
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది.
ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రణరంగంగా పాక్
ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్‌ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు.