ఒకవైపు యుద్ధాలు. మరోవైపు పర్యావరణ మార్పులు. కారణాలేమైతేనేం... ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవరపరుస్తోంది...
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తగ్గుదల నమోదైతే సాంకేతికంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి జపాన్, బ్రిటన్ రెండూ ఈ మాంద్యం బారిన పడ్డాయి. ఇవి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో ఈ పరిణామం సర్వత్రా చర్చనీయంగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చాలా దేశాల్లో మాంద్యం ఛాయలు ప్రస్ఫుటమవున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే మాంద్యం బారిన పడ్డవి కొన్ని కాగా మరికొన్ని అతి త్వరలో ఆ ముప్పు దిశగా సాగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
జపాన్, బ్రిటన్‌తో పాటు ఐర్లండ్, ఫిన్లండ్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర నాలుగో త్రైమాసికంలో సాంకేతిక ఆర్థిక మాంద్యం బారిన పడ్డాయి. ఐర్లండ్ జీడీపీ మూడో త్రైమాసికంలో 0.7 శాతం తగ్గగా నాలుగో త్రైమాసికంలో ఇప్పటికే ఏకంగా 1.9 శాతం తగ్గుదల నమోదు చేసింది! ఫిన్లండ్ జీడీపీలో వరుసగా 0.4, 0.9 శాతం తగ్గుదల నమోదైంది. నిజానికి చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. చాలా దేశాల నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఇంకా రావాల్సి ఉంది. అవి వెల్లడయ్యాక సాంకేతిక మాంద్యం జాబితాలోని దేశాల సంఖ్య బాగా పెరిగేలా కన్పిస్తోంది.
అయితే కనీసం మరో 10 దేశాలు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ తగ్గుదలను చవిచూశాయి. ఈ జాబితాలో కెనడా, న్యూజిలాండ్‌తో పాటు డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా, ఈక్వెడార్, బహ్రయిన్, ఐస్‌లాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. వీటిలో డెన్మార్క్, లగ్జెంబర్గ్, మాల్డోవా, ఎస్టోనియా మూడో త్రైమాసికంలోనే ఆర్థిక మాంద్యం నమోదు చేశాయి! ఇవేగాక తాజాగా నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన మరో 9 దేశాల్లో కూడా జీడీపీ తగ్గుదల నమోదైంది.
వీటిలో ఆరు దేశాల్లో ఇటీవలి కాలంలో జీడీపీ తగ్గుదల నమోదవడం ఇదే తొలిసారి! జీడీపీ తగ్గుదల జాబితాలో జర్మనీ వంటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఉండటం యూరప్‌ను మరింత కలవరపెడుతోంది. ఇది మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి. నాలుగో త్రైమాసికంలో యూరో జోన్ జీడీపీ వృద్ధి సున్నాగా నమోదవడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది. ఫ్రాన్స్ కూడా మాంద్యం బాట పడుతున్న సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్
భారత్‌పై ప్రభావమెంత...?
ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌కు ప్రస్తుతానికి పెద్ద సమస్యేమీ లేదు. మూడో త్రైమాసికంలో 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. నాలుగో త్రైమాసిక అంచనా 6 శాతంగా ఉంది. కాకపోతే ప్రపంచీకరణ యుగంలో ప్రపంచవ్యాప్త పరిణామాలు భారత్‌పైనా కచి్చతంగా ప్రభావం చూపనున్నాయి. పైగా మన మొత్తం ఎగుమతుల్లో 10 శాతం వాటా మాంద్యం జాబితాలోని ఆరు పెద్ద దేశాలదే! వీటిలో బ్రిటన్‌కు 11 బిలియన్ డాలర్లు, జర్మనీకి 10 బిలియన్ డాలర్ల మేరకు మన ఎగుమతులున్నాయి. సేవలు, ఐటీ రంగంలో అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటన్నది తెలిసిందే. ఇక మాంద్యం కారణంగా ఆయా దేశాల్లో నమోదయ్యే ధరల పెరుగుదల మన దిగుమతులపైనా ప్రభావం చూపనుంది. మన దిగుమతుల్లో మాంద్యం బారిన పడ్డ జపాన్, ఆ ముప్పున్న జర్మనీ వాటా చెరో 17 బిలియన్ డాలర్లు!
Comments
Please login to add a commentAdd a comment