విజయనగరం అర్బన్: రోజూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న వేల కోట్ల అవినీతిపై ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా పట్టణానికి వచ్చిన ఆయన స్థానిక ప్రైవేటు హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోని అవినీతి పనులను ఎండగట్టారు. కేంద్రం ఇస్తున్న వేల కోట్ల నిధులను తండ్రీ కొడుకులు కలిసి దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రం ఇంతవరకు రూ.16 వేల కోట్లను రాష్ట్రానికి విడుదల చేస్తే యంత్రాలతో మట్టిని తీసి నిధులను దోచుకున్నారని విమర్శించారు.
నిజంగా ఆ నిధులు సద్వినియోగం చేస్తే వర్షపు నీళ్లతో చెరువులు కళకళలాడేవని.. కరువు జాడలు కనిపించేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఏటా రూ.30 వేల కోట్ల వంతున నాలుగేళ్లలో రూ.120 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే మధ్యాహ్న భోజనానికి కనీసం గుడ్డు పెట్టే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, ఆ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యార్ధులకు ఇచ్చే యూనిఫాం నిధుల్లోనూ రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ ద్వారా దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, ఎమ్మెల్సీ మాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి, పూడి వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తి అచ్చిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment