్ స్పష్టమైన తీర్పు
ఐఎంజీ భారత్ పిటిషన్ కొట్టివేత.. పిల్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా
2003 ఆగస్టు 5న ఏర్పాటైన ఐఎంజీ భారత్..9న బాబు ప్రభుత్వం ఎంవోయూ
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది.
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది.
గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది.
ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.
యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ..
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది.
అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది).
అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ
‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు.
ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు.
ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం
‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్‌మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు.
స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు.
ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్!
2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు.
ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది.
సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా..
‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment