crda law
-
ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది: ఏపీ అడ్వొకేట్ జనరల్
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సోమవారం ఏపీ హైకోర్టుకు నివేదించారు. ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని వివరిం చారు. ఆ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు, ఆ బిల్లు ఉద్దే శాలు ఏమిటి తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తా మని చెప్పారు. బిల్లు కాపీని సైతం కోర్టు ముందుంచు తామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు శుక్రవారానికల్లా మెమో దాఖలు చేయాలని ఏజీకి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తదుపరి కార్యాచరణను ఆ రోజు నిర్ణయిస్తామని మౌఖికంగా తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమ యాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై గత 5 రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
‘రియల్’ వ్యాపారానికే బాబు ప్రాధాన్యం
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కేవలం 5 గ్రామాలకు సంబంధించి 8 చ.కి.మీ. పరిధిలోనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించి.. ఇప్పుడు ఆ పరిధిని 20 చ.కి.మీ పెంచి 20 గ్రామాల ప్రజలను బలి చేయబోతున్నారని దుయ్యబట్టారు. సీడ్ క్యాపిటల్‌లో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఉండదని సీఆర్డీఏ చట్టంలో స్పష్టంగా రాశారని.. అంటే ఆ పరిధిలో ఉండే 20 గ్రామాల్లో రైతులకు ఏ కేటాయింపులు ఉండవని తేలిపోతోందన్నారు. 20 చ.కి.మీ పరిధి బయట కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో రైతులకు భూములు దక్కినా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే కనీసం 10 మీటర్లు ఎత్తు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తిరుమల కొండలన్నింటినీ తవ్వినా అక్కడి భూముల ఎత్తు పెంచుకోవడానికి మట్టి సరిపోదన్నారు. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుచేయడం లేదని విమర్శించారు. ‘ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి హామీలను పక్కన పెట్టేశారు. రాజధాని ప్రాంత వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న సామాజిక పింఛన్లను 5-6 నెలల నుంచి చెల్లించడం లేదు. భూములిచ్చిన రైతులకు ఈ ఏడాది కౌలు చెక్కులు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. -
సీఆర్డీఏ చట్టబద్ధతపై స్పందించిన హైకోర్టు
{పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం పిటిషనర్ల భూములపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోండి అప్పటి వరకు వారి వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం వద్దు.. ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశం హైదరాబాద్: రాష్ట్రపతి ఆమోద ముద్ర లేని సీఆర్డీఏ చట్టాన్ని రాజ్యాం గ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్లు దాఖలైన రెండు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. రాజధాని నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్)కు ప్రభుత్వం పిటిషనర్ల ఆమోదం ప్రభుత్వం కోరడం గానీ, పిటిషనర్లు ఆమోదం తెలపడంగానీ జరగనందున వారి భూముల విషయంలో ప్రభుత్వం చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది. అప్పటివరకు పిటిషనర్ల వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ భూములను ఇతరులకు విక్రయించడం లేదా బదలాయించడం లేదా థర్డ్ పార్టీ హక్కులను సృష్టించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానికి భూములు అవసరమైతే భూ సమీకరణ కింద కాకుండా కేంద్రం తెచ్చిన కొత్త భూ సేకరణ చట్టం కింద మాత్రమే సేకరించాలని గుంటూరు, విజయవాడలకు చెందిన కొమ్మినేని చలపతిరావు, మరికొందరు రైతులు గతవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అసలు తాము పిటిషనర్ల భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునేందుకు వారి అనుమతి కోరలేదని, వారు కూడా భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రానందున వారి భూముల్లో జోక్యం చేసుకుంటామని చెప్పడం సరికాదన్నారు. ఒకవేళ వారి భూములు కావాలంటే 2013లో వచ్చిన కొత్త భూ సేకరణ ద్వారానే తీసుకుంటామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. దీనిపై పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ తాము సీఆర్డీఏ చట్టబద్ధతను మాత్రమే సవాలు చేశామని, వ్యవసాయ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. -
సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధం
* విభజన చట్టానికీ ఇది విరుద్ధమే * సీఆర్డీఏ చట్ట ప్రకారం ముందుకు వెళ్లకుండా ఏపీ సర్కారును అడ్డుకోండి * హైకోర్టులో విశ్రాంత న్యాయమూర్తుల పిల్ * రేపు విచారించనున్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధమేగాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది. సీఆర్డీఏ చట్టంవల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యంత సారవంతమైన భూములు నాశనమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని, అందువల్లే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని పిటిషనర్లు వివరించారు. రాజధాని ఎంపిక అధికారం కేంద్రానిది..: ‘‘పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధాని ప్రాంత ఎంపిక కేంద్రానిదే. ఫలానాప్రాంతంలోనే రాజధాని ఉంటుందని ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్‌ను రాజధానిగా కేంద్రమే ప్రకటించింది. కాబట్టి రాజధాని గుర్తింపు విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సెక్షన్ 6 ప్రకారం కేంద్రం మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేయగా.. ఇది క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించింది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ ఏరియా(వీటీజీఎం) ప్రాంతంలో రాజధాని ఏర్పాటువల్ల వ్యవసాయ భూములకు తీవ్రనష్టం కలుగుతుందని చెప్పింది. విజయవాడకు అటూఇటూ 300 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వీజీటీఎం ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు కమిటీ మొగ్గుచూపలేదు.’