ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్నీ పరిగణించాలి | the high court said take suspension time into account in retirement time | Sakshi
Sakshi News home page

ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్నీ పరిగణించాలి

Published Sun, Apr 20 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్నీ పరిగణించాలి

ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్నీ పరిగణించాలి

*దాన్నీ లెక్కించే పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి
*సస్పెన్షన్ సుదీర్ఘకాలం ఉండకూడదు: హైకోర్టు తీర్పు
 

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగిని ఏదైనా కారణాలతో సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తే, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించే సమయంలో ఆ సస్పెన్షన్ కాలాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాగే సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆ ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్ని ఏ విధంగా పరిగణిస్తారో కూడా స్పష్టం చేయాలని పేర్కొంది. సస్పెన్షన్ సుదీర్ఘ కాలం ఉండరాదంది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ వ్యాజ్యం వివరాలిలా ఉన్నాయి... 1970లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగిగా చేరిన వి.రామారావు అనే వ్యక్తిని అధికారులు 1996లో సర్వీసు నుంచి తొలగించారు.ఆయన సస్పెన్షన్‌ను సమర్థిస్తూ ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ 1997లో ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలు చేస్తూ రామారావు 1999లో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ చంద్రకుమార్ గత ఏడాది జూన్‌లో తీర్పునిచ్చారు.

పదవీ విరమణ ప్రయోజనాలు పొందేందుకు పిటిషనర్ అర్హుడో కాదో తేల్చి, ఆరు వారాల్లో తగిన ఉత్తర్వులను జారీ చేయాలని ఎస్‌బీఐ అధికారులను ఆదేశించారు. అయితే ఈ తీర్పులో సస్పెన్షన్ కాలం గురించి ప్రస్తావించకపోవడంతో అధికారులు దాన్ని మినహాయించి నిబంధనల ప్రకారం పెన్షన్‌కు అర్హుడు కాదని ఎస్‌బీఐ అధికారులు తేల్చారని, అందువల్ల గత తీర్పులో సస్పెన్షన్ కాలం గురించి స్పష్టతనివ్వాలని కోరుతూ రామారావు పునఃసమీక్ష (రివ్యూ) పిటిషన్ దాఖలు చేశారు.
 
పెన్షన్ పొందాలంటే ఉద్యోగి కనీసం ఇరవయ్యేళ్ల సర్వీసు లేదా వయసుతో సంబంధం లేకుండా 25 ఏళ్ల పెన్షనబుల్ సర్వీసు పూర్తి చేసి ఉండాలని ఎస్‌బీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.  రామారావు దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్‌ను అనుమతినిస్తూ, పిటిషనర్ సస్పెన్షన్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని, అతనికి పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement