‘స్వచ్ఛంద’ సర్వేకు గ్రీన్‌సిగ్నల్
నిలుపుదలకు అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ఎవరినీ బలవంతపెట్టబోమన్న రాష్ర్ట ప్రభుత్వం
స్వచ్ఛందంగా వివరాలిస్తేనే నమోదుకు హామీ
చట్ట ప్రకారమే సర్వే చేస్తున్నామని ఏజీ వాదన
తదుపరి విచారణ 20కి వాయిదా
హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. సర్వే సందర్భంగా పౌరుల నుంచి బలవంతంగా వివరాలు సేకరించబోమని, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే వివరాలు నమోదు చేసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గణాంకాల సేకరణ చట్టానికి విరుద్ధంగా రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిందని, దీన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన గృహిణి సీతాలక్ష్మీ, మరొకరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన కోర్టు గురువారం మరోసారి విచారించింది. సీతాలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.రఘునందన్‌రావు వాదనలు వినిపించారు. గణాంకాల సేకరణ చట్టం ప్రకారం పౌరుల వివరాలతో కూడిన సర్వేను నిర్వహించే అధికారం రాష్ట్రాలకు లేదని, అది కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలకు ప్రత్యేకాధికారాలు గానీ, మినహాయింపులు గానీ లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. సర్వే చేయాలనుకుంటే ముందుగా నోడల్ అధికారిని నియమించాలని, ఏదైనా ప్రభుత్వ శాఖ సర్వే చేయాలనుకుంటే ముందు నోడల్ అధికారిని సంప్రదించాలని, అతని సలహా మేరకే సర్వే చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నారు.
కానీ రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన సర్వే విషయంలో ఈ నిబంధనలను సరిగా పాటించలేదని వాదించారు. పౌరుల వ్యక్తిగత వివరాలను భద్రపరిచే వ్యవస్థ కూడా లేదన్నారు. సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత వివరాలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా సేకరించడానికి వీల్లేదన్నారు. తర్వాత అడ్వొకేట్ జనరల్(ఏజీ) రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. సర్వే నిర్వహించే అధికారం రాష్ట్రానికి ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు దక్కడం లేదని, పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకుని అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. సంక్షేమ పథకాల వల్ల అయాచిత లబ్ధి పొందే దళారులే ఈ సర్వేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు విన్నవించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఈ సర్వేపై వైఖరి ఏంటో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని అడిగారు. చట్ట పరిధిలోనే సర్వే చేస్తున్నారని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ బి.నారాయణరెడ్డి కోర్టుకు నివేదించారు. తర్వాత ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. ఈ సర్వేలో పౌరుల నుంచి స్వచ్ఛందంగానే వివరాలను సేకరిస్తామని, ఎవరినీ బలవంతం చేయబోమని తెలిపారు.
దీంతో న్యాయమూర్తి ఆ ప్రకటనను రికార్డ్ చేస్తూ.. ఆ ప్రకారమే సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. పిటిషనర్ల భయాందోళనలకు ప్రాథమిక ఆధారాలు కనిపించడం లేదని, అందువల్ల సర్వే నిలుపుదల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు ఉత్తర్వులిచ్చారు. సర్వే చట్ట విరుద్ధమంటూ దాఖలైన ప్రధాన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.