Groundbreakings
-
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
‘అయోధ్యలో భూమి పూజ ఆపండి’
న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని తెలిపారు. బుధవారం జరగాలల్సిన ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని దిగ్విజయ్ కోరారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు.(అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను) ఈ విషయంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్లో మండిపడ్డారు. -
సిగ్గు సిగ్గు!
శ్రీకాకుళం ,వీరఘట్టం: అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సుమారు ఐదేళ్లు కనీస అభివృద్ధిని పట్టించుకోని నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేందుకు ప్రచార ఆర్భాటాలకు తెరతీస్తున్నారు. గతంలో చేసిన పనులకే శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తూ ఆర్భాటం చేస్తున్నారు. దీన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. మంత్రి కళా వెంకటరావు వీరఘట్టం మండలంలో మంగళవారం జరిపిన పర్యటన చూసి జనం నివ్వెర పోయారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు జరుగుతున్నది తమ ఘనతే అని నాయకులు గొప్పులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడేమో సుమారు మూడు నెలల క్రితం ప్రారంభమైన కాలువల పనులకు ఇప్పుడు భూమి పూజ చేయడం.. దానికి మంత్రి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందని రైతులు, ప్రజలు అంటున్నారు. గత ఐదేళ్లుగా ఈ ప్రాంత రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోని సర్కార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆఘమేఘాల మీద శంకుస్థాపనలు, భూమి పూజల పేరిట హంగామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది నెలల క్రితమే పనులు ప్రారంభం రానున్న ఖరీఫ్‌లో ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెబుతూ సుమారు మూడు నెలల క్రితం తోటపల్లి కుడి, ఎడమ కాలువల లైనింగ్ పనులను అధికారులు ప్రారంభించారు. 37.44 కిలోమీటర్ల పొడవున్న ఎడమ కాలువలో ఐదు బృందాలు,కుడికాలువ పరిధిలో రెండు బృందాలు మట్టి పనులు చేపట్టి కాలువలను లెవిలింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడేమో మంత్రి కళా వెంకటరావు వచ్చి శంకుస్థాపన పేరిట భూమి పూజ చేయడం విడ్డూరంగా ఉందని రైతులంటున్నారు. క్షేత్ర స్థాయిలో గుర్తించని సమస్యలు ఎన్నికల స్టంటు కోసం ఆర్భాటంగా ప్రకటించిన తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు రైతులకు అదనపు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఆధునికీకరణ కోసం కాలువల పరిధిలో ఉన్న క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా యంత్రాంగం మొక్కుబడి పనులకు శ్రీకారం చుట్టడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కనీస పరిశీలన లేకుండా కాలువలకు అనుసంధానంగా ఉన్న మదుములు మూసివేయడంతో రానున్న కాలంలో సాగునీరు ప్రశ్నార్ధకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల గిమ్మిక్కుల్లో భాగంగానే టీడీపీ నాయకులు శంకుస్థాపనలు, భూమి పూజల పేరిట హడావుడి చేస్తున్నారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. 21 తర్వాతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈనెల 21వ తేదీ తర్వాత ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. సోమవారం ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నిక కానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడంతో జాప్యం జరిగింది. ఈ నెల 20న ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత షెడ్యూల్ విడుదల కానుంది. ఈ షెడ్యూల్ విడుదలయ్యాక జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. -
జిల్లాలో శంకుస్థాపనల గోల..!
