గెలిచిన నేతలకు బంపర్ ఆఫర్..వేసవి విడిదిని హాయిగా గడపాలనుందా..? మీతోపాటు ఇంటిల్లిపాదినీ తీసుకెళ్లే అవకాశం వస్తోంది... జిల్లాలో ‘క్యాంపు’ రాజకీయాల సందడికి సమయం ఆసన్నమైంది.
సాక్షి, ఒంగోలు : గెలిచిన నేతలకు బంపర్ ఆఫర్..వేసవి విడిదిని హాయిగా గడపాలనుందా..? మీతోపాటు ఇంటిల్లిపాదినీ తీసుకెళ్లే అవకాశం వస్తోంది... జిల్లాలో ‘క్యాంపు’ రాజకీయాల సందడికి సమయం ఆసన్నమైంది. ప్రధాన రాజకీయ పార్టీల నేతల నెత్తిన మరోభారం పడనుంది. ఎట్టకేలకు మున్సిపల్ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. వార్డు కౌన్సిలర్లుగా ఎవరు గెలిచారో తేలిపోతుంది. వారంతా కలిసి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవాలి.
అయితే, ఈ ప్రక్రియకు ఇంకా చాలా సమయముంది. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ
అభ్యర్థులుగా గెలిచిన వారు సైతం తమ చైర్మన్‌లను ఎన్నుకోవడానికి కనీసం 20 రోజుల సమయం పడుతోంది. దీంతో, ఆ రెండు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పక్క పార్టీల్లోకెళ్లకుండా కాపాడుకునేందుకు ‘క్యాంపు’ రాజకీయాలు నడపటం అనివార్యమవుతోంది. ఇన్నిరోజులపాటు అభ్యర్థులను తమకు అనుకూలంగా ఉంచుకునేందుకు పెద్ద మొత్తంలో నిధులు భరించాల్సి ఉంటుందని ప్రధాన పార్టీలు ఇప్పటికే అంచనాలేసుకున్నాయి.
జిల్లా పరిస్థితి ఇదీ..
జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలుత ఏప్రిల్ 2వ తేదీన ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే, వాటి ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడతాయని కొందరు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే..దీనిపై కోర్టు సానుకూలంగా స్పందిస్తూ మే నెల 12న ఓట్ల లెక్కింపు చేపట్టి..అదేరోజు ఫలితాలను వెల్లడించాలంటూ తీర్పిచ్చింది.
దీనిప్రకారం సోమవారం మున్సిపల్ ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. అయితే, ఎన్నికైన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్‌ను వెంటనే ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యేలకు సైతం ఓటువేసే సౌలభ్యం ఉండటంతో..కొత్తరాష్ట్రం జూన్ నెల 2 తర్వాతనే ఏర్పాటు కానుండటంతో అప్పటి వరకు చైర్మన్ కాగోరే అభ్యర్థులు వేచిచూడక తప్పదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల కౌంటింగ్ ఈనెల 13న జరగనుంది.
గెలుపొందిన సభ్యులు ఎంపీపీని, జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోవాలంటే జూన్ 2 దాకా ఆగాల్సిందే..
విడిది కేంద్రాల ప్లానింగ్..
చైర్మన్ అభ్యర్థుల ఎంపిక వరకు గెలుపొందిన సభ్యులను కాపాడుకునేందుకు ప్రధాన పార్టీలైన వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో భార్యాపిల్లలతో క్యాంపులకు వెళ్లేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. గతంలో క్యాంపులు నాలుగైదు రోజులు మాత్రమే జరిగేవి..ఇప్పటి పరిస్థితుల కారణంగా 20 రోజుల సమయముంది. దీనికనుగుణంగా గెలుపొందిన అభ్యర్థులను తమకు అనుకూలంగా ఉండేలా కాపాడుకోవాలంటే.. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి క్యాంపు రాజకీయాలు నడపాల్సిందే.. పార్టీలు కూడా చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించిన వారిని నిధులు సమకూర్చుకోవాలంటూ ఇప్పటికే ఆదేశించాయి. పుణ్యక్షేత్రాలు, వేసవి విడిది కేంద్రాలపై వివరాలను ఆరాతీస్తూ.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలను బుక్ చేసుకునే ప్రయత్నాలు నడుస్తున్నాయి.