Former Pakistan PM Imran Khan arrested during court appearance, sparking voilence - Sakshi
Sakshi News home page

Imran Khan: ఒక ఇమ్రాన్‌.. రెండు కేసులు

Published Thu, May 11 2023 5:04 AM | Last Updated on Thu, May 11 2023 11:13 AM

Former Pakistan PM Imran Khan arrested during court appearance, sparking protests - Sakshi

పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్‌ తెహ్రీకీ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను రెండు కేసులు చిక్కుల్లో పడేశాయి. ఒక కేసు ఆయన అరెస్ట్‌కి దారి తీస్తే, మరో కేసులో న్యాయస్థానం ఆయనని దోషిగా తేల్చింది. ఈ రెండు కేసులు దేనికవే భిన్నమైనవి. బ్రిటన్‌లో మూలాలున్న ఒక కేసులో మనీ లాండరింగ్‌ వ్యవహారాలు ప్రధానంగా ఉంటే , మరో కేసులో ప్రభుత్వానికి వచ్చిన ఖరీదైన బహుమతుల్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ కేసు  
ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు కారణమైన అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌ కేసుది ఆసక్తికరమైన నేపథ్యం. దీని మూలాలు బ్రిటన్‌లో ఉన్నాయి. ఇమ్రాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు 2019లో అల్‌ ఖదర్‌ యూనివర్సిటీ ట్రస్ట్‌ ఏర్పాటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాలిక్‌ రియాజ్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌ మధ్య జరిగిన క్విడ్‌ ప్రోకో ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.5 వేల కోట్లు నష్టం వాటిల్లిందనేది ప్రధానమైన ఆరోపణ.

గత ఏడాది జూన్‌లో మొట్టమొదటిసారిగా అల్‌ ఖదీర్‌ యూనివర్సిటీ ట్రస్ట్‌ కేసు అవినీతిపై అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్‌ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనుల్లా వివరాల ప్రకారం పంజాబ్‌లోని జీలం జిల్లా సొహావా ప్రాంతంలో సూఫీయిజాన్ని బోధించడం కోసం అల్‌ ఖదీర్‌ యూనివర్సిటీని నిర్మించడానికి ఇమ్రాన్‌ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు జుల్ఫికర్‌ బుఖారీ, బాబర్‌ అవాన్‌ కలిసి అల్‌ ఖదీర్‌ ట్రస్ట్‌  ప్రాజెక్టును ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత 2019లో ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబీ బహ్రియా పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థ నుంచి విరాళాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. ట్రస్ట్‌కు వందలాది కోట్ల విలువైన 57.25 ఎకరాలను ఆ సంస్థ విరాళంగా అందించింది. అందులో 240 కనాల్స్‌ భూమిని (30 ఎకరాలు) బుష్రా బీబీకి ప్రాణ స్నేహితురాలైన ఫరా గోగి పేరిట బదలాయించారు. బహ్రియాలో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అధిపతే మాలిక్‌ రియాజ్‌.

ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని బ్రిటన్‌లో విచారించే నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ (ఎన్‌సీఏ) ఒకానొక కేసులో మాలిక్‌ రియాజ్‌ నుంచి ఏకంగా 19 కోట్ల పౌండ్ల (అప్పట్లో పాకిస్తాన్‌ కరెన్సీలో రూ. 5,000 కోట్లు) నల్లధనం జప్తు చేసింది. బ్రిటన్‌లో చట్టాల ప్రకారం విదేశీయుడికి చెందిన డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి వారి మాతృ దేశంలో ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ప్రకారం పాకిస్తాన్‌లో ఇమ్రాన్‌ ప్రభుత్వానికి అప్పగించింది.

అయితే ఇమ్రాన్‌కు, మాలిక్‌ రియాజ్‌కు మధ్య కుదిరిన ఒప్పందంతో ఇమ్రాన్‌ సర్కార్‌ ఆ వ్యాపారి బ్రిటన్‌ ఖాతాకు తిరిగి డబ్బులు పంపినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా మాలిక్‌ రియాజ్‌ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములతో పాటు రూ.500 కోట్ల రూపాయల్ని కూడా ముట్టజెప్పారన్నది ఆరోపణ. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను ఈ ఒప్పందంతో ఇమ్రాన్‌ సర్కార్‌ పూర్తిగా ముంచేసిందని షహబాజ్‌ సర్కార్‌ ఆరోపించింది. ఈ కేసులో మే 1న ఇమ్రాన్‌పై అరెస్ట్‌కి వారెంట్లు జారీ కాగా మే9న ఆయన అరెస్టయ్యారు.  

తోషాఖానా కేసు..
►ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోష ఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిలో ఉండగా 101 కానుకలు వచ్చాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన వజ్రాల రిస్ట్‌ వాచీలు, ఉంగరాలు, కఫ్‌లింక్స్‌ పెయిర్, రోలాక్స్‌ వాచీలు, పెన్నులు పెర్‌ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్‌ బాటిల్స్‌ నమూనాల వంటి కళాకృతులు వంటివి ఉన్నా యి. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా

వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకల్ని ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని, వాటిని మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేవలం మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్‌ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదు. ఇప్పుడు పాక్‌ కోర్టు ఆయనని ఈ కేసులో దోషిగా తేల్చింది.
 – సాక్షి,సెంట్రల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement