* విభజన చట్టానికీ ఇది విరుద్ధమే
* సీఆర్‌డీఏ చట్ట ప్రకారం ముందుకు వెళ్లకుండా ఏపీ సర్కారును అడ్డుకోండి
* హైకోర్టులో విశ్రాంత న్యాయమూర్తుల పిల్
* రేపు విచారించనున్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధమేగాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది. సీఆర్‌డీఏ చట్టంవల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యంత సారవంతమైన భూములు నాశనమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని, అందువల్లే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని పిటిషనర్లు వివరించారు.
రాజధాని ఎంపిక అధికారం కేంద్రానిది..: ‘‘పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం రాజధాని ప్రాంత ఎంపిక కేంద్రానిదే. ఫలానాప్రాంతంలోనే రాజధాని ఉంటుందని ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు హైదరాబాద్‌ను రాజధానిగా కేంద్రమే ప్రకటించింది. కాబట్టి రాజధాని గుర్తింపు విషయంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. సెక్షన్ 6 ప్రకారం కేంద్రం మాజీ ఐఏఎస్ అధికారి కె.సి.శివరామకృష్ణన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటుచేయగా.. ఇది క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించింది. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ ఏరియా(వీటీజీఎం) ప్రాంతంలో రాజధాని ఏర్పాటువల్ల వ్యవసాయ భూములకు తీవ్రనష్టం కలుగుతుందని చెప్పింది. విజయవాడకు అటూఇటూ 300 కిలోమీటర్ల పరిధిలో భూకంపాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిన విషయాన్నీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వీజీటీఎం ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు కమిటీ మొగ్గుచూపలేదు.’’ అని పిటిషనర్లు పేర్కొన్నారు.
సీఆర్‌డీఏ చట్టానికి రాజ్యాంగ బద్ధత లేదు
‘‘సీఆర్‌డీఏ చట్టం చేసేనాటికి పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయడం, అది కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. ఇవన్నీ తెలిసినా రాష్ట్రప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని చేసింది. కమిటీ చేసిన సిఫారసులను ఆమోదించాల్సింది కేంద్రం. సెక్షన్ 6 ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదు. కానీ కమిటీ సిఫారసు చేయనిప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేస్తోంది. కమిటీ సిఫారసులను స్వీకరించాక ఏపీ రాజధానిపై కేంద్రం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్రప్రభుత్వం వీజీటీఎం ప్రాంతాన్ని ఎంపిక చేసింది.
తద్వారా కేంద్ర అధికారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకున్నట్లయింది. అంతేకాదు.. కేంద్రం కొత్తగా తెచ్చిన భూసేకరణ చట్టానికి విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. అన్నింటికన్నా ముఖ్యంగా.. సీఆర్‌డీఏ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదు. కాబట్టి సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధం. భూసేకరణ వ్యవహారం కేంద్రపరిధిలోనిది. రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి భారీఎత్తున భూములను వీజీటీఎం ప్రాంతంలో సేకరించేందుకు జెట్‌స్పీడ్‌తో ముందుకెళుతోంది. సీఆర్‌డీఏ చట్టమే చట్టవిరుద్ధమైనప్పుడు, దానిపై చేస్తున్న ఖర్చు శుద్ధదండగ. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఈ చట్టాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించాలి. అంతేగాక సీఆర్‌డీఏ చట్టం కింద ముందుకెళ్లకుండా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’’ అని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు.’’
సీఆర్‌డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధం
Published Sun, Apr 12 2015 4:16 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM
Advertisement