విలేకరులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి.చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ
సుభాష్ నగర్ (నిజామాబాద్): మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని... తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరులో, 3న ఇందూరులో నిర్వహించే బహిరంగ సభలలో ప్రధాని పాల్గొంటారన్నారు. ఇందూరు సభలో ప్రధాని మోదీ రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదేం?
ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు తెలంగాణకు ఏం మేలు చేశారో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడాన్ని విలేకరులు కిషన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం 17 సార్లు టీఎస్‌పీఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించినా యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు.
అలాగే దళిత సీఎం హామీతోపాటు దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ హామీని సైతం అటకెక్కించారని... రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం మేలు చేశారో చెప్పాలని ప్రతిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానంటూ దాటవేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు.
మోదీ సభకు లక్ష మందితో జనసమీకరణ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం నిజామాబాద్‌లోని బస్వా గార్డెన్‌లో ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలను సమీకరించాలన్నారు.
మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు
ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో మరో వర్గం యువకుడి దాడిలో గాయపడిన యువతి, వారి కుటుంబసభ్యులను మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మజ్లిస్‌ను బుజ్జగింపుల నేపథ్యంలోనే లవ్‌జిహాద్‌తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment