కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకు స్థానంపై వివరణ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టీకరణ విచారణ రెండు వారాలకు వాయిదా
హైదరాబాద్: సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద అర్హులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ కమిటీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడంపై హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. గ్రామ కమిటీల్లో తెలుగు తమ్ముళ్లకు స్థానం కల్పించడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌లతో పాటు గ్రామ కమిటీల్లో స్థానం పొందిన పలువురు టీడీపీ కార్యకర్తలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరికి స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ అర్హుల పరిశీలన కమిటీలో తెలుగు తమ్ముళ్లకు స్థానం కల్పించడాన్ని సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన గండి ప్రణీత్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరఫున కురిటి భాస్కరరావు వాదనలు వినిపిస్తూ... మార్గదర్శకాలకు విరుద్ధంగా గ్రామ కమిటీల్లో టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వం స్థానం కల్పించిందని తెలిపారు. ఈ పథకంలో పార్టీ కార్యకర్తలకు స్థానం కల్పించడం ద్వారా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని పేర్కొన్నారు. ఇది సరికాదని, మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేదన్నారు. పెన్షన్ మంజూరులో టీడీపీ కార్యకర్తలకు, సానుభూతిపరులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, దీని వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ లోపు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.