అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న మోదీ. చిత్రంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు.
రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు.
ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం
పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు.
తెలుగులో ప్రారంభించి..
ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ..
ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ..
- రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం.
- ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా..
- ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment