Union Minister Sujana Chowdhury
-
కుదరని ఏకాభిప్రాయం
* మెట్టు దిగని టీడీపీ - బెట్టు చేస్తున్న బీజేపీ * నేడు సీట్ల సర్దుబాటుపై ప్రకటన * సైకిల్ సిట్టింగ్ సీట్లలో కొన్నింటికి కమలం గాలం * బాబు ప్రతిపాదనపై బీజేపీ అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: బీజేపీ-టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు పొడవలేదు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపినా, సీట్ల పంపకాల్లో ఇరు పార్టీలనాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఇరు పార్టీల నేతలు ఎవరికి వారే సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్‌లు సమావేశమై బీజేపీ కోరుతున్న, కేటాయించే అవకాశం ఉన్న సీట్లపై చర్చించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొత్తగా బీజేపీ బలం పెరిగిందీ లేదు. టీడీపీ బలం తగ్గిందీ లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లోకి పోయినా, అక్కడున్న ఓటర్లు టీడీపీతోనే ఉన్నారు’ అనే భావనతో టీడీపీ చర్చల ప్రక్రియను ముందుకు నడిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు కూడా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోని మెజారిటీ సీట్లను పొందాలనే ఆలోచనతో ఉన్నారు. ‘2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి శివార్లలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. 2009 కార్పొరేషన్ ఎన్నికల్లో సమైక్య సెంటిమెంట్‌తో శివార్లలో ఎక్కువ డివిజన్లలో టీడీపీ గెలిచింది. దాన్ని ఆసరాగా తీసుకొని బీజేపీకి అవకాశం ఇవ్వకూడదంటే ఒప్పుకునేది లేదు’ అని కమలం నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. శివారు డివిజన్లతోపాటు కోర్‌సిటీలోని డివిజన్లలో కూడా 50:50 ప్రాతిపదికన సీట్లు పంచుకోవాలని అంటున్నారు. టీడీపీకి నాటి బలం లేదు సిట్టింగ్ సీట్లు పోగా మిగతా డివిజన్లను ఆయా పార్టీల బలం ఆధారంగా పంచుకొని పోటీ చేయాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. 2009 మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పటి పరిస్థితికీ, ఇప్పటికీ తేడా ఉన్నందున ఐదేళ్ల క్రితం బలాన్ని ప్రాతిపదికగా తీసుకోలేమని గట్టిగా వాదిస్తోంది. 2009లోని సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తే టీడీపీకి 45 సీట్లు, బీజేపీకి 6 సీట్లు మాత్రమే వస్తాయని, మిగతా 99 సీట్లలో చెరిసగం అనుకున్నా మొత్తం 150 డివిజన్లలో కేవలం 55 సీట్లలోనే పోటీ చేయాల్సి ఉంటుందని ఆందోళన చెందుతోంది. అందుకే బీజేపీ 2014 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాల్లోని (గెలిచిన, ఓడిన) మెజారిటీ డివిజన్లలో బీజేపీ పోటీచేయాలని అక్కడి నియోజకవర్గాల ఇన్చార్జీల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. టీడీపీ నుంచి 45 మంది కార్పొరేటర్లు 2009లో గెలిచినా, ఇప్పుడు 20 మంది కూడా మిగలలేదని, ఈ పరిస్థితుల్లో అక్కడ టీడీపీ కన్నా బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో కూడా టీడీపీ చెప్పిన సీట్లలోనే పోటీ చేయడం వల్ల పార్టీ దెబ్బతింటుందని లెక్కలేస్తున్నారు. 17న బీజేపీ నామినేషన్లు సీట్ల సర్దుబాటుపై గురువారం రాత్రి మరోసారి సమావేశమైన నాయకులు తుది నిర్ణయం తీసుకొని ఎవరికెన్ని స్థానాలన్నది శుక్రవారం అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. శుక్రవారం సంక్రాంతి సెలవు కనుక శనివారం అభ్యర్థులను ఖరారు చేసి ఆదివారం (17న) మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. -
సుజనా చౌదరి రూ.106 కోట్లు ఎగవేశారు
హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంక్ పిటిషన్ బాకీ ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నారు.. అయినా బకాయిలు చెల్లించడంలేదు... లండన్ కోర్టు చెప్పినా స్పందన లేదు . సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, ఆస్తులు అమ్మి మా అప్పులు తీర్చండి .అందుకు లిక్విడేటర్‌ను నియమించండి.. కంపెనీ ఆస్తులు విక్రయించకుండా, అన్యాక్రాంతం చేయకుండా ఆదేశాలివ్వండి విచారణను 18కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమకు 106 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని, సొమ్ము చెల్లించాలని కోరినా సమాధానం చెప్పడంలేదంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్(ఎంసీబీ) ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. తమ బకాయి తిరిగి చెల్లించే పరిస్థితిలో లేనందున ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తమ అప్పు తీర్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఎంసీబీ పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ మారిషస్‌లో హేస్టియా పేరుతో అనుబంధ కంపెనీ ఏర్పాటుచేసింది. హేస్టియా 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్లు రుణం తీసుకుంది. ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారు (గ్యారెంటార్)గా ఉంది. రుణానికి సంబంధించి ఇంగ్లిష్ చట్టాలకు లోబడి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి హేస్టియా రుణ చెల్లింపులు నిలిపివేసింది. వీటి పై హేస్టియాకు ఎంసీబీ పలుమార్లు లేఖలు రాసింది. అయితే, ఒప్పందానికి సవరణలు చేయాలని హేస్టియా కోరగా, అందుకు ఎంసీబీ అంగీకరించింది. ఆ తరువాత కూడా బకాయిలు చెల్లించకుండా మరోసారి ఒప్పందానికి సవరణలు చేయించింది. ఇదే సమయంలో ఎంసీబీ అధికారులు హేస్టియా డెరైక్టర్‌గా ఉన్న సుజనా చౌదరిని ఎస్ఎంఎస్ ద్వారా సంప్రదించారు. బకాయి ఉన్న మాట వాస్తవమేనని, జరుగుతున్న పరిమాణాలకు క్షమాపణలు కోరుతున్నానని ఎంసీబీ అప్పటి గ్లోబల్ బిజినెస్ హెడ్ ప్రతిక్ ఘోష్‌కు 2012, అక్టోబర్ 16న సుజనా చౌదరి ఎస్ఎంఎస్ పంపారు. వీలైనంత త్వరగా మొత్తం వ్యవహారాన్ని పరిష్కరిరు. తాను అమెరికా వెళుతున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చాక బ్యాంకర్లతో మాట్లాడతానని ఆ ఎస్ఎంఎస్లో సుజనా చౌదరి పేర్కొన్నారు. మరో డెరైక్టర్ హనుమంతరావు కూడా డిసెంబర్ నెలలో పంపిన మెయిల్లో బకాయి ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయినా బకాయిలు చెల్లించలేదు. బ్యాంకు పంపిన నోటీసులకు కూడా స్పందన లేదు. ఇదిలా ఉండగానే ఈ మొత్తం వ్యవహారంలో ఇంగ్లిష్ కోర్టుల న్యాయ పరిధిని సవాలు చేస్తూ హేస్డియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు లండన్‌లోని క్వీన్స్ బెంచ్ కమర్షియల్ కోర్టులో ముందస్తుగా ఓ పిటిషన్ వేశాయి. ఇంగ్లిష్ చట్టాల ప్రకారం చేసుకున్న ఒప్పందాల్లో జోక్యం చేసుకునే అధికారం ఇంగ్లండ్ కోర్టులకు ఉందని ఆ న్యాయస్థానం తేల్చి చెప్పింది. వడ్డీతో సహా బకాయి ఉన్న రూ.105 కోట్లు, ఖర్చుల కింద మరో రూ.72 లక్షలు ఎంసీబీకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సైతం హేస్టియా, సుజనా యూనివర్సల్ కంపెనీలు పట్టించుకోలేదు. దీంతో ఎంసీబీ హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి లండన్ కోర్టు తీర్పును అమలు చే యాలని కోరింది. సుజనా యూనివర్సల్ ఆస్తిని జప్తు చేసి, దానిని అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని బకాయి కింద చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఎగ్జిక్యూషన్ పిటిషన్లు (ఈపీ) దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. బకాయి చెల్లించే విషయంలో హేస్టియా, సుజనా యూనివర్సల్ చేస్తున్న అసాధారణ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కంపెనీని మూసివేయాలని కోరుతూ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ వేసింది. సుజనా యూనివర్సల్‌ను మూసివేసి, ఆ కంపెనీ ఆస్తులను విక్రయించి తమ బకాయిలను తీర్చేందుకు ఓ అధికారిక లిక్విడేటర్‌ను నియమించాలని కోరింది. అంతేకాకుండా కంపెనీ ఆస్తులను విక్రయించడం, అన్యాకాంత్రం చేయడం, థర్డ్ పార్టీ హక్కులు సృష్టించడం చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎంసీబీ కోరింది.