విజయనగరం ,సాలూరు: ఎగురుతున్న పిట్టకు మసాలా నూరేస్తున్న చందంగా ఉంది అధికారపార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దల తీరు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు కాకుండానే హడావుడిగా శంకుస్థాపనులు చేస్తుండడం, భవన నిర్మాణ పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తుండడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ మసాలా నూరేయడం అంటూ గుసగుసలాడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు ఎలాఉన్నా... ఇప్పుడు ఎంతో చేసేస్తున్నామన్న అభిప్రాయం కల్పించి, రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో టీడీపీ పెద్దలు ముందుకు సాగుతున్నారన్న చర్చ జోందుకుంది. నిధులు మంజూరుకాకుండానే.. సాలూరు ప్రాంతవాసుల చిరకాలవాంఛ 100 పడకల ఆస్పత్రి. దీనిని నిర్మాణానికి ఈనెల 15న రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, కలెక్టర్ హరి జవహర్లాల్ తదితరులు శంకుస్థాపన చేసేశారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.17 కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అదనపు భవనాలు, స్మార్ట్ తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.4 కోట్లు మంజూరైనట్టు మంత్రి ప్రకటించారు. అయితే, సంబంధిత పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండానే శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 100 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు రావాలని ఎమ్మెల్యే రాజన్నదొరను ఆహ్వానించేందుకు వెళ్లిన ఆస్పత్రి వైద్యుడిని నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందా..? అన్ని ప్రశ్నిస్తే సదరు వైద్యుడి నోటివెంట మాట రాలేదని సమాచారం. నిధులు మంజూరు చేయకుండా ఎలా శంకుస్థాపణలు చేస్తారని, అడ్డుగోలు పనులకు నేనెప్పుడైనా మద్దతు తెలిపానా? ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించడంతో చేసేదిలేక ఆ వైద్యుడు వెనుదిరిగినట్టు తెలిసింది. అలాగే, సాలూరు మండలంలోని కందులపదం గెడ్డవద్ద వంతెన నిర్మాణానికి ఎమ్మెల్సీ సంధ్యారాణి, భంజ్‌దేవ్ జరిపిన భూమిపూజది కూడా ఇదే తంతు కావడం గమనార్హం. సాలూరు పట్టణంలోని ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం భవన నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభోత్సవం జరిపించారు. పై అంతస్తు భవనం పనులు ఇంకా జరగాల్సి వుంది. అలాగే, దండిగాం మార్గంలో నిర్మించిన రైతు బజారుదీ అదే పరిస్థితి. కార్యాలయ భవనంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా హడావుడిగా ప్రారంభోత్సవాలు జరపడం విశేషం. ఎన్నికల కోడ్ వచ్చేస్తుందనే... ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో ప్రజలు తిరగబడుతున్నారు. ఈ మరకలను తొలగించుకునేందుకు నిధులు మంజూరు కాకపోయినా శంకుస్థాపనలు చేసేస్తున్నట్టు సమాచారం. పదవీకాలంలో ఉన్నన్నాళ్లూ మంజూరైన పనులు పూర్తిచేయాలన్న ధ్యాస, ప్రజలు కోరుతున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలన్న ఆలోచన చేయని పాలకులు.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో ప్రజలను ఏమార్చేందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు. నిబంధనలు ఇలా... ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిని ప్రారంభించాలన్నా.. ముందుగా నిధులకు సంబంధించిన అంచనాలను నిపుణులు రూపొందిస్తారు. ఆపై దాన్ని ఆమోదించిన అనంతరం ప్రభుత్వం నిధులను మంజూరుచేస్తూ జీఓ జారీ చేస్తుంది. ఆపై సంబంధిత పనులకు సంబంధించిన టెండర్లను పిలుస్తారు. టెండర్లను కాంట్రాక్టర్ దక్కించుకున్న తర్వాత వర్క్ ఆర్డర్ ఇస్తారు. అనంతరం సంబంధిత పనులకు సంబంధించి శంకుస్థాపన జరపాల్సి ఉంది. అయితే, ఇవేవీ జరగకుండానే నేరుగా శంకుస్థాపన చేసేస్తుండడంలో ఉద్దేశం ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోసం చేస్తూనే ఉన్నారు... టీడీపీ నేతలు అధికారం చేపట్టింది మొదలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు మాఫీ చేశారో అందరికీ తెలిసిందే. ఇదే తీరును పదవీకాలం మొత్తం పూర్తి చేశారు. గద్దెదిగే సమయంలో కూడా అదే మోసపూరిత వైఖరిని అనుసరిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ జీఓ విడుదల కాకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇది ప్రజలను వంచించడమే. అందుకే చాలా స్పష్టంగా చెబుతున్నాం. భూమిపూజ చేసిన పనులు పూర్తి చేయకపోతే చీటింగ్ కేసు పెడతాం. – పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు -
ఎన్నిసార్లు టెంకాయలు కొడతారు ?
-
31న నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన
నెల్లూరు(పొగతోట): సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 31న జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో సీఎం పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 20వ తేదీన సీఎం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, వివిధ కారణాలతో వాయిదా పడింది. సీఎం పర్యటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ రావాల్సి ఉంది. -
భలే మంచి నిధుల ‘మార్గమూ’
సంపాదనకు కార్పొరేటర్ల కొత్త ఎత్తులు అందరి దృష్టీ రోడ్ల నిర్మాణంపైనే. ఉన్న రోడ్లు తొలగించి కొత్తగా నిర్మాణం కొన్ని చోట్ల పైపై మెరుగులు విస్తృతంగా శంకుస్థాపనలు అధికారాంతమున కార్పొరేటర్ల నిధుల వేట రోడ్లంటే ప్రయాణానికి ఉపయోగపడతాయనే విషయమే అందరికీ తెలుసు. కానీ అవి ‘ఆర్థికంగా’ ఆదుకుంటాయని కొందరికే తెలుసు. మరికొంచెం ముందుకెళితే...అవి ఎంత బాగా ‘ఉపయోగపడగలవో’ మన కార్పొరేటర్లకు తెలుసు. అందుకే అధికారాంతమున చక్కగా ఉన్న రోడ్లను తొలిచేసి.. వాటిపై కొత్తవి నిర్మించే పనికి పూనుకున్నారు. ఈ నిధులు సంపాదించే యజ్ఞానికి కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు తమవంతుగా సాయం చేస్తున్నారు. అడుగు వేయడానికే వీలు లేని ఎన్నో రహదారులను వదిలేసిన మన అధికార గణం... అందంగా ఉన్న రహదారులను ధ్వంసం చేసి... కొత్తగా కనిపించేలా చేయడానికి చూపిస్తున్న ఉత్సాహంలోని అంతరార్ధం ఎవరికీ తెలియనిది కాదు. ఇవే కాదండోయ్... మరో రెండు రోజుల్లో కార్పొరేటర్ల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో...పైపులైన్లు...డ్రైనేజీల వంటి వాటికీ విస్తృతంగా శంకుస్థాపనలు చేస్తూ... నాలుగు రాళ్లు వెనకేసుకోవడంతో పాటు... మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తే ప్రజల దృష్టిలో పడాలనే ప్రయత్నం చేస్తున్నారు. సిటీబ్యూరో: నగరంలోని రోడ్లు అటు కార్పొరేటర్లకు, ఇటు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ బడ్జెట్లో వివిధ పనులకు కేటాయించే నిధులు ఖర్చయినా... కాకున్నా... రోడ్ల నిధులు మాత్రం ఇట్టే ఖర్చయిపోతుంటాయి. అందుకు కారణం వేసిన రోడ్లపైనే మళ్లీ మళ్లీ వేసే అవకాశం ఉండడమే. అదీ కష్టమనిపిస్తే పైపై మెరుగులు దిద్దితే సరి. ఈ అవకాశాన్ని వారంతా చక్కగా ‘వినియోగించుకుంటున్నారు’. నాణ్యతా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మరుసటి రోజుకే పాడైపోయినా ‘మాయదారి వర్షం ముంచేసింది’ అని చేతులు దులుపుకోవచ్చు. దీంతో కార్పొరేటర్లు సైతం తమ బడ్జెట్లో వీటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలక మండలి గడువు ముగిసిపోనున్న తరుణంలో అనేక ప్రాంతాల్లో చురుగ్గా రోడ్ల పనులు చేపట్టడం వారి శ్రద్ధను తెలియజేస్తోంది. ఇలా నిధుల వరద... ఏటా దాదాపు రూ. 200 కోట్లకు తగ్గకుండా రోడ్ల కోసం వెచ్చిస్తున్నారు. గత ఐదేళ్లుగా వెయ్యి కోట్లకు పైగా రోడ్లపాలు చేశారు. ప్రజల అవస్థలు మాత్రం తప్పడం లేదు.రంజాన్, బోనాలు, వినాయక నిమజ్జనం, బక్రీద్ వంటి పండుగల సందర్భంగా రోడ్ల మరమ్మతుల పేరిట చేసే ఖర్చు దీనికి అదనం. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఎక్కువ నిధులు ఖర్చు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే రూ.194 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. మిగతా నాలుగు నెలల్లో మరో రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుత సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేజర్ రోడ్ల అభివృద్ధికిరూ.54.87 కోట్లు, మైనర్ రోడ్లకు రూ.57.80 కోట్లు, రహదారుల వెడల్పునకు రూ.52.76 కోట్లు, జంక్షన్ల అభివృద్ధికి రూ. 5.85 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా మేజర్ రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, మరమ్మతుల పద్దు కింద రూ.11.68 కోట్లు, మైనర్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు రూ.9.93 కోట్లు ఖర్చు చేశారు. తవ్విన రోడ్లు పూడ్చేందుకు రూ.4.10 కోట్లు, మార్కింగ్‌కు దాదాపు కోటి ఖర్చు చేశారు.