విజయనగరం పూల్‌బాగ్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలను కూల్చివేయాలని, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖి ల భారత అధ్యక్షుడు డాక్టర్ హేమలత పిలుపునిచ్చారు. విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి గురజాడ కళాభారతి వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆల్‌ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆది, సోమవారాల్లో విజయనగరంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు.
మన దేశంలో పేదల కడుపుకొట్టి ధనవంతులకు దోచిపెడుతున్నారన్నారు. బీజేపీ కులంపేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని తెలిపారు. నరేంద్రమోదీ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో దేశ సమైక్యతను దెబ్బతీసేలా మాట్లాడటం అంటే కార్మిక, ఉద్యోగ, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎ గపూర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి జపంతో ప్రజల ఆస్తులను పెట్టుబడుదారులకు అప్పనంగా ఇస్తున్నారన్నారు. కనీసవేతనం అమలు చేయలేని మోదీ, చంద్రబాబులకు పాలించే హక్కులేదని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరావమ్మ, బేబిరాణి తదతరులు పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment