పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రపదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టం కింద భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) వ్యవహారంలో హైకోర్టు సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ చట్టం కింద చేపట్టిన భూ సమీకరణ నుంచి తమ భూముల్ని మినహాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన రైతులు బి.శివరామిరెడ్డి, మరో 31 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ డి. శ్రీనివాస్ వాదించారు.
పిటిషనర్లు పేద రైతులని, వారి నుంచి ప్రభుత్వం భూముల్ని లాక్కునేందుకు యత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ఈ దశలో పిటిషనర్లు కోర్టును ఆశ్రయించడం సరికాదన్నారు. పది రోజుల గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... అభ్యంతరాలపై ఉత్తర్వులు జారీ కాకపోవడం వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మీ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చు కదా?’ అని పిటిషనర్లను ప్రశ్నించారు. దీనికి సుధాకర్‌రెడ్డి సమాధానమిస్తూ, ప్రభుత్వమే భూ సమీకరణ పేరుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పెంపు వల్ల రైతులకు ఉపయోగం లేదన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి... కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
ఆటంకాలు సృష్టించొద్దని ఆదేశం
రాజధాని నిర్మాణం కోసం సమీకరిస్తున్న భూముల్లో పంటలు వేసుకునే రైతులకు ఆటంకాలు సృష్టించవద్దని హైకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందన్నారు. తాము దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిందని చెప్పారు.
భూసమీకరణపై తాఖీదులు
Published Tue, Feb 24 2015 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement