సీఆర్‌డీఏ చట్టబద్ధతపై స్పందించిన హైకోర్టు
{పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం
పిటిషనర్ల భూములపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి
అప్పటి వరకు వారి వ్యవసాయ కార్యకలాపాల్లో
జోక్యం వద్దు.. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం
హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోద ముద్ర లేని సీఆర్‌డీఏ చట్టాన్ని రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలైన రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్)కు ప్రభుత్వం పిటిషనర్ల ఆమోదం ప్రభుత్వం కోరడం గానీ, పిటిషనర్లు ఆమోదం తెలపడంగానీ జరగనందున వారి భూముల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.
అప్పటివరకు పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ భూములను ఇతరులకు విక్రయించడం లేదా బదలాయించడం లేదా థర్డ్ పార్టీ హక్కులను సృష్టించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానికి భూములు అవసరమైతే భూ సమీకరణ కింద కాకుండా కేంద్రం తెచ్చిన కొత్త భూ సేకరణ చట్టం కింద మాత్రమే సేకరించాలని గుంటూరు, విజయవాడలకు చెందిన కొమ్మినేని చలపతిరావు, మరికొందరు రైతులు గతవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అసలు తాము పిటిషనర్ల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునేందుకు వారి అనుమతి కోరలేదని, వారు కూడా భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రానందున వారి భూముల్లో జోక్యం చేసుకుంటామని చెప్పడం సరికాదన్నారు.
ఒకవేళ వారి భూములు కావాలంటే 2013లో వచ్చిన కొత్త భూ సేకరణ ద్వారానే తీసుకుంటామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. దీనిపై పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ తాము సీఆర్‌డీఏ చట్టబద్ధతను మాత్రమే సవాలు చేశామని, వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని మాత్రమే కోరుతున్నామని చెప్పారు.