citu leaders
-
కనీస వేతనాలు అమలు చేయాలి
వరంగల్ రూరల్ : జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, టెక్స్టైల్ పార్కు పనులను పూర్తి చేసి ఉపాధి కల్పించాలని, బుధవారం వివిధ కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని ఐటీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు డిమాండ్లు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి అదుపులో పెట్టాలని కనీస వేతనం నెలకు రూ.18,000 నిర్ణయించాలని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నక్క చిరంజీవి, సీఐటీయూ జిల్లా కోశాధికారి అనంత గిరి రవి, సీఐటీయూ జిల్లా నాయకులు బొల్ల కొమురయ్య, జీపీ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు. -
మోదీ, బాబులను ఇంటికి సాగనంపండి
విజయనగరం పూల్‌బాగ్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలను కూల్చివేయాలని, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ అఖి ల భారత అధ్యక్షుడు డాక్టర్ హేమలత పిలుపునిచ్చారు. విజయనగరం రైల్వేస్టేషన్ నుంచి గురజాడ కళాభారతి వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రీనివాస అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఆల్‌ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆది, సోమవారాల్లో విజయనగరంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. మన దేశంలో పేదల కడుపుకొట్టి ధనవంతులకు దోచిపెడుతున్నారన్నారు. బీజేపీ కులంపేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టిస్తోందని తెలిపారు. నరేంద్రమోదీ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో దేశ సమైక్యతను దెబ్బతీసేలా మాట్లాడటం అంటే కార్మిక, ఉద్యోగ, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసే కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ నర్సింగరావు, ఎంఎ గపూర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి జపంతో ప్రజల ఆస్తులను పెట్టుబడుదారులకు అప్పనంగా ఇస్తున్నారన్నారు. కనీసవేతనం అమలు చేయలేని మోదీ, చంద్రబాబులకు పాలించే హక్కులేదని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జగ్గునాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరావమ్మ, బేబిరాణి తదతరులు పాల్గొని ప్రసంగించారు. -
ధార్మిక సంస్థలో అధర్మం రాజ్యమేలుతోంది
తిరుపతి అర్బన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీ ధార్మిక సంస్థలో అధికారుల వైఫల్యం వల్ల అధర్మం రాజ్యమేలుతోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. టీటీడీకి చెందిన పద్మావతీ కంపెనీ నిర్వాహకుల స్వార్థానికి ఉద్యోగాలు పోగొట్టుకున్న కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు కందారపు మురళి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి బంధువు కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న పద్మావతీ కంపెనీ వారు తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను నిబంధనల పేరుతో అకస్మాత్తుగా తొలగించడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పద్మావతీ కంపెనీ యాజమాన్యం అగ్రిమెంట్లో రాసుకున్న విధానానికి తిలోదకాలిచ్చి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుబ్రమణ్యం, గోపినాథ్, రజని, కుమార్, సురేష్, నారాయణ, మల్లికార్జున, మార్కొండయ్యతోపాటు కార్మికులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలకు 010 పద్దు కింద జీతాలివ్వాలి
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి దుబ్బాక : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి అన్నారు. ఆదివారం దుబ్బాకలో నిర్వహించిన వేతనాల పెంపు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల వేతనాలను ప్రభుత్వం పెంచిందని, రూ. 6500 ఉన్న వేతనం ప్రస్తుతం రూ. 10500లకు పెరిగిందని, తెలంగాణ సాధన ఇంక్రిమెంట్ కింద రూ. 200 ఇస్తోందన్నారు. వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు అర్హులైన వారికి వీఆర్వో, అటెండర్ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వేతనాల పెంపుతో వీఆర్ఏలకు ఆర్థిక ప్రయోజనం లభించినప్పటికీ 010 పద్దుల కింద జీతాలు ఇవ్వకుంటే ప్రతి నెలా వేతనాలు అందడంలో చాలా ఇబ్బందులొస్తాయన్నారు. పెంచిన వేతనాలను వీఆర్ఏలకు 010 పద్దు ఖాతాల ద్వారానే అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కడుపు కొట్టకండి బాబూ..
కదిరి టౌన్/పెనుకొండ/ కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం క్రైం : ‘‘ఇంటికో ఉద్యోగమిస్తామని ఎన్నికలకు ముందు హామీల మీద హామీలిచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు.. ఇలా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశ్నించారు. తమను తొలగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, అనంతపురంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. కదిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు. పెనుకొండలో.. డివిజన్ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి బస్టాండ్ నుంచి దర్గా సర్కిల్, అంబేద్కర్ నగర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. కళ్యాణదుర్గంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ‘బాబు వస్తే జాబు అన్నారు.. బాబు వచ్చె.. జాబు పోయె అన్నట్లుంది పరిస్థితి.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ఉద్యోగాల్ని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో 850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 200 మంది మేట్లు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేయాలన్నారు. నెలసరి వేతనం రూ.13 వేలకు పెంచి బకాయిలు చెల్లించాలన్నారు. ఇప్పటికే తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏడాది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, వికలాంగులైనఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీల వేతన బకాయిలు చెల్లించాలని, కూలి రూ.250కు పెంచడంతో పాటు క్యూబిక్ మీటర్ రేటు పెంచాలన్నారు. అర్హులైన ఫీల్డ్ అసిస్టెంట్లకు సీఓ, టీఏ, ఏపీఓ, ఈసీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కదిరిలో ఆర్డీఓ రాజశేఖర్, పెనుకొండలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి వినతిపత్రాలు అందజేశారు. అనంతపురంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేష్, అధ్యక్షుడు నరసింహులు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి వర్గం సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని ఓ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలు వేలాది కుంటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చుతోంద ని వారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతి పరులని, కోట్లకు పడగలెత్తారని మంత్రి మీడియా ముందు లేని పోని ప్రకటనలిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తోందన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి సరస్వతి, సీఐటీయూ కదిరి డివిజన్ కార్యదర్శి జీఎల్ నరసింహులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, పెనుకొండ డివిజన్ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలునాయక్, సీఐటీయూ కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి రంగనాథ్, రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు మురళి, మండలాధ్యక్షులు సర్వోత్తమకుమార్, పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.