shadow
-
సీఎం రేవంత్ షాడో కేబినెట్లో ఆ నలుగురు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో షాడో కేబినెట్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం(జులై 27) మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్ సన్నిహితులు వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఉదయ సింహ, అజిత్ రెడ్డితో షాడో కేబినెట్ నడుస్తోందన్నారు. మిగతా వాళ్ళంతా డమ్మీలే అని ఎద్దేవా చేశారు.సీఎం సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తమ వద్దకు అన్ని వివరాలు వస్తున్నాయని చెప్పారు. అన్నీ బయటపెట్టడానికి టైమ్ ఉందన్నారు. -
తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరైతే... అన్నీ తానై వ్యవహరిస్తున్న షాడో ఎమ్మెల్యే మరొకరు. ఈ షాడో ఎమ్మెల్యే తీరుపై కూటమి నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరణి శివకుమార్‌కు ఎలాంటి హోదా లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఆయన సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అయిన కమిషనర్ అదితి సింగ్‌తో కలిసి విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది. ఎమ్మెల్యే అన్న కుమారుడు అధికారికంగా సమీక్ష నిర్వహించడం ఏమిటని మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా స్విమ్స్‌లో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకల్లో కూడా ఆరణి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఆయా కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లుగా శివకుమార్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనతోపాటు మరో నలుగురు వ్యక్తులు సైతం తాము ఎమ్మెల్యేకు సమీప బంధువులం.. అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో హల్చల్ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో వింత సంస్కృతిని చూస్తున్నామని అధికారులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో పురుడుపోసుకుని ప్రవహించే పెన్నానదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నానది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1,412.58 టీఎంసీలని లెక్కగట్టింది.వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటిలభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటిలభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదంటున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా..పెన్నాలో నీటిలభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటిలభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని పేర్కొంది. కానీ బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. 1993తో పోలిస్తే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటిలభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటిరంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటిలభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ..కర్ణాటకలో వర్షఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నందికొండల్లోని చెన్నకేశవ పర్వతశ్రేణుల్లో పుట్టిన పెన్నానది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమవైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడివైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉపనదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 నుంచి 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
ముంచెత్తుతున్న మాంద్యం
ఒకవైపు యుద్ధాలు. మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది... ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లండ్ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది. అయితే కనీసం మరో 10 దేశాలు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది. వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ భారత్‌పై ప్రభావమెంత...? ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు. మూడో త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6 శాతంగా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్‌పైనా కచి్చతంగా ప్రభావం చూపనున్నాయి. పైగా మన మొత్తం ఎగుమతుల్లో 10 శాతం వాటా మాంద్యం జాబితాలోని ఆరు పెద్ద దేశాలదే! వీటిలో బ్రిటన్‌కు 11 బిలియన్ డాలర్లు, జర్మనీకి 10 బిలియన్ డాలర్ల మేరకు మన ఎగుమతులున్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైనా ప్రభావం చూపనుంది. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో 17 బిలియన్ డాలర్లు! -
కేటీఆర్ షాడో సీఎం
సుభాష్ నగర్ (నిజామాబాద్): మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని... తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరులో, 3న ఇందూరులో నిర్వహించే బహిరంగ సభలలో ప్రధాని పాల్గొంటారన్నారు. ఇందూరు సభలో ప్రధాని మోదీ రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదేం? ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు తెలంగాణకు ఏం మేలు చేశారో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడాన్ని విలేకరులు కిషన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం 17 సార్లు టీఎస్‌పీఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించినా యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. అలాగే దళిత సీఎం హామీతోపాటు దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ హామీని సైతం అటకెక్కించారని... రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం మేలు చేశారో చెప్పాలని ప్రతిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానంటూ దాటవేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు. మోదీ సభకు లక్ష మందితో జనసమీకరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం నిజామాబాద్‌లోని బస్వా గార్డెన్లో ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలను సమీకరించాలన్నారు. మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో మరో వర్గం యువకుడి దాడిలో గాయపడిన యువతి, వారి కుటుంబసభ్యులను మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మజ్లిస్‌ను బుజ్జగింపుల నేపథ్యంలోనే లవ్‌జిహాద్‌తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
అక్కడేమో బ్లాక్ బస్టర్స్.. ఇక్కడ చూస్తే డిజాస్టర్స్!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో కంత్రి దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌తో బిల్లా అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. (ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ) వెంకటేశ్‌తో షాడో శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. చిరంజీవితో భోళాశంకర్ అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్. -
Zero Shadow Day: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు నిమిషాలపాట నీడ మాయమైంది. మధ్యహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య మనుషులు, వస్తువుల నీడ కన్పించలేదు. సూర్య కిరణాలు నడినెత్తి మీద పడటంతో షాడో మాయమైంది. దీన్ని 'జీరో షాడో డే'గా పిలుస్తారు. నీడ మాయమవుతుందని తెలియడంతో నగరంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి గుమిగూడారు. నీడ పడుతుందో లేదో చెక్ చేశారు. 12:12 నుంచి 12:14 వరకు షాడో మాయం కావడం ప్రత్యక్షంగా వీక్షించారు. వస్తువులను కూడా రోడ్లపై పెట్టి షాడో పడుతుందో లేదో పరీక్షించారు. ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్ కర్కాటక రాశి–23.4నిఎస్ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కన్పిస్తుంది. ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్రమణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది చదవండి: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. -
ఈ రోజు మీ నీడ మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది.. నేడు 'జీరో షాడో డే'
సూర్యుడు ఒక నిర్దిష్ట బిందువుకి చేరుకున్నప్పుడూ నీడలు అదృశ్యమవుతాయి. ఈ అరుదైన ఘటన సంవత్సరానికి ఒకసారి కనువిందు జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు సార్లు సంభవిస్తుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖ పైన ఉన్నప్పుడూ సూర్యకిరణాలు భూమి ఉపరితలంపై లంబంగా పడతాయి. దీంతో పగటిపూట కొద్దిసేపు నీడలు కనిపించవు. దీన్ని ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో గమనించవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మంగళవారం కోరమంగళ క్యాంపస్‌లో ఈ అరుదైన దృగ్విషయానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం 12.17 గంటలకు సూరుడు నడినెత్తిపై ఉండగా ఇది జరగుతుందని, లంబంగా పడే కిరణాలు ఎటువంటి నీడను ఉత్పత్తి చేయవని బెంగళూరు అమెచ్యూర్ ఖగోళ శాస్త్రవేత్తల సంఘం ట్వీట్లో తెలిపింది. జీరో షాడో అనేది.. భూమి అక్ష సంబంధ వంపు ఫలితంగా ఇలాంటి అరుదైన ఘటన సంభవిస్తుందని స్పష్టం చేసింది. సూర్యుని స్థానం ఏడాది పోడవునా మారుతుందని. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడూ అక్ష సంబంధం మారినప్పుడల్లా.. సూర్యని స్థానం మారి వేరు వేరు నీడలు ఏర్పడతాయని పేర్కొంది. అందువల్లే ఏడాది పొడవున వేర్వేరు నీడలు ఏర్పడతాయని తెలిపింది. సూర్యకిరణాలు వసంత రుతువు నుంచి శరదృతువు మధ్య సమయంలో భూమధ్యరేఖ వెంబడి 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు భూమిని తాకుతాయని ఫలితంగా నీడలు ఉండవని వివరించింది బెంగళూరు ఆస్ట్రోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్. ఈ జీరో డేకి గుర్తుగా ఆస్టోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ మంగళవారం కోర మంగళ క్యాంపస్‌లో ఈ ఖగోళ అద్భుతాన్నిప్రజలు తెలియజేసేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి: ఓ తల్లి కిరాత చర్య..ప్రెగ్నెంట్ అని తెలియక పసికందుని..) -
వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!
భోపాల్: సభ్యసమాజం తలదించుకునే పనిచేశాడా కసాయి తండ్రి. కన్నబిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఐదేళ్ల పసిపిల్లాడిని దయ్యాలు బూనాయనే మూఢనమ్మకంతో ఇంతదారుణానికి వడికట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం..మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్పుర్కు చెందిన దినేశ్ దావర్ ఐదేళ్ల పసివాడని కూడా కనికరించకుండా కన్నకొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టేశాడు. అయితే ఎందుకు చంపావని నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా.. కొడుకు పుట్టినప్పట్నుంచి తన భార్య ఆరోగ్యం క్షీణించిందని, ఇంట్లో వాతావరణం కూడా ఇబ్బందిగా ఉండేదని, ఈ పరిస్థితుల దృష్ట్యా సమీప గ్రామంలోని గురుమాతను అడుగగా.. కొడుకును దెయ్యాలావహించాయని, అందుకే తన ఇంట్లో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పిందట. ఇదంతా విన్న దినేశ్ ఐదేళ్ల కొడుకును గొడ్డలితో నరికి చంపి, పూడ్చినట్లు తెలిపాడు. ఈ ఘటన పై కేసు ఫైల్ చేసిన అలిరాజ్పుర్ ఎస్డీఓపీ శ్రద్ధా సొంకర్ మాట్లాడుతూ.. నిందితుడు దినేశ్ దావర్‌ను అరెస్ట్ చేశాం.. అతని కొడుకుకు దెయ్యం ఆవహించినట్లు తెలిపిన మహిళ కోసం గాలింపు చేపట్టినట్లు మీడియాకు వివరించాడు. చదవండి: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 4 వేల వరకు జరిమానా..! బాదుడే.. బాదుడు!! -
వైరస్‌కు మన కవచం... సంక్షేమ ఫైర్‌వాల్
విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదుటపడటం ఇప్పట్లో కష్టం. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకోవడం, ఆ తీరును మోస్తున్న ‘మీడియా’ అందుకు కారణం. తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రాంతీయ అస్తిత్వంగా మలిచి, రాజకీయ ప్రతిపత్తిని పొందడం చూశాక అయినా, ఆంధ్ర పౌరసమాజంలో ప్రాంతీయ బంధనం (రీజినల్ బాండ్) కొరకు ఆలోచన మొదలుకావాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక ‘ఎజెండా’తో పనిచేయాలి. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసం అక్కడి జ్ఞాన సమాజం ఈపాటికి ఒక ముసాయిదా రూపొందించి, ప్రభుత్వంతో ‘డైలాగ్’ మొదలెట్టాలి. అదొక సమాంతర ‘ఒత్తిడి బృందం’ (ప్రెషర్ గ్రూప్) కావాలి. అయితే మొదటి ఐదేళ్ళలో ఇవేమీ జరక్కపోవడంతో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఎన్నికైన ప్రభుత్వం అయినా, ఎన్నిక కావాలనుకున్న ప్రతిపక్షం అయినా ప్రజలు–ప్రాంత హితం వాటి లక్ష్యం కావాలి. కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారానికి దూరమే అయినా, అవి నిత్యం ప్రజల పక్షాన ఉన్నట్టుగా కనీసం కనిపిస్తాయి. ‘బీపీవో ప్రభుత్వాలు’ వచ్చాక, ప్రభుత్వంలో వుంటే ఎక్కువ సంపద, ప్రతిపక్షంగా ఉంటే తక్కువ సంపద ‘ఫార్ములా’ అయింది. అందుకే మూకుమ్మడి పార్టీల ఫిరాయింపు మొదలయింది. వ్యాపారం–రాజకీయం నాణేనికి రెండు వైపులుగా మారింది. విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని తన ‘విజన్ 2029’లో ప్రకటించింది. ఇది పూర్తిగా కేంద్రీకృత పాలనా వ్యవస్థ. దాన్ని మరింత సుస్థిర పర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధులు దాటిమరీ ఇజ్రాయెల్ నుంచి ‘సైబర్ టెక్నాలజీ’ని కూడా తీసుకోవాలని 2017 ఫిబ్రవరి నాటికే అనుకొంది. ఇజ్రాయెల్ దౌత్యవేత్త డేవిడ్ కామెరాన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇది జరిగిన ఐదేళ్లకు ఇజ్రాయెల్ సైబర్ ఆర్మ్ ‘పెగసస్ స్పైవేర్’ మన దేశంలో ఆందోళనకరమైన స్థాయిలో జాతీయ వార్త అయింది. ప్రభుత్వంలో లేకపోయినా సమాంతరంగా ‘షాడో–గవర్నెన్స్’ నడిపితే తప్ప, తమ వాణిజ్య ప్రయోజనాలు కొనసాగని పరిస్థితి టీడీపీలో నెలకొంది. సరిగ్గా ఇక్కడే, మనం జనం కోసమా? లేక మనవాళ్ళ ‘బిజినెస్’ కోసమా? అనే చిట్టచివరి ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసిన అగత్యం ప్రతిపక్షానికి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీ మనుగడ ‘క్రిటికల్ కేర్’ స్థితికి చేరిన పరిస్థితుల్లో, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ‘లైన్’ తీసుకోవడానికి కూడా వెరవకపోవడం చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా, ఒక ‘షాడో’ రూపంలో ఒక్కొక్కరిలో ‘స్పైవేర్’గా ప్రవేశిస్తూ, ప్రభుత్వాన్ని అలజడికి గురిచేయాలని ప్రయత్నించడం చూస్తున్నాం. ఇందుకోసం పనిచేసేవారిలో నర్సీపట్నం డాక్టర్ పేరు మనకు తెలిస్తే, రామతీర్థం గుడి విధ్వంసం క్రిమినల్ పేరు తెలియక పోవచ్చు. ఇటువంటి నిరంతర ‘షాడో ట్రాకింగ్’ ఒత్తిడిని తట్టుకుంటూ తన పని తాను చేసుకోవడం తర్వాతి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పని అయింది. ముందుగా బాబు ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని ‘జీరో’ చేస్తూ– మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, అన్ని కులాల సంక్షేమానికి సంస్థలు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసి షాడో గవర్నెన్స్‌కు తన ‘ఫైర్‌వాల్’తో తొలి చెక్ పెట్టింది జగన్ ప్రభుత్వం. విభజన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రాష్ట్ర ‘మ్యాప్’ను ముందు పెట్టుకుని మరీ చేసిన కసరత్తుతో, ‘బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’, ‘పలమనేరు– కుప్పం–మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటును చూసినప్పుడు, ‘పాలిటీ’ తన సరిహద్దులకు చేరిన విషయం మనకు అర్థం అవుతుంది. ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా తన కాలంలో ఇటువంటి విత్తనాలు నాటాలి. రాజ్యాంగ పరిధిలో మనకున్న అధికారాలతో మనం చేయవలసింది మాని, అవతలివాళ్లు చేస్తున్నది తెలుసుకోవడానికి ‘స్పైవేర్’ ఎందుకు? ‘పెగసస్’ ఉదంతం వెలుగులోకి వచ్చాక, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్.. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ప్రభుత్వాలను కూడా ఇటువంటి ‘సైబర్ ఆయుధాలు’ అస్థిరపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రధానంగా రాజకీయాలకు దూరంగా ఉండే మధ్య తరగతి ఆలోచనాపరుల వివేచన ఎంతైనా అవసరమైన దశలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు పూర్తిగా ‘టెర్మినల్’ దశకు చేరడంతో, వాటి తదుపరి దశను ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మున్ముందు ఇది దేశానికి దిక్సూచి కావొచ్చు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు
ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్‌గా చెప్పలేం. తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
జీరో షాడో డే: మాయమవుతున్న నీడ.. ఏంటిలా
భువనేశ్వర్: సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం ఎటు వెళితే అటు మన నీడ కూడా పయనిస్తుంది. కానీ ఏడాదిలో రెండు సార్లు మాత్రం ఇలా జరగదు. దీన్నే ‘జీరో షాడో డే’ అంటారు. అంటే ఆ రోజున భూమ్మీద ఉన్న వస్తువులు, మనుషుల నీడలు ఏర్పడవు. దాదాపు రెండు వారాల క్రితం ఈ అరుదైన ఖగోళ దృశ్యం దక్షిణ భారతదేశంలో ఏర్పడగా.. తాజాగా ఈ వింత ఒడిషాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం ఈ వింత చోటు చేసుకుంది. ఉదయం 11:43 గంటల నుంచి దాదాపు 3 నిమిషాల పాటు ఈ వింత కొనసాగింది. ఈ సందర్భంగా భువనేశ్వర్‌లోని పఠానీ సమంతా ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సుభేందు పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య... +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఆకాశంలో ఎత్తైన ప్రదేశంలో.. సరిగా నడినెత్తిన ఉండటం వల్ల నీడ ఏర్పడదు. అప్పుడు సూర్యుడు స్థానిక ధృవరేఖను దాటుతూ వెళ్తాడు. ఈ సమయంలో... సూర్య కిరణాలు తిన్నగా పడతాయి. అందువల్ల భూమిపై ఆ అక్షాంశాల మధ్య ఉన్న వస్తువులు, మనుషుల నీడలు ఏర్పడవు. తిన్నగా పడుతుంది. అందువల్ల ఏ వస్తువునైనా మనం చూసేటప్పుడు మనకు నీడ కనిపించదు’’ అన్నారు. ఇక ఒడిషాలో మే 21 నుంచి జూన్ 2 వరకు ఈ వింత కనపడనుంది. చదవండి: ఈ రోబోలు నీడను చూసి గుర్తుపట్టేస్తాయి! -
జీరో షాడో డే
భానుగుడి (కాకినాడ సిటీ): సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆవిష్కృతమయ్యే అరుదైన ఖగోళ దృగ్విషయం ‘జీరో షాడో డే’. సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ సన్నివేశం ఆవిష్కృతమవుతుంది. ఇది ఏర్పడే మే నెల మొదటి వారంలోని రెండురోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.10 గంటల వరకు ఏ వస్తువు నీడ భూమిపై పడదని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతారు. శనివారం తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిని సాంకేతికంగా నిరూపించి, జూమ్ యాప్ ద్వారా విద్యార్థులందరికీ విశదీకరించారు. రాజమహేంద్రవరం సత్యసాయి గురుకులం ఖగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు కూచిపూడి గుర్రయ్య విద్యార్థులతో ఈ ప్రయోగాన్ని చేయించారు. కాజులూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పంపన కృష్ణమూర్తి విద్యార్థులతో ఈ ప్రయోగం నిర్వహించి, ఇంటర్నెట్ ద్వారా మిగిలిన విద్యార్థులందరితో పంచుకున్నారు. ఎస్సీఈఆర్టీ సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత, ప్రధానోపాధ్యాయుడు రాకుర్తి త్రిమూర్తులు పాఠశాల విద్యార్థులతో ప్రయోగాలు నిర్వహించి విషయాన్ని విశదీకరించారు. -
ఈ రోబోలు నీడను చూసి గుర్తుపట్టేస్తాయి!
చిట్టీ.. ద రోబో గుర్తుంది కదా! అలాంటి రోబోలు నిజ్జంగా వచ్చే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. యజమాని మాటను బట్టి చూపును బట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు ఇప్పటికే వచ్చేశాయి. ఇకపై నీడను బట్టి యజమానిని గుర్తుపట్టి ఆజ్ఞలు స్వీకరించే రోబోలు రాబోతున్నాయి. తాజాగా రోబోలు తమ యజమానిని గుర్తుపట్టేందుకు నీడలను విశ్లేషించుకునే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు. జీవుల్లో ప్రాథమిక సమాచార మార్పిడి స్పర్శ ద్వారానే జరిగేది. అనంతరం జీవ పరిణామంలో శబ్దాలు, భాషలు, రాతలు వచ్చాయి. అయితే రోబోల విషయంలో స్పర్శ ద్వారా యజమానిని గుర్తించేలా చేయడం ఖరీదైన ప్రక్రియ. ఇందుకు రోబో శరీరమంతా సెన్సర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని తొలగించే క్రమంలో తాజా పరిశోధన ఉపయోగపడనుంది. ఈ షాడో సెన్స్ సిస్టమ్‌లో యూఎస్బీ కెమెరాతో నీడలను రోబోలు గ్రహించుకుంటాయి. అనంతరం ఆల్గారిధమ్స్తో నీడను విశ్లేషించుకుంటాయి. పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాలు ఫలిస్తే,సెన్సార్ స్టిసమ్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశోధన నాయకుడు గైహాఫ్మన్ చెప్పారు. ప్రస్తుత పరిశోధనలో 96 శాతం వరకు కచ్ఛితత్వంతో కూడిన ఫలితాలు వచ్చాయన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో రోబో రూపకల్పన మరిన్ని కొత్తపుంతలు తొక్కనుంది. చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! -
నీడా కనిపించట్లేదు..!
చెన్నై,టీనగర్: సాధారణంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో మనుషుల నీడ నేలపై కనిపించడం సర్వసాధారణం. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.17 గంటలకు నీడ అసలు కనిపించలేదు. దీన్ని చెన్నై, బెంగళూరు వాసులు గుర్తించి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా నీడ పడకుండా సూర్యుడు నడినెత్తి పైన ఉంటాడని చెన్నై వాతావరణ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 18న ఈ అరుదైన ఘటన జరిగిందని, ప్రస్తుతం మరోసారి జరిగిందని వివరించారు. -
బీఎండబ్ల్యూ 3 సిరీస్ షాడో ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’ తాజాగా తన 3 సిరీస్‌లో షాడో ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్ స్పోర్ట్ షాడో, బీఎండబ్ల్యూ 330ఐ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ఎక్స్‌షోరూమ్ ధర వరుసగా రూ.41.4 లక్షలు, రూ.47.3 లక్షలు. కంపెనీ ఈ రెండు వేరియంట్లను చెన్నై ప్లాంటులోనే తయారు చేస్తోంది. బీఎండబ్ల్యూ 320డీ ఎడిషన్ స్పోర్ట్ షాడో వేరియంట్లో 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌ను, బీఎండబ్ల్యూ 330ఐ ఎం స్పోర్ట్ షాడో ఎడిషన్ వేరియంట్లో 2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. -
రాజకీయ క్రీనీడ
జిల్లాలో క్రీడా మాఫియా డీపీ నేతల తీరుతో క్రీడారంగం వివాదాస్పదం సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడోల్లో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం ఇద్దరు నిందితులకు పరిటాల శ్రీరాం అండదండలు ఒలింపిక్ అసోసియేషన్ నిధులు డ్రా చేశారని జేసీ పవన్‌పై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు జడ్జి, ఎస్పీ కుమారులకు కూడా నకిలీ సర్టిఫికెట్లు! జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
చెంగావిరంగుచీర..
కృత్తివెన్ను : చీరను అందంగా ధరించడం అతివలకే సాధ్యం. అటువంటిది తాను పెంచుకుంటున్న కూరగాయలు, ఆకుకూరల మొక్కలకు ఏకంగా ఆ చీరనే రక్షణ ఏర్పాటు చేసి ఔరా అనిపించాడు. ఈ రైతు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం సినిమాహాలు సమీపంలో గ్రామానికి చెందిన పి.నాగబాబు తాను పెంచుకుంటున్న చిన్నపాటి కూరగాయల తోటకు పశువులు, పక్షుల నుంచి రక్షణ కోసం ఏకంగా వివిధ రంగుల చీరలను కంచెగా ఏర్పాటు చేశారు. బెండ, బీరలతో పాటు ఆకు కూరలైన తోటకూర, గోంగూరలకు మంచి రక్షణ దొరికింది. 216 జాతీయ రహదారి పక్కనే ఉండటంతో చూపరులను ఆకర్షిస్తున్న రక్షణ కవచం వాటెన్ ఐడియా గురూ.. అనిపించేలా చేస్తుంది. -
విశాఖపై నయీం నీడ
ప్రత్యేక దర్యాప్తు బందం వద్ద సమాచారం నిగ్గు తేల్చేందుకు నగరానికి వచ్చిన ‘సిట్’ ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులతో భేటీ ఫ్లాట్‌ఫారాల ఫుటేజీ స్వాధీనం గోదావరి, దురంతో రైళ్ల ఫస్ట్ ఏసీ ప్రయాణికుల జాబితాల పరిశీలన గ్యాంగ్‌స్టర్ నయీం తన వికృత క్రీడను విశాఖకూ విస్తరించాలని భావించాడా?.. ఇప్పటికే విస్తరించాడా??.. పలుమార్లు నగరానికి రాకపోకలు సాగించాడా???.. రాకపోకలు సాగించడం నిజమేనని ఇతని కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బందానికి లభించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.. అయితే తన నేరసామ్రాజ్యాన్ని ఇక్కడ విస్తరించాడా లేక విస్తరించాలని భావించాడా.. అన్నది మాత్రం స్పష్టం కాలేదు. దాన్ని నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు కొందరు విశాఖ వచ్చారని అత్యంత విశ్వసనీయ సమాచారం. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారాల ఫుటేజీ.. గత కొన్ని నెలల ప్రయాణికుల రిజర్వేషన్ చిట్టాలు సేకరించినట్లు.. ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడి ఇతర వివరాలపై కూపీ లాగినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా నేరసామ్రాజాన్ని విస్తరించాలని చూశాడని.. ఆ మేరకు గత రెండు, మూడు నెలల కాలంలో పలుమార్లు విశాఖ నగరానికి వచ్చి వెళ్లాడని నయీం అరాచకాలపై విచారణ చేపట్టిన సిట్ అధికారులకు కొన్ని ఆధారాలు లభించాయి. దాంతో వాటిని నిర్థారించుకునేందుకు ఆదివారం అత్యంత రహస్యంగా వారు విశాఖకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉన్న అధికారులు ప్రధానంగా రైల్వేస్టేషన్లో దృష్టి సారించారు. ఆర్పీఎఫ్, రైల్వే పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. గత రెండు, మూడు నెలల కాలంలో నయీం పలుమార్లు విశాఖకు వచ్చాడన్న నిర్థారణకు వచ్చారు. అయితే ఇక్కడకు ఎందుకు వచ్చాడు.. ఏ పనిమీద ఎవరిని కలిసేందుకు వచ్చాడు.. అనే పక్కా సమాచారం కోసం కూపీలాగారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గోదావరి, దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రిజర్వేషన్ జాబితాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏసీ ఫస్ట్, సెకండ్ క్లాస్ బోగీల ప్రయాణికుల జాబితాలను పరిశీలించారు. వాటిలో నయీం, అతని అనుచరుల పేర్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. సీసీ ఫుటేజీల స్వాధీనం గోదావరి, దురంతో రైళ్లు రాకపోకలు సాగించే ప్లాట్‌ఫారాల సీసీ ఫుటేజీని కూడా తీసుకువెళ్లారు. సీసీ కెమెరాల నుంచి తీసుకున్న వీడియో ఫుటేజీ ద్వారా నయీం, అతని అనుచరులు విశాఖ వచ్చి, వెళ్లిన సందర్భాల్లో వారిని కలుసుకునేందుకు స్టేషన్‌కు ఎవరెవరు వచ్చారనే విషయమై కూడా సిట్ ందం పరిశీలిస్తోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు రైళ్లలో ప్రయాణించిన సందర్భాల్లో నయీం నేరుగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగకుండా ముందు స్టేషన్లలోనే దిగిపోయేవాడని సిట్ అధికారుల వద్ద సమాచారముంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఎక్కువగా నిఘా ఉంటుందన్న భావనతో ముందు స్టేషన్లయిన వరంగల్, జనగాం, ఘట్కేసర్లలోనే దిగిపోయేవారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా స్టేషన్లలో హాల్ట్‌లు ఉన్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులోనే నయీం ందం ఎక్కువసార్లు ప్రయాణించినట్టు భావిస్తున్నారు. విశాఖ ఎందుకొచ్చినట్టు? హైదరాబాద్ కేంద్రంగా నేరసామాజ్రాన్ని విస్తరించుకున్న నయీం అసలు విశాఖ ఎందుకొచ్చినట్టు.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా మారిన మహానగరంలో ఏ సెటిల్మెంట్లు చేసేందుకు ఇక్కడకు వచ్చాడు.. ఏమైనా దందాలు చేశాడా.. ఇక్కడ పోలీసు అధికారులతో కూడా అతనికి పరిచయాలు ఉన్నాయా.. ఇక్కడ కూడా అతనికి అనుచరులు ఉన్నారా... అన్న కోణాల్లో సిట్ అధికారులు విచారణ చేపట్టినట్టు విశ్వసనీయ సమాచారం. -
నయీమ్ నీడ
తల్లిదండ్రుల పేర విరాళం అంజన్న ఆలయానికి రూ.1.10లక్షలు గాంధీనగర్ కాలనీలో కలకలం పలుమార్లు వచ్చినట్లు అనుమానాలు ఆరా తీస్తున్న నిఘా విభాగాలు చాంతాడంత నేర చరిత్ర.. రాష్ట్రాలు.. జిల్లాలను కుదిపేసిన నయీమ్ అక్రమాల జాడలు జిల్లాలో వెలుగుచూస్తున్నాయి. సేఫ్ జోన్‌గా ఉన్న జిల్లాలో నయీమ్ కదలికలు ఉన్నాయా.. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్లాడా.. ఆయనకు ఇక్కడ సన్నిహితంగా ఉన్నది ఎవరు.. గుడి నిర్మాణానికి తల్లిదండ్రుల పేరు రూ.1.10లక్షల విరాళం ఎందుకిచ్చాడు.. బీబమ్మ అలియాస్ సుల్తానాబేగం ఇల్లు కొని.. ఆమె అక్కడ లేకుండా పోవడం.. ఆ ఇంట్లో అద్దెకున్న వారు కిరాయి డబ్బులకు ఎవరూ రాలేదని చెప్పడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. గాంధీనగర్ కాలనీలోని ఇంటిని డెన్‌గా వాడుకున్నాడా.. ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే రాష్ట్రీయ రహదారికి పక్కనే ఇల్లు ఉండటం సేఫ్‌గా ఉంటుందని నయీమ్ భావించాడా.. అనే విషయాలపై పోలీసులు తీగ లాగుతున్నారు. నయీమ్ నీడ జిల్లాలో ఎప్పటి నుంచి ఉందనే దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం స్వాతంత్య్ర సమరయోధులు 40 మందికి చింతకాని మండలం గాంధీనగర్ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యపల్లి శ్రీపతి పేర ఆయన భార్య తిరుపతమ్మకు ఇక్కడ ప్రభుత్వం 2001, ఆగస్టు 24న ఇంటి స్థలం ఇచ్చింది. శ్రీపతి కొడుకు ప్రకాశం ప్రస్తుతం చెరువు మాదారం వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ స్థలం రావడంతో నాలుగు గదుల ఇంటిని కట్టించాడు. అక్కడ ఉండేందుకు ఇష్టం లేక చెరువు మాదారంలోనే ఓ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో.. గాంధీనగర్ కాలనీలోని ఇంటిని 2007–08లో రూ.3.25లక్షలకు విక్రయించాడు. మహిళలే కొన్నారు.. తమ గ్రామంలో ఇంటిని కొనుగోలు చేసుకుంటున్నామని.. గాంధీనగర్ కాలనీలో కట్టిన ఇంటిని విక్రయిద్దామని ఇంటి పక్కనే ఉన్న అరుణమ్మకు చెప్పారు. అయితే ఖమ్మం మీదుగా కారులో విజయవాడ వెళ్తూ.. ఓ మహిళ గాంధీనగర్ కాలనీ సమీపంలో ఆగింది. అక్కడే పశువులు కాస్తున్న అరుణమ్మను ఇక్కడ ఎవరైనా ఇల్లును అమ్ముతారా..? కొనుగోలు చేస్తామని చెప్పడంతో.. ఫలానా వారి ఇల్లు ఉందని చెప్పింది. దీంతో సమయం చూసుకుని ఓ నలుగురు మహిళలు, ఓ వ్యక్తి ఇన్నోవా కారులో గాంధీనగర్ కాలనీకి 2007లో వచ్చారు. ప్రకాశంను, అతడి తల్లిని అరుణమ్మ తన ఇంటికి పిలిపించుకుంది. ఇక్కడే ఇంటి కొనుగోలు.. డబ్బు ముట్టచెప్పడం.. అగ్రిమెంట్లు రాసుకోవడం జరిగింది. ఓ నలుగురు మహిళలే ఇన్నోవా కారులో నుంచి కిందికి దిగి కొనుగోలు వ్యవహారం చూశారు. కానీ.. ఓ వ్యక్తి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇన్నోవా కారులోనే ఏసీలో ఉన్నాడు. కారులో ఉన్న వ్యక్తి నయీమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీబమ్మ అలియాస్ సుల్తానాబేగం ఎవరు? ఇల్లు కొనుగోలు వ్యవహారం తర్వాత ఇక్కడ బీబమ్మ అలియాస్ సుల్తానాబేగం ఈ ఇంట్లో 2008 నుంచి 2011 వరకు ఉంది. ఐదేళ్ల నుంచి ఆమె ఇక్కడ లేదు. కాలనీలో పక్క ఇంటి వారు కూడా బీబమ్మ కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఖమ్మం కోర్టులో బెంచ్ క్లర్క్‌గా పనిచేస్తున్న రహీం అద్దెకు ఉంటున్నాడు. ఏడాది వరకు అద్దె చెల్లించామని, ఆ తర్వాత అద్దె కోసం ఎవరూ రాలేదని, ఆమె ఎటు వెళ్లిందో కూడా తెలియదని ఇతను చెబుతుండటం గమనార్హం. బీబమ్మ నయీమ్ అత్త సుల్తానాబేగమా..? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నయీమ్ అత్త సుల్తానా మిర్యాలగూడెంలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెను కూడా రిమాండ్ చేసిన విషయం విదితమే. ఇల్లు కొనుగోలు, ఆ తర్వాత కొంతకాలం ఇక్కడే ఉండి.. నయీమ్ అత్తగా భావిస్తున్న సుల్తానానే ఇక్కడ ఏమైనా వ్యవహారాలు చక్కబెట్టిందా? అనే చర్చ జరుగుతోంది. మహిళలు, కుక్కలతో ఓ వ్యక్తి వచ్చేవాడు.. ఇంట్లో బీబమ్మ ఉన్నప్పుడు 2011కు ముందు రెండు, మూడుసార్లు నలుగురైదుగురు మహిళలు, ఓ వ్యక్తి వచ్చి పోయినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ వ్యక్తి నయీమ్ అయి ఉంటాడని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కుక్కలను పెంచడం నయీమ్‌కు ఇష్టం కావడం.. ఇక్కడకు వచ్చిన వ్యక్తి కూడా కుక్కతో మెయిన్ రోడ్డుపై తిరిగేవాడని, ఆ తర్వాత బయటకు కనిపించే వాడు కాదని అక్కడి వారు చెబుతున్నారు. మేము చూసిన వ్యక్తి నయీమ్‌ను పోలినట్లే ఉన్నాడని కాలనీవాసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. రికార్డుల్లో నయీమ్ తల్లిదండ్రుల పేర్లు నయీమ్ తల్లిదండ్రుల పూర్తి పేరు ఎండీ.