- న్యాయశాఖ ఉద్యోగుల సంఘం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనతోపాటు తన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 17 తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ న్యాయశాఖ ఉద్యోగులు ప్రకటించారు. సమ్మె నోటీసు గడువు17తో ముగుస్తున్న నేపథ్యంలో.. హైకోర్టు నుంచి చర్చలకు పిలుపు రాకపోతే సమ్మెకు దిగడం అనివార్యమని స్పష్టం చేశారు. సమ్మెపై చర్చించేందుకు ఆదివారం సిటీ సివిల్ కోర్టు ఆవరణలో తెలంగాణ పది జిల్లాలకు చెం దిన న్యాయశాఖ ఉద్యోగుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశమయ్యారు.
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరి గింది. హైకోర్టు విభజనతోపాటు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించారు. అయితే సమ్మెను ఎప్పటి నుంచి చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి అప్పగించారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులతో కలసి ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరున చలో హైదరాబాద్ నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
హైకోర్టు విభజనతోపాటు వారి డిమాండ్ల సాధన కోసం న్యాయశాఖ ఉద్యోగులు సమ్మె నిర్ణయం తీసుకోవడంపై నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 45 రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని, ఈ నేపథ్యంలో న్యాయశాఖ ఉద్యోగులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.