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టానికి రాజ్యాంగ బద్ధత లేదు ‘‘సీఆర్డీఏ చట్టం చేసేనాటికి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయడం, అది కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. ఇవన్నీ తెలిసినా రాష్ట్రప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని చేసింది. కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించాల్సింది కేంద్రం. సెక్షన్ 6 ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. కానీ కమిటీ సిఫారసు చేయనిప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేస్తోంది. కమిటీ సిఫారసులను స్వీకరించాక ఏపీ రాజధానిపై కేంద్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్రప్రభుత్వం వీజీటీఎం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. తద్వారా కేంద్ర అధికారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకున్నట్లయింది. అంతేకాదు.. కేంద్రం కొత్తగా తెచ్చిన భూసేకరణ చట్టానికి విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా.. సీఆర్డీఏ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు. కాబట్టి సీఆర్డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధం. భూసేకరణ వ్యవహారం కేంద్రపరిధిలోనిది. రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి భారీఎత్తున భూములను వీజీటీఎం ప్రాంతంలో సేకరించేందుకు జెట్స్పీడ్తో ముందుకెళుతోంది. సీఆర్డీఏ చట్టమే చట్టవిరుద్ధమైనప్పుడు, దానిపై చేస్తున్న ఖర్చు శుద్ధదండగ. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఈ చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలి. అంతేగాక సీఆర్డీఏ చట్టం కింద ముందుకెళ్లకుండా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’’ అని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు.’’ -
భూసమీకరణపై తాఖీదులు
పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం కింద భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) వ్యవహారంలో హైకోర్టు సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏ చట్టం కింద చేపట్టిన భూ సమీకరణ నుంచి తమ భూముల్ని మినహాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు బి.శివరామిరెడ్డి, మరో 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ డి. శ్రీనివాస్ వాదించారు. పిటిషనర్లు పేద రైతులని, వారి నుంచి ప్రభుత్వం భూముల్ని లాక్కునేందుకు యత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ దశలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. పది రోజుల గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... అభ్యంతరాలపై ఉత్తర్వులు జారీ కాకపోవడం వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మీ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చు కదా?’ అని పిటిషనర్లను ప్రశ్నించారు. దీనికి సుధాకర్‌రెడ్డి సమాధానమిస్తూ, ప్రభుత్వమే భూ సమీకరణ పేరుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు వల్ల రైతులకు ఉపయోగం లేదన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి... కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. ఆటంకాలు సృష్టించొద్దని ఆదేశం రాజధాని నిర్మాణం కోసం సమీకరిస్తున్న భూముల్లో పంటలు వేసుకునే రైతులకు ఆటంకాలు సృష్టించవద్దని హైకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందన్నారు. తాము దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిందని చెప్పారు. -
పేదల కడుపుకొట్టేందుకే సీఆర్డీఏ చట్టం
వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం విమర్శ సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ఆరోపించింది. సోమవారం రాజధాని రైతులు, పేదల సమస్యలపై సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలను ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. సీఆర్డీఏ చట్టం పేదవాడి పొట్ట గొట్టేందుకే అన్నట్లు ఉందని, భూసమీకరణ పేరుతో రైతుల్ని దగా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేటు భూములు తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం తుళ్లూరు ప్రాంత రైతులను వేధిస్తోందని, రాజధాని ప్రాంతంలో ఎమర్జీన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యతగల ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడి రైతులకు అండగా నిలబడిందని తెలిపారు. మూడు, నాలుగు పంటలు పండే ప్రాంతంలో రైతులు భూములు తీసుకోవడానికి వీల్లేదని డిమాండ్ చేసింది. రైతులు, కూలీలు, భూమి లేని నిరుపేదలు, సాంప్రదాయ వృత్తులవారు, పల్లెల్లో నివసించే ప్రతి ఒక్కరి హక్కులు కాపాడేందుకు తాము పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం సీఆర్డీఏ కార్యాలయానికి వస్తుందనే సమాచారంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం వినతిపత్రం ఇవ్వడానికే వచ్చినా పోలీసులు అత్యుత్సాహంతో ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు.