కుదరని ఏకాభిప్రాయం
* మెట్టు దిగని టీడీపీ - బెట్టు చేస్తున్న బీజేపీ
* నేడు సీట్ల సర్దుబాటుపై ప్రకటన
* సైకిల్ సిట్టింగ్ సీట్లలో కొన్నింటికి కమలం గాలం
* బాబు ప్రతిపాదనపై బీజేపీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ-టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు పొడవలేదు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపినా, సీట్ల పంపకాల్లో ఇరు పార్టీలనాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి ఇరు పార్టీల నేతలు ఎవరికి వారే సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎ.రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్‌లు సమావేశమై బీజేపీ కోరుతున్న, కేటాయించే అవకాశం ఉన్న సీట్లపై చర్చించారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కొత్తగా బీజేపీ బలం పెరిగిందీ లేదు. టీడీపీ బలం తగ్గిందీ లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లోకి పోయినా, అక్కడున్న ఓటర్లు టీడీపీతోనే ఉన్నారు’ అనే భావనతో టీడీపీ చర్చల ప్రక్రియను ముందుకు నడిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు కూడా పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోని మెజారిటీ సీట్లను పొందాలనే ఆలోచనతో ఉన్నారు.
‘2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి శివార్లలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. 2009 కార్పొరేషన్ ఎన్నికల్లో సమైక్య సెంటిమెంట్‌తో శివార్లలో ఎక్కువ డివిజన్లలో టీడీపీ గెలిచింది. దాన్ని ఆసరాగా తీసుకొని బీజేపీకి అవకాశం ఇవ్వకూడదంటే ఒప్పుకునేది లేదు’ అని కమలం నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. శివారు డివిజన్‌లతోపాటు కోర్‌సిటీలోని డివిజన్‌లలో కూడా 50:50 ప్రాతిపదికన సీట్లు పంచుకోవాలని అంటున్నారు.
టీడీపీకి నాటి బలం లేదు
సిట్టింగ్ సీట్లు పోగా మిగతా డివిజన్‌లను ఆయా పార్టీల బలం ఆధారంగా పంచుకొని పోటీ చేయాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన సూచనలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. 2009 మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పటి పరిస్థితికీ, ఇప్పటికీ తేడా ఉన్నందున ఐదేళ్ల క్రితం బలాన్ని ప్రాతిపదికగా తీసుకోలేమని గట్టిగా వాదిస్తోంది. 2009లోని సిట్టింగ్ సీట్లలో పోటీ చేస్తే టీడీపీకి 45 సీట్లు, బీజేపీకి 6 సీట్లు మాత్రమే వస్తాయని, మిగతా 99 సీట్లలో చెరిసగం అనుకున్నా మొత్తం 150 డివిజన్లలో కేవలం 55 సీట్లలోనే పోటీ చేయాల్సి ఉంటుందని ఆందోళన చెందుతోంది.
అందుకే బీజేపీ 2014 ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గాల్లోని (గెలిచిన, ఓడిన) మెజారిటీ డివిజన్లలో బీజేపీ పోటీచేయాలని అక్కడి నియోజకవర్గాల ఇన్‌చార్జీల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. టీడీపీ నుంచి 45 మంది కార్పొరేటర్లు 2009లో గెలిచినా, ఇప్పుడు 20 మంది కూడా మిగలలేదని, ఈ పరిస్థితుల్లో అక్కడ టీడీపీ కన్నా బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో కూడా టీడీపీ చెప్పిన సీట్లలోనే పోటీ చేయడం వల్ల పార్టీ దెబ్బతింటుందని లెక్కలేస్తున్నారు.
17న బీజేపీ నామినేషన్లు
సీట్ల సర్దుబాటుపై గురువారం రాత్రి మరోసారి సమావేశమైన నాయకులు తుది నిర్ణయం తీసుకొని ఎవరికెన్ని స్థానాలన్నది శుక్రవారం అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించారు. శుక్రవారం సంక్రాంతి సెలవు కనుక శనివారం అభ్యర్థులను ఖరారు చేసి ఆదివారం (17న) మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేయాలని బీజేపీ నిర్ణయించింది.