సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సోమవారం ఏపీ హైకోర్టుకు నివేదించారు. ఉపసంహరణ బిల్లును ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశ పెట్టారని వివరిం చారు. ఆ బిల్లును ఎందుకు తీసుకొచ్చారు, ఆ బిల్లు ఉద్దే శాలు ఏమిటి తదితర వివరాలతో మెమో దాఖలు చేస్తా మని చెప్పారు. బిల్లు కాపీని సైతం కోర్టు ముందుంచు తామన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు శుక్రవారానికల్లా మెమో దాఖలు చేయాలని ఏజీకి స్పష్టం చేసింది.
తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. తదుపరి కార్యాచరణను ఆ రోజు నిర్ణయిస్తామని మౌఖికంగా తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమ యాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై గత 5 రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment