laying
-
రూ.266 కోట్లతో కడప విమానాశ్రయం అభివృద్ధి
కడప కోటిరెడ్డిసర్కిల్/కడప కార్పొరేషన్: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని విమానాశ్రయంలో రూ.266 కోట్లతో నిర్మించనున్న నూతన టెర్మినల్ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయం 25 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం మేరకు ఆధునిక సొబగులద్దుకుంటోంది. ఇక్కడి రన్‌వేని 45 మీటర్ల వెడల్పున 2,515 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. పనులు పూర్తయిన తరువాత ఈ విమానాశ్రయం పీక్ అవర్ సరి్వంగ్ కెపాసిటీ 1,800 మంది ప్రయాణికులుగా ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విమానాశ్రయం విస్తరణకు రూ.75 కోట్లతో స్థలం సేకరించారు. దీంతో రన్‌వే పొడిగిస్తున్న నేపథ్యంలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఇక్కడి నుంచి నిరంతరాయ సర్విసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కూడా భరించింది. 2015లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం నుంచి 2017లో ట్రూ జెట్ సంస్థ ఉడాన్ స్కీమ్ కింద ఆర్సీఎస్ (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) అమలు చేసింది. 2021లో ఆ సంస్థ తన విమానాలను ఉపసంహరించుకుంది. 2022 మార్చి నుంచి ఇండిగోసంస్థ విమానాలను ప్రారంభించింది. ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయంలో అభివృద్ధి పనులతోపాటు టెర్మినల్ నిర్మాణంతో రూపురేఖలు మారిపోయి మహర్దశ పట్టనుందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేయగా, ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు సుందరీకరణలోను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. ఎయిర్‌పోర్టుకు అతి సమీపంలో అటవీప్రాంతం ఉండడంతో అటవీశాఖ అనుమతులు తీసుకుని భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర విమానయానశాఖ మంత్రి జ్యోతిరావు సిందియాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సుజిత్‌కుమార్ పోదార్, ›ప్రొటోకాల్ ఆఫీసర్ సురేష్‌బాబు, టెర్మినల్ మేనేజర్ జోసెఫ్ పాల్గొన్నారు. ముసుగు తొలగించారంతే: ఎంపీ అవినాశ్‌రెడ్డి అనంతరం ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటినుంచో పొత్తులో ఉన్న టీడీపీ, పవన్‌కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ముసుగు తొలగించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదని, ఎన్నికలు వచ్చాయంటే ఆయనకు పొత్తులు గుర్తొస్తాయని చెప్పారు. 2019లో టీడీపీ ఓటమి పాలుకాగానే చంద్రబాబు తన అనుచరులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను బీజేపీలోకి పంపారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగా పొత్తులో ఉన్న టీడీపీ, వవన్‌కళ్యాణ్, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్, ఇతర పార్టీలతో కూడా కలిసే ఉన్నట్లు చెప్పారు. ఎంతమంది కలిసొచి్చనా, ఎల్లో మీడియా వారికి ఎంత మద్దతు ఇచ్చినా గెలిచేది వైఎస్సార్సీపీయేనని ఆయన తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో పొత్తుకోసం టీడీపీ వెంపర్లాడిందని ఎద్దేవా చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, జగన్ సింగిల్‌గా పోటీచేసి మళ్లీ సీఎం కావడం తథ్యమని చెప్పారు. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
నా కోళ్లు గుడ్లు పెట్టడం లేదు.. ఆ కంపెనీపై కేసు పెట్టండి
సాక్షి, ముంబై: తన కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయని అందుకు దాణా అమ్మిన కంపెనీ బాధ్యత వహించాలని ఒక వ్యక్తి పోలీసుస్టేషన్ మెట్లెక్కాడు. ఈ చిత్రమైన సంఘటన పుణేలోని లోణి కాల్భోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ప్రకారం.. ‘‘ నా కోళ్ల ఫారంలోని కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి. అహ్మదాబాద్‌లోని ఓ కంపెనీ అమ్మిన దాణా తిన్న తరువాతే కోళ్లు ఈ విధంగా మొండికేశాయి. నాకు న్యాయం చేయండి’ అని ఫిర్యాదులో సదరు ఫాం యజమాని పేర్కొన్నారు. కాగా, ఇలాంటి కేసులే రెండు, మూడు వచ్చాయని, కంపెనీ యజమానులతో చర్చించి నష్టపరిహారం ఇచ్చేలా ఫాం యజమానులు ఒప్పందం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేంద్ర పేర్కొన్నారు. -
రాజు గారి ‘శిలా’శాసనం
మాయమవుతున్న గత పాలకుల శిలా ఫలకాలు శంకుస్థాపన రాళ్లు కనిపించకూడదట! పిఠాపురంలో నీచ సంస్కృతి రాచరికం పోయి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ ఛాయలు మాత్రం పిఠాపురం నియోజక వర్గంలో పోవడం లేదు. రాజుల పాలనలో యుద్ధాలు జరిగేవి. విజేతగా నిలిచిన రాజుదే ఆ రాజ్యం. అందుకే గత రాజుల ఆనవాలు కనిపించకుండా ధ్వంసం చేసేవారు. అదే పద్ధతిని ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రాజుగారు. శాశ్వతంగా తానే ఉండిపోతాననే భ్రమలో ఉన్నట్టున్నారు ఈ రాజుగారు. పాత శిలా ఫలకాలు ఒక్కొక్కటినీ పడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు. పిఠాపురం: చరిత్రను చాటి చెప్పే శిలా శాసనాలను రాచరికంలో రాజులు వేయించుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో పాలకులు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల జ్ఞాపకాలుగా శిలా ఫలకాలను వేయించుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు కపించకూడదనేది ఇక్కడి రాజు గారి శిలాశాసనం. రెండు, మూడేళ్ల ముందు ఒకరు శంఖుస్థాపన చేస్తారు ... పూర్తయిన తరువాత ఆ రోజుకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయంలో శంఖుస్థాపన చేసినవారి పేరుతోపాటు ప్రారంభోత్సవం చేసినవారి పేరు ఉండడం సహజం. కానీ ఈయనగారు ప్రారంభించిన ఏ కార్యాలయంలోనూ తన ప్రారంభోత్సవ శిలాఫలకం తప్ప శంఖుస్థాపన శిలాఫలకం మాత్రం కనిపించకూడదనే హుకుం జారీ చేయడంతో జుత్తు పీక్కుంటున్నారు ఆయా శాఖల అధికారులు. ఈ నిరంకుశత్వ విధానాలు ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలో... ఆ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మ జమానాలో ఈ తంతు సాగుతోంది. పద్థతిదీ... సాధారణంగా ఏ ప్రభుత్వ భవనమైనా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడితే ఆ సమయంలో అధికారంలో ఉన్న పాలకులు శంఖుస్థాపన చేస్తారు. ఆ భవనాలు పూర్తయ్యాక వాటిని పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏ పాలకులు కార్యక్రమంలో పాల్గొన్నా రెండు శిలాఫలకాలనూ ఆ కార్యాలయంలో శాశ్వతంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2014లో ఎన్నికలు జరిగే వరకు అలాగే కొనసాగింది కాని ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇతర నాయకులు చేసిన శంఖుస్థాపన రాళ్లు మాయమవుతుండగా కేవలం ఇప్పటి నాయకులు వేసిన ప్రారంభోత్సవ రాళ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో వేసిన శంఖుస్థాపన రాళ్లను మూలన పడేయడం ...లేదా ఎక్కడ వేసిన రాళ్లను అక్కడ వదిలేయడం జరుగుతోందంటున్నారు. . తాజా ఘటనలివీ... కొత్తపల్లి మండలంలోని మండల కేంద్రమైన కొత్తపల్లి పోలీసు స్టేషన్, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణాలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అప్పటి ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనా«థ్ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎట్టకేలకు ఆ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఆ భవనాలను ఎన్నికల అనంతరం కొత్త పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ కార్యాలయాల వద్ద మాత్రం గతంలో పాలకులు చేసిన శంఖుస్థాపన రాళ్లను మూడు ముక్కలు చేసి మూలన పడేయడం గమనార్హం. గతంలో కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని గతంలో పాలకులు ప్రారంభించగా అక్కడ మాత్రం శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అదే కార్యాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రస్తుత నాయకుల పేరుతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. + తాజాగా పిఠాపురం మండలంలో మంగితుర్తిలో ఒక దాత ఏర్పాటు చేసిన శిలాఫలకం తీయించేసి ఎమ్మెల్యే వర్మ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం ఏర్పాటు చేయించడం ఇందుకు తార్కాణం. ఈ తంతు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలం మారుతోంది ...ప్రభుత్వాలు మారుతుంటాయి ... నాయకులు తారుమారవుతుంటారు...అలా అని గత పాలకుల జ్ఞాపకాలను తుడిచేయాలనే కుటిల ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని ... ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.