‘రియల్’ వ్యాపారానికే బాబు ప్రాధాన్యం
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాజధాని పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కేవలం 5 గ్రామాలకు సంబంధించి 8 చ.కి.మీ. పరిధిలోనే సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని ప్రకటించి.. ఇప్పుడు ఆ పరిధిని 20 చ.కి.మీ పెంచి 20 గ్రామాల ప్రజలను బలి చేయబోతున్నారని దుయ్యబట్టారు.
సీడ్ క్యాపిటల్‌లో ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఉండదని సీఆర్‌డీఏ చట్టంలో స్పష్టంగా రాశారని.. అంటే ఆ పరిధిలో ఉండే 20 గ్రామాల్లో రైతులకు ఏ కేటాయింపులు ఉండవని తేలిపోతోందన్నారు. 20 చ.కి.మీ పరిధి బయట కొండవీటి వాగు ముంపు ప్రాంతంలో రైతులకు భూములు దక్కినా ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలంటే కనీసం 10 మీటర్లు ఎత్తు పెంచుకోవాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. తిరుమల కొండలన్నింటినీ తవ్వినా అక్కడి భూముల ఎత్తు పెంచుకోవడానికి మట్టి సరిపోదన్నారు.
భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలేవి అమలుచేయడం లేదని విమర్శించారు. ‘ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వంటి హామీలను పక్కన పెట్టేశారు. రాజధాని ప్రాంత వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న సామాజిక పింఛన్లను 5-6 నెలల నుంచి చెల్లించడం లేదు. భూములిచ్చిన రైతులకు ఈ ఏడాది కౌలు చెక్కులు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు.