
మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్
ఆ ఘటనతో నాకు సంబంధం లేదు.. ఇదంతా బాబు కుట్రే
సాక్షి, హైదరాబాద్: మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనలో తన ప్రమేయం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలంటూ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, సీబీఐ సహా ఎవరితో దర్యాప్తు జరిపినా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచి్చన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని గుర్తు చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ని ఎదుర్కొంటున్నందునే తనను టార్గెట్ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. తానెలాంటి తప్పు చేయకపోయినా, కుట్రలతో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అనుకూల పత్రికల్లో తనపై దు్రష్పచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఎం నుంచి మంత్రుల వరకు ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నారని, ఏ ఆధారాల్లేకపోయినా బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచి్చన హామీలను అమలు చేయలేక, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఏమన్నా అంటే ఖజానా ఖాళీ అంటున్నారని, సూపర్ సిక్స్ గురించి కూడా బాబు మాట్లాడటంలేదంటూ దెప్పిపొడిచారు.
నాపేరు చెప్పించే కుట్ర
మదనపల్లెలో తగలబడ్డాయని చెబుతున్న రికార్డులు ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్‌తో పాటు సచివాలయంలో కూడా ఉంటాయని చెప్పారు. ఆ రికార్డులన్నింటి డేటా రిట్రీవ్ చేశామని చెబుతున్నారని, ఇక ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాతా చాలా మందిని హత్య చేశారని, చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని, ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించడంలేదని ప్రశి్నంచారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు ఏకంగా డీజీపీని హెలికాప్టర్‌లో పంపారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment