రాజు గారి ‘శిలా’శాసనం | laying stones destroying pitapuram | Sakshi
Sakshi News home page

రాజు గారి ‘శిలా’శాసనం

Published Sat, May 27 2017 3:37 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

రాజు గారి  ‘శిలా’శాసనం

రాజు గారి ‘శిలా’శాసనం

 మాయమవుతున్న గత పాలకుల శిలా ఫలకాలు
శంకుస్థాపన రాళ్లు కనిపించకూడదట!
పిఠాపురంలో నీచ సంస్కృతి
 
రాచరికం పోయి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టినా ఆ ఛాయలు మాత్రం పిఠాపురం నియోజక వర్గంలో పోవడం లేదు. రాజుల పాలనలో యుద్ధాలు జరిగేవి. విజేతగా నిలిచిన రాజుదే ఆ రాజ్యం. అందుకే గత రాజుల ఆనవాలు కనిపించకుండా ధ్వంసం చేసేవారు. అదే పద్ధతిని ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రాజుగారు. శాశ్వతంగా తానే ఉండిపోతాననే భ్రమలో ఉన్నట్టున్నారు ఈ రాజుగారు. పాత శిలా ఫలకాలు ఒక్కొక్కటినీ పడగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నారు.
 
పిఠాపురం: చరిత్రను చాటి చెప్పే శిలా శాసనాలను రాచరికంలో రాజులు వేయించుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో పాలకులు తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల జ్ఞాపకాలుగా శిలా ఫలకాలను వేయించుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ చూసినా ఆయన పేరు తప్ప మరే ఇతర నాయకుల పేర్లు కపించకూడదనేది ఇక్కడి రాజు గారి శిలాశాసనం. రెండు, మూడేళ్ల ముందు ఒకరు శంఖుస్థాపన చేస్తారు ... పూర్తయిన తరువాత ఆ రోజుకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేస్తారు. ఆ సమయంలో శంఖుస్థాపన చేసినవారి పేరుతోపాటు ప్రారంభోత్సవం చేసినవారి పేరు ఉండడం సహజం. కానీ ఈయనగారు ప్రారంభించిన ఏ కార్యాలయంలోనూ తన ప్రారంభోత్సవ శిలాఫలకం తప్ప శంఖుస్థాపన శిలాఫలకం మాత్రం కనిపించకూడదనే హుకుం జారీ చేయడంతో జుత్తు పీక్కుంటున్నారు ఆయా శాఖల అధికారులు. ఈ నిరంకుశత్వ విధానాలు ఎక్కడో కాదు పిఠాపురం నియోజకవర్గంలో... ఆ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ జమానాలో ఈ తంతు సాగుతోంది. 
పద్థతిదీ...
సాధారణంగా ఏ ప్రభుత్వ భవనమైనా ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపడితే ఆ సమయంలో అధికారంలో ఉన్న పాలకులు శంఖుస్థాపన చేస్తారు. ఆ భవనాలు పూర్తయ్యాక వాటిని పాలకులు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఏ పాలకులు కార్యక్రమంలో పాల్గొన్నా రెండు శిలాఫలకాలనూ ఆ కార్యాలయంలో శాశ్వతంగా కనిపించే విధంగా ఏర్పాటు చేయడం ఆనవాయితీ. 2014లో ఎన్నికలు జరిగే వరకు అలాగే కొనసాగింది కాని ఎన్నికల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో దీనికి భిన్నంగా జరుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇతర నాయకులు చేసిన శంఖుస్థాపన రాళ్లు మాయమవుతుండగా కేవలం ఇప్పటి నాయకులు వేసిన ప్రారంభోత్సవ రాళ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గతంలో వేసిన శంఖుస్థాపన రాళ్లను మూలన పడేయడం ...లేదా ఎక్కడ వేసిన రాళ్లను అక్కడ వదిలేయడం జరుగుతోందంటున్నారు. 
.
తాజా ఘటనలివీ...
కొత్తపల్లి మండలంలోని మండల కేంద్రమైన కొత్తపల్లి పోలీసు స్టేషన్, తహసీల్దారు కార్యాలయం, ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణాలకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అప్పటి ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనా«థ్‌ శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎట్టకేలకు ఆ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంతలో ఎన్నికలు రావడం ఆ భవనాలను ఎన్నికల అనంతరం కొత్త పాలకులు ప్రారంభోత్సవాలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ కార్యాలయాల వద్ద మాత్రం గతంలో పాలకులు చేసిన శంఖుస్థాపన రాళ్లను మూడు ముక్కలు చేసి మూలన పడేయడం గమనార్హం. 
 
గతంలో కొత్తపల్లి మండల పరిషత్‌ కార్యాలయాన్ని గతంలో పాలకులు ప్రారంభించగా అక్కడ మాత్రం శంఖుస్థాపన ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అదే కార్యాలయంలో ఆధునికీకరణ పనులు చేపట్టి ప్రస్తుత నాయకుల పేరుతో కొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 
 
+ తాజాగా పిఠాపురం మండలంలో మంగితుర్తిలో ఒక దాత ఏర్పాటు చేసిన శిలాఫలకం తీయించేసి ఎమ్మెల్యే వర్మ ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకం ఏర్పాటు చేయించడం ఇందుకు తార్కాణం. ఈ తంతు ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి జరుగుతోందని  గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలం మారుతోంది ...ప్రభుత్వాలు మారుతుంటాయి ... నాయకులు తారుమారవుతుంటారు...అలా అని గత పాలకుల జ్ఞాపకాలను తుడిచేయాలనే కుటిల ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని ... ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని నియోజకవర్గ ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement