National Crime Agency
-
ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రణరంగంగా పాక్ ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్‌ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. -
Imran Khan: ఒక ఇమ్రాన్.. రెండు కేసులు
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ను రెండు కేసులు చిక్కుల్లో పడేశాయి. ఒక కేసు ఆయన అరెస్ట్‌కి దారి తీస్తే, మరో కేసులో న్యాయస్థానం ఆయనని దోషిగా తేల్చింది. ఈ రెండు కేసులు దేనికవే భిన్నమైనవి. బ్రిటన్‌లో మూలాలున్న ఒక కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు ప్రధానంగా ఉంటే , మరో కేసులో ప్రభుత్వానికి వచ్చిన ఖరీదైన బహుమతుల్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అల్ ఖదీర్ ట్రస్ట్ కేసు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు కారణమైన అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుది ఆసక్తికరమైన నేపథ్యం. దీని మూలాలు బ్రిటన్‌లో ఉన్నాయి. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2019లో అల్ ఖదర్ యూనివర్సిటీ ట్రస్ట్ ఏర్పాటు ముసుగులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాలిక్ రియాజ్‌కు, ఇమ్రాన్‌ఖాన్ మధ్య జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందంతో దేశ ఖజానాకు రూ.5 వేల కోట్లు నష్టం వాటిల్లిందనేది ప్రధానమైన ఆరోపణ. గత ఏడాది జూన్‌లో మొట్టమొదటిసారిగా అల్ ఖదీర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసు అవినీతిపై అధికారంలో ఉన్న సంకీర్ణ సర్కార్ బహిరంగంగా ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనుల్లా వివరాల ప్రకారం పంజాబ్‌లోని జీలం జిల్లా సొహావా ప్రాంతంలో సూఫీయిజాన్ని బోధించడం కోసం అల్ ఖదీర్ యూనివర్సిటీని నిర్మించడానికి ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీ, ఆయనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు జుల్ఫికర్ బుఖారీ, బాబర్ అవాన్ కలిసి అల్ ఖదీర్ ట్రస్ట్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2019లో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ బహ్రియా పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి విరాళాలు తీసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు. ట్రస్ట్‌కు వందలాది కోట్ల విలువైన 57.25 ఎకరాలను ఆ సంస్థ విరాళంగా అందించింది. అందులో 240 కనాల్స్ భూమిని (30 ఎకరాలు) బుష్రా బీబీకి ప్రాణ స్నేహితురాలైన ఫరా గోగి పేరిట బదలాయించారు. బహ్రియాలో రియల్ ఎస్టేట్ సంస్థ అధిపతే మాలిక్ రియాజ్. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని బ్రిటన్‌లో విచారించే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) ఒకానొక కేసులో మాలిక్ రియాజ్ నుంచి ఏకంగా 19 కోట్ల పౌండ్ల (అప్పట్లో పాకిస్తాన్ కరెన్సీలో రూ. 5,000 కోట్లు) నల్లధనం జప్తు చేసింది. బ్రిటన్‌లో చట్టాల ప్రకారం విదేశీయుడికి చెందిన డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటే తిరిగి వారి మాతృ దేశంలో ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ప్రకారం పాకిస్తాన్లో ఇమ్రాన్ ప్రభుత్వానికి అప్పగించింది. అయితే ఇమ్రాన్‌కు, మాలిక్ రియాజ్‌కు మధ్య కుదిరిన ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ ఆ వ్యాపారి బ్రిటన్ ఖాతాకు తిరిగి డబ్బులు పంపినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనికి ప్రతిఫలంగా మాలిక్ రియాజ్ యూనివర్సిటీ నిర్మాణం కోసం భూములతో పాటు రూ.500 కోట్ల రూపాయల్ని కూడా ముట్టజెప్పారన్నది ఆరోపణ. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను ఈ ఒప్పందంతో ఇమ్రాన్ సర్కార్ పూర్తిగా ముంచేసిందని షహబాజ్ సర్కార్ ఆరోపించింది. ఈ కేసులో మే 1న ఇమ్రాన్‌పై అరెస్ట్‌కి వారెంట్లు జారీ కాగా మే9న ఆయన అరెస్టయ్యారు. తోషాఖానా కేసు.. ►ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోష ఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవిలో ఉండగా 101 కానుకలు వచ్చాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన వజ్రాల రిస్ట్ వాచీలు, ఉంగరాలు, కఫ్లింక్స్ పెయిర్, రోలాక్స్ వాచీలు, పెన్నులు పెర్ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్ బాటిల్స్ నమూనాల వంటి కళాకృతులు వంటివి ఉన్నా యి. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించడంతో పాటు వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 2018, సెప్టెంబర్ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకల్ని ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్ తీసుకున్నారని, వాటిని మార్కెట్లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కేవలం మూడు వాచీలను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్న మొత్తం రూ.3.6 కోట్లుగా తేలింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్ గద్దె దిగిన తర్వాత తోషఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదు. ఇప్పుడు పాక్ కోర్టు ఆయనని ఈ కేసులో దోషిగా తేల్చింది. – సాక్షి,సెంట్రల్ డెస్క్ -
పాక్ క్రికెటర్ జంషెద్ అరెస్ట్
ఫిక్సింగ్ ఆరోపణలతో లండన్‌లో అరెస్ట్ అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు పాక్ క్రికెటర్ నాసిర్ జంషెద్‌గా తేలింది. దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో జంషెద్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ నిర్ధారించింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించినా... వారి పేర్లను ముందుగా వెల్లడించలేదు. పోలీసులు అదుపులోకి తీసుకోక ముందే పాక్ క్రికెట్ బోర్డు జంషెద్పై అనుమానంతో అతడిపై నిషేధం విధించింది. గత ఏడాది పీఎస్ఎల్ బరిలోకి దిగిన జంషెద్ ఈ సీజన్లో టోర్నీలో ఆడటం లేదు. పాక్ తరఫున 2 టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల జంషెద్... తన కెరీర్లో మూడు అంతర్జాతీయ సెంచరీలను భారత్‌పైనే వన్డేల్లో సాధించాడు. -
సినీ నిర్మాత పేరుతో బ్రిటన్‌లో మోసాలు
లండన్: బ్రిటన్‌లో భారీ ఎత్తున పన్ను మోసాలకు పాల్పడిన నిందితుల జాబితాలో భారత సంతతికి చెందిన ఓ నకిలీ సినీ నిర్మాత పేరు ప్రముఖంగా చోటు చేసుకుంది. బ్రిటన్‌లో మోసాలకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగా లండన్ పోలీసులు, నేషనల్ క్రైమ్ ఏజెన్సీ సాయంతో దర్యాప్తునకు అవసరమైన నిందితుల జాబితాను విడుదల చేశారు. తూర్పు లండన్‌లోని బెక్టన్ ప్రాంతానికి చెందిన సందీప్ అరోరా (42) సినిమాలను నిర్మించకపోయినా, అసలు సినిమాల నిర్మాణంతో అతడికి ఎలాంటి సంబంధం లేకపోయినా... 45 లక్షల పౌండ్ల వ్యాట్, వినోద పన్ను రాయితీలు పొందినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అరోరా ప్రస్తుతం భారత్‌లో ఉండి ఉండవచ్చని, ఇతడి గురించి సినిమా రంగానికి చెందిన కరణ్ అరోరా సహా పలువురికి తెలిసే ఉంటుందని లండన్ పోలీసులు భావిస్తున్నారు. -
హడలెత్తిస్తున్న ఆన్లైన్ రేప్‌లు
లండన్: లండన్‌లో ఆన్లైన్ రేప్‌లు హడలెత్తిస్తున్నాయి. గత ఏడాదికన్నా ఈ ఏడాది వాటి సంఖ్య అమాంతం పెరిగినట్లు లండన్‌కు చెందిన నేషనల్ క్రైం ఎజెన్సీ (ఎన్సీఏ) తెలిపింది. వారు తెలిపిన ప్రకారం ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా, యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులను కలిసేందుకు వెళ్లిన తర్వాత వారిపై లైంగిక దాడులు జరిగిన ఘటనలు ఎక్కువయ్యాయి. సాధరణంగా డేటింగ్ యాప్ ల ద్వారా అంతకుముందు ఒకరికొకరు తెలియని వారు కూడా పరిచయం అవుతారు. అలా పరిచయమైనవారిని కలిసేందుకు వెళుతుంటారు. ఇలా వెళ్లినప్పుడు వారిపై బలవంతంగా లైంగిక దాడులు ఎక్కువయ్యాయట. 2009లో ఇలాంటి ఘటనలు 33 జరుగగా 2014లో వీటి సంఖ్య 184కు అమాంతం పెరిగింది. ఇలాంటి ఘటనలకు బాధ్యులైనవారిలో 85శాతం మంది మహిళలు ఉండగా వారిలో 42శాతం మంది 20 నుంచి 29 ఏళ్ల లోపువారు, 24శాతంమంది 40 నుంచి 49ఏళ్లలోపువారు ఉన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని తగిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని ఎన్సీఏ ఆందోళన వ్యక్తం చేసింది.