ఖాజా నసీరుద్దీన్, తాహెరాబేగం. ఈ రెండు పేర్లు చింతకాని మండలం బొప్పారం గ్రామ పంచాయతీ రికార్డుల్లో గాంధీనగర్ కాలనీకి చెందిన వాస్తవ్యులుగా నమోదై ఉన్నాయి. ఇంటి నం.48గా వీరి పేర్లు నమోదై ఉన్నాయి. అయితే వీరు నయీమ్ తల్లిదండ్రులు కాకున్నా.. ఆ గ్రామంలో మాత్రం ఈ పేర్లతో ఎవరూ లేరు. వీరి బంధువులు కూడా ఎవరూ లేరు. ఇంటికి రూ.3.25లక్షలు.. విరాళం రూ.1.10లక్షలు మహిళలు ఒకేసారి రూ.3.25లక్షలు చెల్లించి ఇంటిని కొనుగోలు చేస్తే.. ఆ తర్వాత రెండేళ్లకు కాలనీలో హనుమాన్ టెంపుల్ నిర్మాణానికి రూ.1.10లక్షలు విరాళం ఇచ్చారు. అయితే ఈ విరాళాన్ని తాహెరాబేగం, నజీరుద్దీన్ పేరుతో అందజేశారు. ఆలయంలో దాతల పేర్లతో ఉన్న శిలాఫలకంపై ఈ పేర్లు ఉన్నాయి. ఆలయానికి విరాళం ఇచ్చిన దాతల్లో అత్యధికంగా నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులు రూ.1.58లక్షలు ఇస్తే.. రెండో దాతగా తాహెరాబేగం, నజీరుద్దీన్ పేర్లే ఉన్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, హైదరాబాద్ ప్రాంతాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మహంకాళి ఉత్సవాలకు భారీగా విరాళాలు ఇచ్చి యువతను ఆకర్షించడంలో నయీమ్ దిట్ట. ఈ కోణంలోనే ఇక్కడ కూడా విరాళం ఇచ్చినట్లు అనుమానాలు వస్తున్నాయి. దొంగతనంతో వెలుగులోకి సీసీ కెమెరాలు 2011లో బీబమ్మ ఇంట్లో ఉన్న సమయంలోనే దొంగలు పడ్డారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. బీబమ్మను విచారించేందుకు ప్రయత్నించగా.. బీబమ్మ నిరాకరించడం.. మేము ఫిర్యాదు ఇవ్వకుండానే మా ఇంట్లో దొంగలు పడ్డారని ఎవరు చెప్పారని పోలీసులతో వాదించడంతో వారు వెనుదిరిగారు. స్థానికులు మాత్రం బీబమ్మ ఇంట్లో దొంగలు పడ్డారని, ఇంటికి అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉంటుందని చర్చించుకున్నారు. విషయం తెలుసుకున్న బీబమ్మ గుట్టుచప్పుడు కాకుండా సీసీ కెమెరాలను తీసివేయడంతో కాకుండా.. ల్యాప్‌టాప్‌లను కూడా అక్కడ లేకుండా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దొంగతనంపై పోలీసులు ఇంట్లోకి వచ్చి విచారణ చేయడంతోపాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తే గుట్టు రట్టు అవుతుందనే భయంతో పోలీసులను ఇంట్లోకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే బీబమ్మ ఆ ఇంటిని వదిలి వెళ్లి ఇప్పటి వరకు రాకపోవడం విశేషం. కూపీ లాగుతున్న పోలీస్ అధికారులు నయీమ్‌కు ఖమ్మం జిల్లాతో ఉన్న అనుబంధంపై ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఆంజనేయస్వామి ఆలయానికి విరాళాలు ఇచ్చింది నయీమ్ అయి ఉంటాడని ప్రచారం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జిల్లాతో సంబంధం లేని మహిళ.. ఒంటరిగా వచ్చి కాలనీలో ఇల్లు ఎందుకు కొన్నారని, ఆలయానికి లక్షలాది రూపాయల విరాళం ఎందుకు ఇచ్చారని, నాలుగేళ్లుగా సొంత ఇల్లు విడిచి వెళ్లిన ఆమె.. మళ్లీ ఎందుకు రాలేదనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంటి యజమాని ఎవరో తెలియకుండా.. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించకుండా ఉన్న ఆ ఇంట్లో రహీంతోపాటు ఎవరెవరు ఉంటున్నారు. వారి బంధువులు ఎక్కడ అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అలాగే గాంధీనగర్ కాలనీతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా ఉన్నారా.. ఉంటే వారు ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు.. ప్రధానంగా హైదరాబాద్, నల్లగొండ, భువనగిరి, షాద్‌నగర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఏ మేరకు సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్, సూర్యాపేట మీదుగా విజయవాడ, ఆంధ్రా ప్రాంతంలోని పలు ప్రాంతాలకు వెళ్తే ఎవరైనా తనిఖీలు.. టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో సేఫ్‌జోన్‌గా ఇక్కడ ఉన్న ఇంటిని డెన్‌గా ఏర్పాటు చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భువనగిరి, వరంగల్ జిల్లా తొర్రూరు, ఖమ్మం మీదుగా విజయవాడ, అక్కడి నుంచి ఆంధ్రాలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ఎవరికీ అనుమానం రాకుండా షెల్టర్ తీసుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడా.. అనే చర్చ జరుగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని వైరా డీఎస్పీ భూక్యా రాంరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వాళ్లెవరో తెలియదు.. ఇంటికి బేరం వచ్చిందని అరుణమ్మ చెప్పింది. కారులో నలుగురు మహిళలు.. ఓ వ్యక్తి వచ్చారు. వ్యక్తి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కారులోనే ఉన్నాడు. వచ్చిన నలుగురు మహిళలే ఒకేసారి రూ.3.25లక్షలు ఇచ్చారు. అగ్రిమెంట్లు కూడా వెంటనే రాసుకున్నాం. వారెవరో.. ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలవదు. చెరువు మాదారంలో ఇల్లు కొందామనే అప్పట్లో ఆ ఇంటిని అమ్ముకున్నాం. – ప్రకాశం, చెరువు మాదారం -
వెంటాడే నీడ
మిస్టరీ ఎండ మండిపోతోంది. అంత ఎండలో ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తున్నాడు బిల్లూ. బాగా అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఆ ఊరి పొలిమేర దగ్గరకు వచ్చేసరికి ఓపిక సన్నగిల్లిపోయింది ఇక విశ్రాంతి తీసుకోక తప్పదనిపించింది. చుట్టూ చూశాడు. కనుచూపు మేరలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. చెట్టు చుట్టూ రాతి గట్టు. గట్టు మీద చల్లని చెట్టు నీడ. విశ్రాంతి తీసుకోడానికి అదే మంచి చోటు అనిపించింది. మెల్లగా అటువైపు నడిచాడు. చెట్టు దగ్గరకు చేరుకోగానే, భుజమ్మీది సామాను కిందకు దించాడు చప్టా మీద కూలబడ్డాడు బిల్లూ. సామానంటే మరేమీ లేదు... ఒక నిలువు కర్ర, ఆ కర్రపైన నలు చదరంగా చెక్కబద్దలతో తయారు చేసు కున్న ఫ్రేమ్. ఆ ఫ్రేమ్‌కు వేలాడుతూ సవరాలు, జడకుచ్చులు, బొట్టుబిళ్లల ప్యాకెట్లు, కాటుక ప్యాకెట్లు తదితర ఆడవాళ్ల అలంకరణ సామగ్రి. దాన్ని భుజానికి తగిలించుకుని... ఒక చేతిలో సంచి, అందులో భోజనం క్యారేజీ పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులు అమ్ముకుంటాడు. అదే అతని వృత్తి. చెట్టునీడ చల్లగా ఉంది. దాంతో హాయిగా సేదదీరాడు. కాస్త అలసట తీరేసరికి కడుపులో ఆకలి కేకలు వేయడం మొదలు పెట్టింది. వెంటనే సంచిలోని క్యారేజీ బయటకు తీశాడు. ఆకలి మీద ఉన్నాడేమో... గబగబా భోజనం ముగించాడు. చెట్టుకు నాలుగడుగుల దూరంలో ఉన్న బోరింగ్ పంపు దగ్గరకు వెళ్లి చేయి కడుక్కుని చల్లని నీళ్లు తాగాడు. ఆకలి దప్పులు తీరాయి. అలసట మాత్రం ఇంకా పూర్తిగా తీరలేదు. అందుకే చెట్టునీడ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ గట్టుపైనే మేను వాల్చాడు. కునుకు పట్టింది. ఎవరో తట్టినట్టు అనిపిస్తే ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు బిల్లూ. ఎవరా అని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. తన చాతి మీది నుంచి ఓ ఆకు జారి కిందపడింది. ‘ఓహ్... అది ఆకు స్పర్శా? అనవసరంగా కంగారు పడ్డాను’ అని నవ్వుకున్నాడు. అప్పటికే పొద్దు వాలుతోంది. తెలియ కుండా చాలాసేపు నిద్రపోయాడు. ఊళ్లోకి త్వరగా వెళ్లి తొందరగా బేరాలు ముగించు కోకపోతే చీకటి పడిపోతుంది. అందుకే గబగబా సామాను భుజానికెత్తుకుని నడక మొదలుపెట్టాడు. పది నిమిషాల్లో ఊళ్లోకి చేరుకున్నాడు బిల్లూ. అతన్ని చూస్తూనే అమ్మలక్కలంతా చుట్టూ మూగారు. అదెంత, ఇదెంత అంటూ బేరాలు మొదలుపెట్టారు. ఓపిగ్గా సమాధానలు చెబితూ, వారిని తన మాటలతో ఆకట్టుకుంటూ సరుకులు అమ్ముతున్నాడు. అంతలో ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్టయ్యింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. కాసేపటికి ఒళ్లంతా సలపరంగా అనిపించసాగింది. జ్వరం వచ్చినట్టనిపిస్తోంది. కడుపులో వికారం మొదలైంది. ఎంత మామూలుగా ఉందామన్నా అతడి వల్ల కావడం లేదు. బిల్లూ అవస్థను గమనించింది ఓ మహిళ. ‘‘ఏం బాబూ... ఒంట్లో బాలేదా?’’ అంది. ‘‘అవునండీ. ఇప్పుడే ఎందుకో తేడా అనిపిస్తోంది. జ్వరం వస్తోందనుకుంటా. కడుపులో కూడా’’... మాట పూర్తి కాకముందే భళ్లున వాంతి చేసుకున్నాడు బిల్లూ. అది చూసి అందరూ అవాక్కయి పోయారు. ‘‘అమ్మో... రక్తం’’ అంది ఒకామె కంగారుగా. అప్పుడు చూసుకున్నాడు బిల్లూ. అవును. తను రక్తం కక్కుకున్నాడు. ఏంటిది? తనకి ఏమైంది? రక్తం కక్కుకోవడమేంటి? అతడు ఆలోచిస్తుండగానే మరో వాంతి. అలా వరుసగా వాంతులు చేసుకుంటున్నాడు. రక్తం కక్కుకుంటు న్నాడు. ఊరివాళ్లు కంగారు పడిపోయారు. నాటు వైద్యుడికి కబురు చేశారు. అతను వచ్చి ఏవో బిళ్లలు మింగించాడు. ఓ ఇంటి అరుగుమీద పక్క వేసి పడుకోబెట్టారు. ఆ రాత్రి అతను అక్కడే ఉండిపోయాడు. తెల్లారింది. ఊళ్లో జనాల అలికిడి మొదలైంది. బిల్లూ పరిస్థితి ఎలా ఉందో చూద్దామనుకున్నారు కొందరు. నెమ్మదిగా నిద్రలేపడానికి ప్రయత్నించారు. ఎవరో అతణ్ణి తట్టారు. ఒళ్లు చల్లగా తగలడంతో ఉలిక్కిపడ్డారు. లేవమంటూ పట్టి కుదిపారు. కానీ అతను లేవలేదు. ఎందు కంటే అప్పటికే అతడు మరణించాడు. ఎప్పుడు ప్రాణాలు విడిచాడో తెలీదు. అతడి బంధువులకు కబురు చేద్దామన్నా, అతడు ఎక్కడి వాడో కూడా ఎవరికీ తెలీదు. ఊళ్లోవాళ్లే అంత్యక్రియలు కానిచ్చే శారు. అంతుచిక్కని అతడి మరణం గురించి కొన్నాళ్లు మాట్లాడుకున్నారు. రోజులు ఆగవు కదా, ఎవరి జీవితంలో వాళ్లు పడ్డారు. కానీ ఆ కథ అక్కడితో ముగిసిపోలేదని, అలాంటి దారుణాలు మరిన్ని జరగబోతున్నాయని అప్పుడు వాళ్లెవరకీ తెలియదు. బిల్లూ మరణించిన తర్వాత పక్షం రోజుల్లోనే ఇద్దరు యువకులు అదే విధంగా రక్తం కక్కుకుని మరణించారు. దాంతో ఊరి వాళ్ల మనసులు కీడు శంకించాయి. ఏదో భయం మొదలైంది. మంత్రగాళ్లను పిలిపించారు. ఫలితం లేదు. మూడు నెలలు గడిచేలోగానే ఏడుగురు అదే రీతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందరూ యువకులే. ఏం జరుగుతోందసలు? అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుంటూ చనిపోతున్నారేంటి? ఆరా తీస్తే, వాళ్లంతా ఆ చెట్టుకింద కూర్చుని వచ్చాకే అలా కన్ను మూశారని అర్థమైంది. దాంతో ఆ మర్రిచెట్టులోనే ఏదో రహస్యం ఉందనిపించింది. నాటి నుంచి పట్టపగలు సైతం ఆ మర్రిచెట్టు దగ్గరకు వెళ్లడానికి అందరూ జంకసాగారు. ఆ ఊరి పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే ఆ చెట్టు మీదుగా వెళ్లడమే దగ్గరి దారి. అయినా ఆ దారిని వదిలేశాడు. మూడు కిలోమీటర్లు ఎక్కువ దూరమైనా ఊరి చుట్టూ తిరిగి బడికి వెళ్లడం ప్రారంభించారు. అయితే అంతలోనే మరో విషాదం. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ యువకుడు విషయం తెలియక చెట్టు దగ్గరకు వెళ్లి మరణించాడు. పాపం... బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. అతడి మరణంతో ఊళ్లో శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది. ఇక లాభం లేదని ఊళ్లో వాళ్లంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఊరి చివర మర్రిచెట్టు... ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. వారి మధ్యలో ఓ పూజారి మఠం వేసుకుని కూర్చున్నాడు. అతని పక్కనే అతని సహాయకురాలు ఉంది. ఇద్దరూ ఏదేదో చూస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఆ సహాయకురాలు గట్టిగా అరిచింది. ఉలిక్కిపడి చూశారంతా. అంతే... వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. జుట్టు విరబోసుకుంది. గుడ్లెర్ర చేసి పట్టరాని కోపంతో కేకలు వేయడం మొదలు పెట్టింది. అందరికీ విషయం అర్థమైపోయింది. ఆ చెట్టు మీద దెయ్యం ఉందన్నమాట. అదే అందరినీ చంపుతోందన్నమాట. ‘‘ఏయ్... ఎవరు నువ్వు? ఎందుకు అందరినీ చంపుతున్నావ్’’... గద్దించాడు పూజారి. అంతే... పగలబడి నవ్వసాగిందామె. ‘అప్పుడే అయిపోలేదు. ఇంకా చంపుతాను. ఈ ఏడాది దసరా పండుగ లోగా ఇరవయ్యొక్క మందిని చంపేస్తాను. నన్నెవరూ ఆపలేరు’ అంటూ భయాన కంగా నవ్వసాగింది. ‘‘అసలెందుకు జనాన్ని ఇలా చంపుతున్నావు?’’ ప్రశ్నించాడు పూజారి. ‘‘పగ చల్లార్చుకోవడానికి.’’ ‘‘పగ దేనికి..? ఎవరి మీద..?’’ ‘‘మంత్రగత్తెననే నెపంతో నన్ను చంపేశాడు ఈ ఊరి పెద్ద. ఊరి జనంలో ఏ ఒక్కరూ అడ్డుకోలేదు. అందుకే ఈ ఊరి జనం మీద నాకు పగ...’’ చెప్పిందామె. అది వినగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. ఆమె ఎవరో అర్థమైంది. పదేళ్ల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. దాదాపు పదేళ్ల కిందట ఊరిపెద్ద మనవడు... మూడేళ్ల పిల్లాడు అనుమానా స్పద జబ్బుతో మరణించాడు. ఊళ్లో ఒంటరిగా ఉంటున్న ఒక మహిళను మంత్రగత్తెగా అనుమానించాడు ఊరిపెద్ద. ఆమే తన మనవడి చావుకు కారణం అని భావించి, రాత్రికి రాత్రే ఆమె ఇల్లు తగలబెట్టించాడు. దాంతో ఆమె సజీవ దహనమైంది. ఇది జరిగాక ఊరిపెద్ద కుటుంబం ముంబై తరలిపోయింది. ఈ కథ మొత్తం పూజారితో చెప్పారు. అతను ఆ దెయ్యాన్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. మర్రిచెట్టు కిందనే హోమగుండం వెలిగించాడు. దెయ్యం పూనిన సహాయకురాలిని వేప మండలతో చితకబాదడం మొదలు పెట్టాడు. ఆమె కేకలు వేయసాగింది. అతనిపై తిరగబడటానికి విఫలయత్నం చేసింది. శక్తి సన్నగిల్లడంతో స్పృహ కోల్పోయింది. మర్రిచెట్టు నుంచి ఒక కొమ్మ తెగి హోమగుండంలో పడింది. దెయ్యం ఆమెను, ఆ చెట్టును వదిలి పారిపోయింది. ‘‘దెయ్యం వెళ్లిపోయింది, మీరు నిశ్చింతంగా ఉండండి’’ అన్నాడు పూజారి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ఆ ఊళ్లో అలాంటి మరణాలు మళ్లీ సంభవించలేదు. సాధారణంగా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు అయ్యబాబోయ్ అనుకుంటారు. నమ్మనివాళ్లు సినిమాయే కదా అని మర్చిపోతారు. అయితే ఇలాంటివి నిజంగా కూడా జరుగుతాయని నిరూపించింది ఈ సంఘటన. ఇది కల్పిత కథ కాదు. ఓ యదార్థ ఘటన. ఇది జరిగిన ఊరి పేరు మంగళజోడి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో, జిల్లా కేంద్రానికి చేరువలోనే ఉంటుంది. ఈ సంఘటన ఎనిమిదేళ్ల కిందట జరిగింది. ఆ ఊరికి వెళ్లి ఎవరిని అడిగినా ఈ కథ వినిపిస్తారు. దెయ్యాలు ఉన్నాయి అంటూ బల్లగుద్ది మరీ చెబుతారు! - కాద్రా -
బండిజల్ల సైకిల్‌పై ఇలా..
సైకిల్‌పై నీడ కోసం బండిజల్లను గొడుగులా పెట్టుకున్నారనుకుంటే పొరపాటే! ఎరువును తరలించేందుకు అవసరమైన బండిజల్ల(పొనక)ను ఇదిగో ఇలా కొత్తగూడెంలోని బృందావనం బ్రిడ్జి మీదుగా తీసుకెళ్తుండగా‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. ట్రాక్టర్లు, వ్యానులు, లారీలు గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అందుబాటులో లేని రోజుల్లో ఎరువులు, ఇసుక, మట్టి తదితరాలను ఈ పొనకను ఎడ్లబండిపై ఉంచి తరలించేవారు. ఇప్పటిలాగా ఆటోలు, బస్సులు తదితర వాహనాలు లేని నాటి రోజుల్లో ప్రజలు దూర ప్రాంతాలకు ఎడ్లబండిపై వెళ్లేవారు. పైన ఎండ తగలకుండా బండిపై పొనకను పైకప్పుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఇవి ఏ పల్లెటూరులోనూ కనినపించడం లేదు. - సాక్షి ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
‘ఆనందో బ్రహ్మ’ అంటూ వెళ్లిపోయారు...
1980ల్లో... టీవీ చూడడమే ఓ క్రేజ్. ముఖ్యంగా దూరదర్శన్‌లో వచ్చే ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్ చూడటమంటే ఇంకా ఇంకా క్రేజ్. వారం వారం అరగంట సేపు వచ్చే ఆ సీరియల్ కోసం వారమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసేవారు తెలుగు ప్రేక్షకులు. అన్నీ జోకులే. అవి చూసి పొట్ట పట్టుకోకుండా నవ్వనివాడుంటే ఒట్టే. ‘ఆనందో బ్రహ్మ’ అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ట్రేడ్‌మార్క్. ఒక కామెడీ సీరియల్‌తో తెలుగునాట సూపర్‌స్టార్ కావడమంటే ఒక్క ధర్మవరపుకే చెల్లింది. జోక్స్ అందరూ పేలుస్తారు. కానీ ధర్మవరపు జోక్స్ పేల్చే స్టయిల్, ఆ మాట విరుపు, ఆ ఎక్స్‌ప్రెషన్సూ చూస్తే నవ్వుకి కూడా తెగ నవ్వొచ్చేస్తుంది. హాస్యనటుడిగా బుల్లి తెరపై, వెండి తెరపై ఆయన వేసిన ముద్ర చిరస్మరణీయం... సదా స్మయిలనీయం. 24 ఏళ్ల సినీ ప్రస్థానంలో వందలాది పాత్రలతో తెలుగు హృదయాల్లో శాశ్వత స్థానం సముపార్జించుకున్నారాయన.ఆరో తరగతిలో బీజం: ధర్మవరపు సొంతవూరు ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం. ఆ ఊరికి అయిదు కిలోమీటర్ల దూరంలోని వైదరలో ఆరో తరగతి చదువుతుండగా ‘దొంగ వీరడు’ అనే నాటకంలో మురళి అనే చిన్న పిల్లాడి వేషం వేసే అవకాశం వచ్చింది. ఆ స్కూల్లో 550 మంది స్టూడెంట్స్ ఉంటే, ఏరికోరి ధర్మవరపునే ఎంచుకున్నారు. అలా ఆయన మనసులో తొలి నటనా బీజం పడింది. అది ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఒంగోలులో ప్రజా నాట్యమండలితో కలిసి చాలా నాటకాలు ప్రదర్శించారు. ఊహించని మలుపు: స్నేహితులతో కలిసి సరదాగా గ్రూప్-2 ఎగ్జామ్స్ రాస్తే, హైదరాబాద్‌లో ఉద్యోగం లభించింది. కేవలం సినిమాల్లో ప్రయత్నాల కోసం హైదరాబాద్‌లో ఉద్యోగిగా చేరారు. మొదట్లో అనేక రేడియో కార్యక్రమాలు చేశారు. అప్పుడే ‘దూరదర్శన్’ కొత్తగా మొదలైంది. కొన్నాళ్ల తర్వాత దూరదర్శన్‌లో సీరియల్స్ మొదలుపెట్టారు. తొలి తెలుగు, సీరియల్ ‘అనగనగా ఒక శోభ’ సృష్టికర్త ఆయనే. ఆ తర్వాత ‘బుచ్చిబాబు’ సీరియల్ కూడా ఆయనే రాశారు. ఇక ‘ఆనందో బ్రహ్మ’ అయితే ఆయన్ను స్టార్‌ని చేసేసింది. జయమ్ము నిశ్చయమ్మురా: జంధ్యాల పరిచయం ధర్మవరపుని వెండితెర మీదకు తీసుకొచ్చింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో జంధ్యాల బలవంతం మేరకు (1989) రంగనాథం పాత్ర చేశారు. నిజానికి అది సుత్తి వీరభద్రరావు చేయాల్సిన పాత్ర. ఆయన చనిపోవడంతో ధర్మవరపుతో చేయించారు. ఆ సినిమాకు ఆయన అందుకున్న పారితోషికం 7500 రూపాయలు. ఈ సినిమా విడుదల కాకముందే సీనియర్ నిర్మాత కె.రాఘవ ‘అంకితం’ సినిమాలో పిలిచి వేషం ఇచ్చారు. జంధ్యాలతో ధర్మవరపు అనుబంధం ప్రత్యేకమైంది. జంధ్యాల దర్శకత్వంలో ‘లేడీస్ స్పెషల్, బావా బావా పన్నీరు, బాబాయ్ హోటల్, జిందాబాద్, ష్ గప్‌చుప్’ తదితర సినిమాలు చేశారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తోనే హాస్యనటునిగా మంచి మార్కులు సంపాదించేశారు. అందులో స్కూలు టీచర్‌గా పరీక్ష పేపర్లు దిద్దే సన్నివేశాన్ని చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుని మరీ నవ్వుతారు. తెలుగుదనమున్న హాస్యం: ధర్మవరపు తన కెరీర్లో ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన సందర్భమే రాలేదు. తోటి హాస్యనటులకు దీటుగా తనదైన మార్కు హాస్యంతో పరిశ్రమలో నిలబడ్డారు. ఎక్కడా అతి లేకుండా, పరిధులు దాటకుండా, అశ్లీలతకు దూరంగానే హాస్యాన్ని పండించారు. వాచకంలో స్పష్టత, తెలుగుదనం ఉట్టిపడడం ఆయనలోని ప్రత్యేకత. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయనకంటూ ఓ శైలిని సృష్టించిపెట్టింది. అసలు కొన్ని కొన్ని పాత్రలైతే ఆయనను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం. స్వాతికిరణం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, ఫ్యామిలీ సర్కస్, లీలామహల్ సెంటర్, అమ్మ-నాన్న-ఓ తమిళమ్మాయి, ఒక్కడు, ఆనందం, వెంకీ, రెడీ, దూకుడు... తదితర చిత్రాల్లోని పాత్రలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ‘ఒక్కడు’ సినిమాలో ‘నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో’... అంటూ మొబైల్ నెంబర్ చెప్పే తీరు సూపర్. ‘తోక లేని పిట్ట’ సినిమాతో దర్శకునిగానూ తన ప్రతిభ కనబర్చారు. చిత్ర పరిశ్రమలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.కొన్నాళ్లుగా కేన్సర్‌తో పోరాడుతున్నా, ఎక్కడా అధైర్యపడలేదు. చివరి క్షణం వరకూ నవ్వుతూ, నవ్విస్తూనే ఉన్నారు. సినిమాలకూ దూరం కాలేదు. ఆనందంగా బతకడమే తన ఫిలాసఫీ అని చెప్పిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి క్షణం వరకూ అదే పద్ధతిని అనుసరించారు. నవ్వుకి ఆనందయోగం పట్టించిన ధర్మవరపు ఎప్పటికీ చిరంజీవే! ‘సాక్షి’ టీవీలో ‘డింగ్‌డాంగ్’ ‘సాక్షి’ చానల్‌తో దర్మవరపు సుబ్రమణ్యంది విడదీయరాని అనుబంధం. అప్పుడెప్పుడో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఆనందో బ్రహ్మ’ కార్యక్రమంతో తెలుగులోగిళ్లలో నవ్వుల్ని పంచిన ధర్మవరపు... మళ్లీ ‘సాక్షి’ చానల్లో ప్రసారమవుతున్న.. ‘డింగ్ డాంగ్’ కార్యక్రమం ద్వారా మరోసారి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తారు. సెటైరికల్‌గా సాగే ఈ కార్యక్రమం అటు చానల్‌కే కాక, ధర్మవరపుకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎంతో ఇష్టంతో ఆయన ఈ కార్యక్రమం చేసేవారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమం దాదాపు 350 ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో వారానికి ఓసారి ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. అయితే... ఈ కార్యక్రమానికి వస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని వంద ఎపిసోడ్స్ తర్వాత నుంచి వారానికి రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది సాక్షి చానల్. ధర్మవరపు ప్రతిభ కారణంగా రెండు సార్లు ఈ కార్యక్రమం జాతీయ పురస్కారాలను కూడా అందుకుంది. ధర్మవరపుకు ఈ కార్యక్రమంపై ఎంతటి మమకారం అంటే... మిగతా చానల్స్ వారు ఇలాంటి కార్యక్రమమే తమకూ చేసిపెట్టమని అడిగినా... ఆయన ససేమిరా అనేవారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా, చివరకు ఫారిన్ షూటింగ్ ఉన్నా... ‘డింగ్ డాంగ్’ కార్యక్రమానికి ఇబ్బంది కలుగకుండా.... షెడ్యూల్‌ని ప్లాన్ చేసుకునేవారు ధర్మవరపు. ఆయన మరణం సాక్షికి నిజంగా తీరని లోటే. -
ఆవిష్కరణం: గొడుగు అమ్మాయిలదట!
అంబ్రెల్లా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. అంబ్రా అంటే నీడ అని, ఎల్లా అంటే చిన్న అని అర్థం. అంటే అంబ్రెల్లాకు ‘చిన్న నీడ’ అని అర్థమన్నమాట. గొడుగుకు చాలా చరిత్రే ఉంది. గొడుగు పుట్టింది ఎండ నుంచి రక్షణకు.. క్రీస్తుపూర్వమే వీటిని వాడినట్టు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చైనాలో తొలిసారి క్రీ.శ. 21లో గొడుగు వాడారు! అయితే వారు వాన కోసం వాడారు. తొలి వాటర్‌ప్రూఫ్ గొడుగు వాళ్లే తయారుచేశారు. చిత్రమేంటంటే.. గొడుగులు ఆడాళ్ల కోసం తయారుచేశారట. దానిని తొలిసారి వాడిన పురుషుడు ఇంగ్లండ్‌కు చెందిన జోనాస్ హాన్వే (1712-1786) అనే ఒక ట్రావెలర్, రచయిత. అప్పట్లో ఆయన రచయితగా కంటే గొడుగు వాడిన పురుషుడిగా ప్రపంచానికి ఎక్కువ ఫేమస్ అయ్యాడట. మొదటి గొడుగుల దుకాణం కూడా లండన్‌లోనే వెలిసింది. 1830 లో పుట్టిన ఈ దుకాణం ఇప్పటికీ ఉంది. (53, న్యూ ఆక్స్ఫర్డ్ వీధి, లండన్). 1852 వరకు గొడుగు హ్యాండ్ చెక్కదే. వీటిని ఆర్టిస్టిక్‌గా చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారట. వారికి మంచి ఆదాయం కూడా ఉండేది. 1852లో శామ్యూల్ ఫాక్స్ తొలిసారి స్టీల్ రాడ్‌ను గొడుగులో వాడాడు. 1928లో హాన్స్ హాప్ట్ పాకెట్ గొడుగుల్ని తయారు చేశాడు. 1969లో అమెరికాకు చెందిన బ్రాడ్ఫోర్డ్ ఫిలిప్స్ గొడుగుల తయారీకి పేటెంట్ సంపాదించాడు. అక్కడి నుంచి మార్కెట్లో వివిధ రకాల గొడుగులు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో గొడుగులు పెద్దగా నలుపు రంగుల్లో ఉండేవి. తర్వాత వాటి సైజు తగ్గుతూ వచ్చింది. తర్వాత రకరకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారయ్యాయి. కొసమెరుపు: అప్పటికీ ఇప్పటికీ గొడుగు రాచరికానికి చిహ్నమే. ఓ మనిషి చేత గొడుగు పట్టించుకోవడం అంటే ఆ ఠీవి వేరు! ఇప్పటికీ దర్శకులను సెట్స్‌లో గొడుగు లేకుండా ఎవరూహించుకుంటారు? -
చల్లని నీడ
ఎయిడ్స్‌తో బాధపడేవారికి ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వడాన్ని ప్రమాదంగా భావించే ప్రపంచంలో ఉన్నాం మనం. అయితే ఆ జబ్బు వచ్చినవారు తమ చివరి రోజుల్ని తన ఆసుపత్రిలో గడిపే అవకాశం కల్పిస్తూ అందరితో ‘వైద్యోనారాయణోహరిః’అనిపించుకుంటున్నారు ఈ డాక్టర్. ప్రకాశం జిల్లా చీరాలలో ‘షాడో’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించి ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్ డేవిడ్సన్ సాల్మన్ గురించి... ఇప్పటివరకూ ఆ ఆసుపత్రికి పద్దెనిమిది వేలమందికి పైగా ఎయిడ్స్‌రోగులు వచ్చారు. అయితే డాక్టర్ డేవిడ్ గర్భిణులు, మరణంతో పోరాడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించారు. అందువల్లే గర్భిణులకు ఉచిత ప్రసవం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆసుపత్రిలోనే ఉచిత ఆశ్రయం కల్పించాలనుకున్నారు. దాతలు డబ్బు మాత్రమే ఇవ్వగలరు, సాల్మన్ మాత్రం ప్రేమను కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎయిడ్స్ రోగులకు తన ఆసుపత్రిలో బెడ్ ఇప్పించారు. ‘షాడో’ సంస్థ ద్వారా డా.సాల్మన్ ఎయిడ్స్ రోగులకు వైద్యం చేస్తున్నారు. ఒకవేళ చనిపోతే అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు. ప్రచారంతో పాటు... ‘‘మా నాన్నగారి పేరుతో గత ముప్పైఏళ్లుగా చీరాలలో ‘సాల్మన్’ ఆసుపత్రి ఉంది. నేను, నా బావమరిది, అతని భార్య అందరం వైద్యవృత్తిలోనే ఉన్నాం. ముంబయి, బెంగుళూరు వంటి నగరాల్లో వైద్య ఉద్యోగాలు వచ్చినప్పటికీ నాన్నగారి ఆసుపత్రిలో ఉండిపోవాలని అందరం ఇక్కడికే వచ్చేశాం. ఇరవై ఏళ్లక్రితం మా జిల్లాలోని మొదటి ఎయిడ్స్‌రోగికి నేను వైద్యం చేశాను. రోజురోజుకీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారికోసం సాల్మన్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వీకర్స్ సొసైటీ... షాడో స్థాపించాను. వైద్యం చేసి ప్రాణం పోయడానికంటే ముందు ఆ జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలు చేశాను. ఎయిడ్స్‌రోగుల్ని ఇంట్లో పెట్టుకోడానికి ఇబ్బందిపడి మా ఆసుపత్రిలో చేర్పించి వదిలేసి వెళ్లిపోయినవారు కూడా ఉన్నారు. బంధువులుండి కూడా వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే నాకు చేతనైనంత సాయం చేసేవాడిని’’ అని చెప్పారు డేవిడ్. సాల్మన్ ఆసుపత్రిలో వెయ్యిమందికి పైగా ఎయిడ్స్‌రోగులు కన్నుమూశారు. వారిలో వందమందికి పైగా అనాథలు. ఈ అనాథలు... అందరికీ దూరమైనవారు. కొందరు నిజంగానే ఎవరూ లేనివారు. బతికుండగా గుక్కెడు నీళ్లు పోయడం సాయమైతే...చనిపోయాక చేయాల్సిన అసలైన సేవ కూడా చేస్తున్న ఈ డాక్టర్ అభినందిద్దాం. - భువనేశ్వరి