సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు | sujana Chowdhury was Rs .106 crore Paying dues | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు

Published Wed, Nov 12 2014 1:31 AM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM

సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు - Sakshi

సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు

హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ పిటిషన్

బాకీ ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నారు.. అయినా బకాయిలు చెల్లించడంలేదు...  లండన్ కోర్టు చెప్పినా స్పందన లేదు . సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, ఆస్తులు అమ్మి మా అప్పులు తీర్చండి .అందుకు లిక్విడేటర్‌ను నియమించండి.. కంపెనీ ఆస్తులు విక్రయించకుండా, అన్యాక్రాంతం చేయకుండా ఆదేశాలివ్వండి
     
విచారణను 18కి వాయిదా వేసిన హైకోర్టు

 
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమకు 106 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, సొమ్ము చెల్లించాలని కోరినా సమాధానం చెప్పడంలేదంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయి తిరిగి చెల్లించే పరిస్థితిలో లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎంసీబీ పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మారిషస్‌లో హేస్టియా పేరుతో అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. హేస్టియా 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది.

రుణానికి సంబంధించి ఇంగ్లిష్ చట్టాలకు లోబడి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి హేస్టియా రుణ చెల్లింపులు నిలిపివేసింది. వీటి పై హేస్టియాకు ఎంసీబీ పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఒప్పందానికి సవరణలు చేయాలని హేస్టియా కోరగా, అందుకు ఎంసీబీ అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా మరోసారి ఒప్పందానికి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరిని ఎస్‌ఎంఎస్ ద్వారా సంప్రదించారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని, జరుగుతున్న పరిమాణాలకు క్షమాపణలు కోరుతున్నానని ఎంసీబీ అప్పటి గ్లోబల్ బిజినెస్ హెడ్ ప్రతిక్ ఘోష్‌కు 2012, అక్టోబర్ 16న సుజనా చౌదరి ఎస్‌ఎంఎస్ పంపారు.  వీలైనంత త్వరగా మొత్తం వ్యవహారాన్ని పరిష్కరిరు. తాను అమెరికా వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చాక బ్యాంకర్లతో మాట్లాడతానని ఆ ఎస్‌ఎంఎస్‌లో సుజనా చౌదరి పేర్కొన్నారు. మరో డెరైక్టర్ హనుమంతరావు కూడా డిసెంబర్ నెలలో పంపిన మెయిల్‌లో బకాయి ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయినా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు పంపిన నోటీసులకు కూడా స్పందన లేదు. ఇదిలా ఉండగానే ఈ మొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయ పరిధిని సవాలు చేస్తూ హేస్డియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో ముందస్తుగా ఓ పిటిషన్ వేశాయి. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని ఆ న్యాయస్థానం తేల్చి చెప్పింది. వడ్డీతో సహా బకాయి ఉన్న రూ.105 కోట్లు, ఖర్చుల కింద మరో రూ.72 లక్షలు ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు తీర్పును అమలు చే యాలని కోరింది. సుజనా యూనివర్సల్ ఆస్తిని జప్తు చేసి, దానిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బకాయి కింద చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న అసాధారణ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. సుజనా యూనివర్సల్‌ను మూసివేసి, ఆ కంపెనీ ఆస్తులను విక్రయించి తమ బకాయిలను తీర్చేందుకు ఓ అధికారిక లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. అంతేకాకుండా కంపెనీ ఆస్తులను విక్రయించడం, అన్యాకాంత్రం చేయడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎంసీబీ కోరింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement